సంఘటన స్థలంలో ప్రమాదానికి గురైన వాహనాలు
ప్రకాశం, కొమరోలు (గిద్దలూరు): రోడు పక్కన ఆగి ఉన్న ఆటోను ట్రావెల్స్ వ్యాన్ ఢీకొట్టడంతో ఆటోడ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లె గ్రామంలో మంగళవారం జరిగింది. నంద్యాల – ఒంగోలు నేషనల్ హైవేపై ఉన్న గుండ్రెడ్డిపల్లె గ్రామంలో వాహనాల వేగాన్ని నిరోధించేందుకు స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేశారు. మోటు వైపు నుంచి గిద్దలూరు వైపు వస్తున్న లారీ స్పీడ్ బ్రేకర్ల వద్ద ఒక్కసారిగా ఆగడంతో దాని వెనకాలే వస్తున్న ట్రావెల్స్ వ్యాన్ లారీని ఢీకొట్టకుండా ఉండేందుకు కుడిచేతి వైపు డ్రైవర్ మళ్లించాడు. అదే సమయంలో దూదేకుల గణేష్ (40) ఆటోను తన ఇంటి ముందు ఆపి అందులోనే కూర్చుని సెల్ చూసుకుంటున్నాడు. ట్రావెల్స్ వ్యాన్ ఒక్కసారిగా ఆటోను ఢీకొట్టి 30 అడుగుల దూరం వరకు నెట్టుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న గణేష్ కిందపడి ఎడమ కాలు, తలకు తీవ్రగాయాలయ్యాయి.
ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.సంఘటన స్థలంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని వ్యాన్ ఢీకొట్టి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసిన అధికారులు వాటి వద్ద సూచిక గీతలు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు వేగంగా వచ్చి స్పీడ్‌బ్రేకర్ల వద్ద ఒక్కసారిగా బ్రేకులు వేస్తున్నారు. దానివలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు చొరవ తీసుకుని స్పీడ్ బ్రేకర్లపై జెరాఫీ చారలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment