van accident
-
బాలకృష్ణ బృందానికి రోడ్డు ప్రమాదం.. ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు
సినిమా బృందం ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు జూనియర్ ఆర్టిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. జూనియర్ ఆర్టిస్టులు బాలకృష్ణ సినిమా షూటింగ్‌కు వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లికి వ్యాన్‌లో బయలుదేరగా ప్రగతి నగర్ చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీకే దిన్నె మండలం మద్దిమడుగులో వ్యాన్ బీభత్సం సృష్టించింది. రోడ్డు పనులు చేస్తున్నవారిపై వ్యాన్ దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించారు. చదవండి: ప్రేమపేరుతో ట్రాప్.. లాడ్జికి తీసుకెళ్లి.. మద్యం తాగించి -
పాకిస్తాన్లో మరో ఘోర ప్రమాదం
ఇస్లామాబాద్: ఘోర రైలు ప్రమాదం జరిగి 50 మంది మృతి చెందిన సంఘటన మరువకముందే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది. సింధు నదిలో వ్యాన్ పడిపోవడంతో 17 మంది దుర్మరణం పాలయ్యారు. సింధు నదిలో ప్రవాహం ఉధృతి ఉండడంతో మృతదేహాలు వెలికితీయడంలో ఆలస్యం జరుగుతోంది. ఈ ఘటన ఆ దేశంలోని పానిబా ప్రాంతంలో జరిగింది. ఓ కుటుంబానికి చెందిన వారంతా వ్యాన్ అద్దెకు తీసుకుంటూ టూర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాకిస్తాన్ చిలాస్‌కు చెందిన ఓ కుటుంబం వ్యాన్‌ను అద్దెకు తీసుకుంది. డ్రైవర్‌తో సహా మొత్తం 17 మందితో కూడిన వ్యాన్ చిలాస్ నుంచి రావల్పిండికి బయల్దేరింది. మార్గమధ్యలో కోహిస్తాన్ జిల్లాలోని పానిబా ప్రాంతానికి చేరుకోగానే వ్యాన్ అదుపు తప్పి సింధు నదిలోకి పడిపోయింది. డ్రైవర్‌తో సహా అందరూ మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వ్యాన్‌లో మృతదేహాలు కనిపించలేదు. ఆ ప్రవాహానికి మృతదేహాలు కొట్టుకుపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఒక మహిళ మృతదేహం మాత్రమే లభించినట్లు కోహిస్తాన్ పోలీస్ ఆరీఫ్ జావేద్ తెలిపారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది దుర్మరణం
పాట్నా: పాట్నాలోని దానపూర్ ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అతివేగంతో అదుపు తప్పిన ఒక వ్యాన్ దానపూర్ ప్రాంతంలోని పాంటూన్ వంతెనపై నుంచి గంగా నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు. అఖీపూర్‌లో ప్రాంతంలోని పీపా పుల్ను దాటుతుండగా 13 మంది వ్యక్తులతో ఉన్న వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో గంగా నదిలోకి దూసుకెళ్లింది. నలుగురుకి ఈత రావడంతో వారు ప్రాణాలు దక్కించుకోగా, మిగతా తొమ్మిది మంది అక్కడే మరణించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ తెలిపారు. అఖీపూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 07.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దనాపూర్లోని చిత్రకూట్నగర్కు చెందిన ఓ ఫ్యామిలీ అఖీపూర్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యి తిరిగి సొంతూరి పయనమయ్యారు. నదిలో పడిపోయిన వ్యాన్‌లో ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 13 మంది ఉన్నారు. ఐతే పీపాపుల్ బ్రిడ్జిపైకి చేరుకోనే వ్యాన్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అనంతరం ఆ వ్యాన్ నేరుగా నదిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎప్ బృందాలు గజ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. నదిలోకి దిగి గాలించగా 9 మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేల్ చంద్రశేఖర్ సింగ్ ప్రకటించారు. బిజెపీ లోక్‌సభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి రామ్‌క్రీపాల్ యాదవ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. చదవండి: ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి! -
బావిలో పడ్డ వ్యాన్.. డ్రైవర్, క్లీనర్ మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని కోటబోమ్మాళి మండలం పాకీవలస వద్ద రోడ్డు ప్రమాదం మంగళవారం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న నేల బావిలో పడిపోయింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో చిక్కుకుపోయిన డ్రైవర్, క్లీనర్ మృతదేహాలను పోలీసులు బావి నుంచి బయటకు తీశారు. మృతి చెందిన డ్రైవర్, క్లీనర్ ఒడిశాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. చదవండి: కుషాయిగూడలో భారీ అగ్ని ప్రమాదం -
తంటికొండ ఘటన: ఆగని మృత్యుఘోష
గోకవరం(తూర్పుగోదావరి): ఆ రక్తపు మరకలు ఇంకా మాయలేదు.. ఆక్రందనలు ఆగలేదు.. మృత్యుఘోష వీడలేదు.. తంటికొండ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోరుకొండ మండలం గాదరాడకు చెందిన చాగంటి సుజాత (38) ఆదివారం మృతి చెందినట్టు గోకవరం ఎస్సై పి.చెన్నారావు చెప్పారు. ప్రమాద స్థలంలోనే ఐదుగురు మృత్యువాత పడగా, ఆస్పత్రిలో సుజాత కుమార్తె హేమనీ శ్రీలలిత (13), పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపురం గ్రామానికి చెందిన సోమరౌతు గోపాలకృష్ణ (72) దుర్మరణం పాలయ్యారు. మృతురాలు సుజాత పెళ్లి కుమారుడికి సోదరి. ఈమెకు గాదరాడకు చెందిన పెద్దరాజుతో 16 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమారుడితో పాటు కుమార్తె హేమనీ శ్రీలలిత ఉన్నారు. సోదరుడి వివాహం నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలసి ఠాకూరుపాలెం వెళ్లింది. తమ్ముడి వివాహాన్ని దగ్గరుండి జరిపించిన ఆమె అనంతరం జరిగిన దుర్ఘటనలో కుమార్తెతో పాటు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన కొద్ది సేపటికే కుమార్తె మృతి చెందగా తీవ్రంగా గాయపడిన సుజాత చికిత్స పొందుతూ ఆదివారం ప్రాణాలు విడిచింది. తల్లీ కుమార్తెల మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతురాలి సోదరి గోకవరానికి చెందిన కంబాల భాను (33) ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే మృతి చెందింది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో గాయపడిన గోకవరానికి చెందిన కంబాల వెంకటరమణ, కంబాల మోహన సీతామలక్షి్మ, ఠాకూరుపాలేనికి చెందిన సింహాద్రి చంద్ర, కాపవరానికి చెందిన జాజుల లక్ష్మన్న, జాజుల లక్షి్మ, గాదరాడకు చెందిన చాగంటి నూకరత్నం, పశి్చమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం తాళ్లపురం గ్రామానికి చెందిన సోమరౌతు వెంకటలక్షి్మ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం తాడితోట (రాజమహేంద్రవరం): తంటికొండ దేవస్థానంలో ఘోర రోడ్డు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని దర్యాప్తు అధికారి, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా సెంట్రల్ డీఎస్పీ జేవీ సంతోష్ తెలిపారు. వ్యాన్‌పై వెళ్లిన పెళ్లి బృందం కొండ పైనుంచి కిందకు దిగుతుండగా వాహనం అదుపు తప్పి పడిపోయిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందారన్నారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్ మద్యం తాగాడా లేదా అనేది పోస్టుమార్టం రిపోర్టును బట్టి తేలుతుందని ఆయన చెప్పారు. -
ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ వ్యాన్
ప్రకాశం, కొమరోలు (గిద్దలూరు): రోడు పక్కన ఆగి ఉన్న ఆటోను ట్రావెల్స్ వ్యాన్ ఢీకొట్టడంతో ఆటోడ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లె గ్రామంలో మంగళవారం జరిగింది. నంద్యాల – ఒంగోలు నేషనల్ హైవేపై ఉన్న గుండ్రెడ్డిపల్లె గ్రామంలో వాహనాల వేగాన్ని నిరోధించేందుకు స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేశారు. మోటు వైపు నుంచి గిద్దలూరు వైపు వస్తున్న లారీ స్పీడ్ బ్రేకర్ల వద్ద ఒక్కసారిగా ఆగడంతో దాని వెనకాలే వస్తున్న ట్రావెల్స్ వ్యాన్ లారీని ఢీకొట్టకుండా ఉండేందుకు కుడిచేతి వైపు డ్రైవర్ మళ్లించాడు. అదే సమయంలో దూదేకుల గణేష్ (40) ఆటోను తన ఇంటి ముందు ఆపి అందులోనే కూర్చుని సెల్ చూసుకుంటున్నాడు. ట్రావెల్స్ వ్యాన్ ఒక్కసారిగా ఆటోను ఢీకొట్టి 30 అడుగుల దూరం వరకు నెట్టుకెళ్లింది. దీంతో ఆటోలో ఉన్న గణేష్ కిందపడి ఎడమ కాలు, తలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.సంఘటన స్థలంలో రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని వ్యాన్ ఢీకొట్టి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేసిన అధికారులు వాటి వద్ద సూచిక గీతలు ఏర్పాటు చేయలేదు. దీంతో వాహనదారులు వేగంగా వచ్చి స్పీడ్‌బ్రేకర్ల వద్ద ఒక్కసారిగా బ్రేకులు వేస్తున్నారు. దానివలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు చొరవ తీసుకుని స్పీడ్ బ్రేకర్లపై జెరాఫీ చారలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిముందే కొడుకు దుర్మరణం
చెల్లి పుట్టినరోజే ఆ బాలుడికి చివరి రోజైంది. సంతోషంగా ఆలయానికి వెళ్లి వస్తుండగా వ్యాను రూపంలో వచ్చిన మృత్యువు బాలుడిని కబళించింది. ఆ ఇంటిలో విషాదాన్ని నింపింది. కళ్ల ముందే కొడుకు మృత్యువాత పడడంతో ఆ తల్లి రోదన అంతా ఇంతా కాదు. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఈ హృదయ విదారక సంఘటన పాకాలలో గురువారం జరిగింది. చిత్తూరు, పాకాల : వ్యాను ఢీకొని బాలుడు దుర్మరణం చెందిన సంఘటన పాకాలలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం అయ్యప్పగారిపల్లికి చెందిన వెంకటేష్, రాజకుమారి దంపతులకు కుమారుడు దీపక్(4), కుమార్తె భూమిశ్రీ ఉన్నారు. గురువారం భూమిశ్రీ పుట్టిన రోజు కావడంతో వెంకటేష్ తండ్రి జగ్గయ్య నేండ్రగుంటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి కోడలు రాజకుమారి, మనవడు, మనవరాలిని ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లాడు. తిరిగి వస్తుండగా పాకాలలోని చిత్తూరు రోడ్డు వద్ద ప్లాస్టిక్ పైపుల లోడుతో వెళుతున్న వ్యాను ఢీకొంది. దీంతో జగ్గయ్య, రాజకుమారి, భూమిశ్రీ, వెంకటేష్ కింద పడిపోయారు. బాలుడు దీపక్‌పై వాహనం ఎక్కడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వ్యాను డ్రైవర్ గుంటూరు జిల్లాకు చెందిన రత్నం కుమారుడు రాంబాబు (37)ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
పొట్టకూటి కోసం వెళ్తుండగా..
చిట్టమూరు(నెల్లూరు): ఎదురుగా వస్తున్న మోటారుసైకిల్‌ను తప్పించే క్రమంలో రొయ్యల కంపెనీ వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడడంతో పొట్టకూటి కోసం కంపెనీలోకి పనికి వెళ్తున్న 29 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని మల్లాం సమీపంలో ఆదివారం వేకువన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కోట మండలం చెందోడు వద్ద ఉన్న సాగర్ గాంధీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జీవీఆర్) రొయ్యల కంపెనీలో పనికి వాకాడు మండలం వాలమేడు, వైట్ కుప్పం తదితర గ్రామాలకు చెందిన మహిళా కూలీలు నిత్యం వెళ్తుంటారు. రోజూలాగే ఆదివారం వేకువన 29 మంది మహిళలు కంపెనీ వ్యాన్‌లో పనికి బయలుదేరారు. మండలంలోని తిరుమూరు గ్రామానికి వెళ్లే మలుపు వద్దకు వ్యాన్ వచ్చేసరికి ఎదురుగా మోటారు సైకిల్ వచ్చింది. డ్రైవర్ మోటారు సైకిల్‌ను తప్పించబోగా వ్యాన్ అదుపుతప్పి ఒక్కసారిగా తిరగబడి పోయింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లోని 29 మంది మహిళలు కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. మహిళల అరుపులను విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలు పాలైన వారిని వ్యాన్‌లో నుంచి బయటకు తీసి ఆటోల్లో మల్లాం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. 108కు ఫోన్ చేసినా సకాలంలో స్పందించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన గంట తర్వాత రెండు 108 వాహనాలు మల్లాం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చాయి. తీవ్రంగా గాయపడిన వారిని ప్రథమ చికిత్స అనంతరం గూడూరు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మహిళలను నెల్లూరు వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. చిట్టమూరు ఎస్సై వేణుగోపాల్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. వ్యాన్ డ్రైవర్‌ను విచారించి వివరా>లు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పరిమితికి మించి కూలీలను ఎక్కించడంతోనే.. జీవీఆర్ కంపెనీకు చెందిన వ్యాన్ సీటింగ్ కెపాసిటీ 15 మంది కాగా, పరిమితికి మించి ఎక్కించడంతో ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు, పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో గాయపడిన కూలీలకు వైద్యం అందించి కంపెనీ ఆదుకోవాలని కోరారు. -
బాలల దినోత్సవం రోజున విషాదం
అమ్మా.. ఈ రోజు మా స్కూల్లో పండుగ చేస్తారంట.. పిల్లలందరూ అందంగా రెడీ అవ్వాలంట.. నాకు కొత్త దుస్తులు వెయ్యి.. రోజాపూలు పెట్టు..’ అంటూ ఆ చిన్నారి చిట్టిపొట్టి మాటలతో తల్లిదండ్రులను మురిపించింది. తాను అనుకున్నట్టుగానే రెడీ అయ్యి.. స్కూలు వ్యాను ఎక్కి అమ్మకు టాటా చెప్పింది. సాయంత్రం పాఠశాలలో జరిగిన విశేషాలను ఆనందంతో మోసుకొచ్చింది. వాటిని తన తల్లికి తెలియజేయాలని ఉబలాటపడింది. స్కూలు వ్యాను దిగి ఆత్రుతగా ఇంటివైపు వెళ్తోంది. ఇంతలో వ్యాను వెనుకకు రావడం తో ఆ చక్రాల కిందే పడి నలిగిపోయింది. తలమొత్తం నుజ్జునుజ్జుయింది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంధువుల రోదనలతో గ్రామం దద్ధరిల్లింది. ఈ ఘటన బాలల దినోత్సవం రోజైన మంగళవారం యాదమరి మండలంలో విషాదాన్ని నింపింది. చిత్తూరు జిల్లా / యాదమరి: బాలల దినోత్సవం రోజున ఓ చిన్నారి స్కూలు వ్యాను కింద పడి నలిగిపోయిన ఘటన యాదమరి మండలం దళవాయిపల్లెలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మణి, అరుణకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద పాప కుసుమ(6). ఇంగ్లిష్ చదువులు చదివించాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు. ఆర్థిక స్థోమత సహకరించకపోయినా చిత్తూరులోని ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చేర్పించారు. మురిపించిన చిలుక పలుకలు బాలల దినోత్సవం కావడంతో మంగళవారం స్కూలుకు వెళ్లడానికి కుసుమ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అమ్మ వద్ద చిలుకపలుకుతో అందంగా రెడీ చేయాలని సూచించింది. చాచా నెహ్రూ చిత్రపటం వద్ద పూలు పెట్టాలని రోజాలు కోసివ్వమని చెప్పింది. చిట్టితల్లి చెప్పినట్టుగానే తల్లి చిన్నారిని అందంగా రెడీ చేసింది. మధ్యాహ్నానికి క్యారియర్, పుస్తకాల బ్యాగ్ రెడీ చేసి, రోజాలు కోసిచ్చి బడి వ్యాను ఎక్కించింది. అనుకోని విషాదం సాయంత్రం దళవాయిపల్లెకి స్కూలు వ్యాను చేరింది. ఆత్రుతగా దిగి ఇంటివైపు నడక సాగించింది కుసుమ. స్కూల్లో జరిగిన విశేషాలు తల్లికి తెలియజేయాలని ఉబలాటపడింది. జరిగిన వాటిని తలుచుకుం టూ స్కూలు వ్యాను వెనుక నుంచి ఇంటికి బయలుదేరింది. ఇంతలో డ్రైవర్ వ్యాను వెనుకకు నడపడంతో తప్పించుకోలేక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. బంధువుల రోదనలతో గ్రామం దద్దరిల్లింది. స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బేగంపేటలో వ్యాన్ ప్రమాదం : ఆరుగురికి గాయాలు
హైదరాబాద్ : నగరంలో శనివారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బేగంపేటలో జనాల పైకి ఓ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల వివరాలతో పాటు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
వ్యాన్ బోల్తా...20 మందికి గాయాలు
వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా మెర్కొండ మండలం అమీన్‌పేట సమీపంలో గురువారం అర్థరాత్రి ప్రయాణిస్తున్న వ్యాను బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి, వీరిలో నలుగరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. -
వ్యాన్ - ట్రాక్టర్ ఢీ: ఒకరు మృతి
కాగజ్‌నగర్ మండలం గురుజగూడ గ్రామ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున వ్యాను, ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.