దీపక్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి రాజకుమారి
చెల్లి పుట్టినరోజే ఆ బాలుడికి చివరి రోజైంది. సంతోషంగా ఆలయానికి వెళ్లి వస్తుండగా వ్యాను రూపంలో వచ్చిన మృత్యువు బాలుడిని కబళించింది. ఆ ఇంటిలో విషాదాన్ని నింపింది. కళ్ల ముందే కొడుకు మృత్యువాత పడడంతో ఆ తల్లి రోదన అంతా ఇంతా కాదు. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఈ హృదయ విదారక సంఘటన పాకాలలో గురువారం జరిగింది.
చిత్తూరు, పాకాల : వ్యాను ఢీకొని బాలుడు దుర్మరణం చెందిన సంఘటన పాకాలలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం అయ్యప్పగారిపల్లికి చెందిన వెంకటేష్, రాజకుమారి దంపతులకు కుమారుడు దీపక్(4), కుమార్తె భూమిశ్రీ ఉన్నారు. గురువారం భూమిశ్రీ పుట్టిన రోజు కావడంతో వెంకటేష్ తండ్రి జగ్గయ్య నేండ్రగుంటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి కోడలు రాజకుమారి, మనవడు, మనవరాలిని ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లాడు.
తిరిగి వస్తుండగా పాకాలలోని చిత్తూరు రోడ్డు వద్ద ప్లాస్టిక్ పైపుల లోడుతో వెళుతున్న వ్యాను ఢీకొంది. దీంతో జగ్గయ్య, రాజకుమారి, భూమిశ్రీ, వెంకటేష్ కింద పడిపోయారు. బాలుడు దీపక్‌పై వాహనం ఎక్కడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వ్యాను డ్రైవర్ గుంటూరు జిల్లాకు చెందిన రత్నం కుమారుడు రాంబాబు (37)ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment