నటరాజు మృతదేహం (ఇన్‌సెట్) నటరాజు (ఫైల్)
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): ఎప్పటిలాగే ఓ ఆటో డ్రైవర్ బుధవారం రాత్రి 104 ఏరియా ప్రధాన రహదారి నుంచి తన ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో అప్పటికే కాపుకాసిన ఇద్దరు దుండగులు వెనుక నుంచి వచ్చి బీరు బాటిళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. వెంబడించి తీవ్రంగా గాయపరిచి పరారయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో హతాశులైన స్థానికులు వెంటనే తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. గాయాలతో ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. 104 ఏరియాలో సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి ఎయిర్‌పోర్టు జోన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొబ్బరితోట ప్రాంతానికి చెందిన కొప్పర నటరాజు(35) మూడు నెలల కిందట 104 ఏరియా బాపూజీనగర్ సమీప వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో నివసిస్తున్నాడు.
ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 8.30గంటల సమయంలో 104 ఏరియా ప్రధాన రహదారి నుంచి బాపూజీనగర్ సమీపంలోని తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. వీధిలోకి రావడం గమనించిన దుండగులు వెనుక నుంచి వెంబడించారు. వెంట తెచ్చుకున్న బీరు బాటిళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. తల వెనుక భాగంలో, మెడ, కడుపుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. పరుగెడుతూ వచ్చి ఇంటి సమీపంలో అచేతనంగా నటరాజు పడిపోయాడు. దీంతో దుండగులు పరారయ్యారు. ఈ హఠాత్ పరిణామంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఎయిర్‌పోర్ట్ జోన్ పోలీసులకు తెలియజేశారు.
ఎయిర్‌పోర్ట్ స్టేషన్ సీఐ మళ్ల శేషు, ఎస్‌ఐలు నర్సింగరాజు, నాగేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరశీలించి వివరాలు సేకరించారు. గాయాలతో ఉన్న నటరాజును కేజీహెచ్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతునికి భార్య పార్వతి, ఇద్దరు పిల్లలున్నారు. క్లూస్ టీమ్ సభ్యులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. జాగిలం ఘటనా స్థలం వద్ద చుట్టూ తిరిగి బీఆర్‌టీఎస్ రహదారి వైపు పరుగులు తీసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment