
రిమ్స్‌లో చికిత్స పొందుతున్న పుష్పలత
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. నార్నూర్ మండలం చోరపల్లి గ్రామానికి చెందిన దంపతులు దిరబసి గణేశ్, మమతకు పుట్టిన మగ శిశువును కిడ్పాప్ చేయగా పోలీసులు రెండు గంటల్లోనే కేసు ఛేదించి శిశువును తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే రిమ్స్ నుంచి శిశువును అపహరించిన నిందితురాలు పుష్పలత తనకు పిల్లలు కావడం లేదని.. అందుకే తీసుకెళ్లినట్లు ఆ రోజు పోలీసులకు చెప్పింది. అయితే ఇప్పుడు అసలు విషయం బయటపడింది. నిందితురాలు పుష్పలతకు పిల్లలు కావడం లేదనేది అబద్దమని.. ఆమె అప్పటికే ఏడు నెలల గర్భవతి అని పోలీసుల విచారణలో తేలింది. మరీ శిశువును ఎందుకు ఎత్తుకెళ్లిందనే దానిపై ఆరా తీయగా అమ్ముకునేందుకే తీసుకెళ్తున్నట్లు చెప్పిందని పోలీసులు తెలిపారు.
రూ.50 వేలకు విక్రయించేది
రిమ్స్ నుంచి శిశువును కిడ్నాప్ చేసిన నిందితులు జీపులో నిర్మల్ వైపు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే పిల్లలు లేరన్న నిందితులు శిశువును ఇతర ప్రాంతాలకు ఎందుకు తీసుకెళ్తున్నారో అనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే నిందితులు పుష్పలత, నగేశ్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేశారు. శిశువును ఇంటికి తీసుకెళ్లగుండా నిర్మల్ వైపు ఎందుకు తీసుకెళ్లారని ఆరా తీయడంతో అసలు విషయం చెప్పారు. నిర్మల్‌లో ఉన్న తమ మేనత్తకు పిల్లలు లేరని, వారికి శిశువును ఇచ్చేసి రూ.50 వేలు తీసుకుందామని నిర్ణయించినట్లు నిందితురాలు చెప్పిందని ఆదిలాబాద్ డీఎస్పీ నర్సింహారెడ్డి తెలిపారు. గతంలో వీరు రిమ్స్ ఆస్పత్రిలో పనిచేసిన అనుభవం ఉండడంతో శిశువును దత్తతకు తీసుకునేందుకు ఎవరైనా ఉంటే చెప్పండని, వారికి డబ్బులు కూడా ఇద్దామని మేనత్త చెప్పినట్లు వెల్లడించారు. కిడ్నాప్ చేసి తీసుకొస్తున్న విషయం వారి మేనత్తకు కూడా తెలియకపోవడం గమనార్హం. అక్కడికి వెళ్లిన తర్వాత డబ్బులు తీసుకొని ఏదో ఒకటి చెబుతామని వీరు భావించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
స్కానింగ్‌తో బయటపడ్డ వైనం..
పోలీసులు అరెస్టు చేసిన తర్వాత నిందితులను వైద్య పరీక్షలు చేసి జిల్లా జైలుకు తరలిస్తారు. ఈ క్రమంలోనే సదరు నిందితురాలికి వైద్య పరీక్షలు, స్కానింగ్ చేయడంతో ఆమె గర్భవతిగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం జైలుకు తరలించారు. జైల్లో సైతం రక్త పరీక్షలు, తదితర పరీక్షలు చేయించి రిపోర్టులు తీయించారు. కాగా సదరు నిందితురాలు శుక్రవారం రాత్రి బ్లీడింగ్ అవుతుందని తెలయడంతో రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు, స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో శిశువు మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో అబార్షన్ చేసి శిశువును బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించి పంచనామా చేశారు. ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలోని ఎంఐసీయూ వార్డులో ఆమె చికిత్స పొందుతోంది. ఆమెకు పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.
విక్రయించేందుకే కిడ్నాప్ చేశారు
రిమ్స్‌లో శిశువును కిడ్నాప్‌చేసిన నిందితులు మొదట్లో పిల్లలు లేరని చెప్పారు. కానీ పోలీసులు మరోకోణంలో విచారణ చేపట్టగా వారు శిశువును విక్రయించేందుకే అపహరించినట్లు తేలింది. ఆమె తరపు బంధువులకు రూ.50 వేలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది. ముందుగా చెప్పినట్లు పిల్లలు కావడం లేదన్న నిందితురాలు అప్పటికే ప్రెగ్నెంట్ ఉన్నట్లు తేలింది. శుక్రవారం కడుపులో శిశువు మృతి చెందడంతో వైద్యులు అబర్షన్ కూడా చేశారు.
– నర్సింహారెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ

శిశువును తల్లికి అప్పగిస్తున్న పుష్పలత (ఫైల్)
Comments
Please login to add a commentAdd a comment