
సాక్షి, బెంగుళూరు : అతనో బ్యాంకు ఉద్యోగి. మంచి జీతం. కానీ జీవితంలో మాత్రం ప్రశాంతత లేదు. ఉదయం నుంచి ఆఫీస్‌లో పనిచేసి సాయంత్రానికి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుందామనుకుంటే ఇంటి నిండా గొడవలే. చాలాసార్లు ఇంటి సభ్యులందరికీ సర్దిచెప్పాడు. అయినా ఏమాత్రం మార్పు రాలేదు. కుటుంబ సమస్యలతో విసిగివేసారి జీవితంపై విరక్తి చెంది బలవ్మరణానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే గురువారం నగరంలోని ఆలనహళ్లి లేఅవుట్‌లో ఓబ్యాంకు ఉద్యోగి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కురుబరహళ్లికి చెందిన వేణుగోపాల్ (32) ఆలనహళ్లి లేఅవుట్‌లోని కెనరా బ్యాంకులో పని చేస్తున్నాడు. గత కొద్ది కాలంగా వేణుగోపాల్ కుటుంబ సమస్యలు, కలహాలతో సతమతమవుతున్నాడు. తరచూ స్నేహితుల దగ్గర తన సమస్యలను చెప్పుకొని బాధపడేవాడు. ఈ జీవితం తనకు వద్దంటూ ఆవేదన వ్యక్తం చేసేవాడు.
కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన వేణు, గురువారం తన అన్నకు ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. అన్న వద్దంటూ వారించినా వినిపించుకోని వేణు బ్యాంకుకు సమీపంలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఈతగాళ్ల సహాయంతో వేణు మృతదేహాన్ని వెలికితీయించారు. నగర దక్షిణ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.