తరచూ ఆత్మహత్యాయత్నాలతో కలకలం
ఈ ఏడాది పలు ఘటనలు
పటిష్ట నివారణ చర్యలు శూన్యం
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను తీర్చేలా ఉన్న మెట్రో రైలు వ్యవస్థ ఆధునికతగా ప్రతిరూపంగా ఆకర్షిస్తోంది. కానీ ఇలాంటి నమ్మ మెట్రో స్టేషన్లు సూసైడ్ స్పాట్‌గా మారడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఏడాదిలో 9 నెలల్లో 7 ఆత్మహత్యాయత్నాలు జరగడం గమనార్హం. చనిపోతామంటూ మెట్రో రైలు పట్టాలపై దూకుతున్న ఘటనలు తలనొప్పిగా మారాయి. ఫలితంగా మెట్రో రైలు సేవలకు అంతరాయం ఏర్పడడంతో పాటు ప్రయాణికులు భయాందోళనకు గురవుతుంటారు.
గ్లాస్ డోర్లు ఎక్కడ?
ఈ ప్రమాదాల నివారణ కోసం పీఎస్‌డీ (ఫ్లాట్‌ఫారం స్క్రీనింగ్ డోర్)ని ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నా ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ, చైన్నె, కొచ్చి మెట్రోలో ఈ పీఎస్డీ డోర్లను ఏర్పాటు చేశారు. అయితే నమ్మ మెట్రోలో మాత్రం ఇంకా ఆచరణలోకి రాకపోవడం గమనార్హం. ఈ డోర్లను అమర్చితే ట్రాక్‌పైకి ప్రయాణికులు పడిపోయే, దూకే ఘటనలు తప్పిపోతాయని నిపుణులు తెలిపారు.
మెట్రో స్టేషన్‌కు రైలు వచ్చినప్పుడు మాత్రమే ఈ స్క్రీనింగ్ డోర్లు తెరుచుకుంటాయి. ప్రయాణికులు రైల్లోకి ఎక్కిన తర్వాత తిరిగి మూసుకుపోతాయి. ఇలా ప్రయాణికుల భద్రతలో ఎంతో కీలకమైన పీఎస్డీ డోర్లను వెంటనే బెంగళూరు మెట్రో స్టేషన్లలో కూడా అమర్చాలని చెబుతున్నారు. నమ్మ మెట్రో ప్రారంభమై 13 ఏళ్లు పూర్తి అయింది. ఇంతవరకు రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడం ఆశ్చర్యకరమని విమర్శలున్నాయి.
ఈ ఏడాది జరిగిన కొన్ని సంఘటనలు
జనవరి 01– మొబైల్ పడిపోయిందని..
ఇందిరా నగర మెట్రో రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పై పడిన మొబైల్‌ను తీసేందుకు ఒక మహిళ ట్రాక్‌పైకి దిగింది. సిబ్బంది వెంటనే ఆ మహిళను గుర్తించి బయటకు లాగి ప్రాణాన్ని కాపాడారు. పట్టాలకు హై ఓల్టేజ్ కరెంటు అనుసంధానమై ఉంటుంది. తగిలితే ప్రాణాలు పోవచ్చు. ఈ ఘటనతో 15 నిమిషాలు రైలు సేవలు నిలిచిపోయాయి.
జనవరి 5 – యువకుడు దూకి..
కేరళకు చెందిన షారోన్ (23) అనే యువకుడు జాలహళ్లి మెట్రో స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకోవాలని రైలు వస్తుండగా పట్టాల మీదకు దూకాడు. ఆ వ్యక్తిని చూసిన లోకోపైలట్ వెంటనే అత్యవసర బ్రేకులను ఉపయోగించి రైలు నిలిచిపోయేలా చేయడంతో ప్రాణాపాయం తప్పింది.
జనవరి 6 – నల్ల పిల్లి ఆటంకం
జేపీ నగర మెట్రో రైల్వే స్టేషన్‌లో పట్టాలపై నల్లటి పిల్లి ఒకటి కనిపించింది. మెట్రో రైల్వే స్టేషన్ సిబ్బంది ఆ పిల్లిని అక్కడి నుంచి తరిమేసేందుకు నానా తిప్పలు పడ్డారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారాయి.
మార్చి 12– పట్టాలపై నడక
జ్ఞానభారతి మెట్రో స్టేషన్–పట్టణగెరె మెట్రో స్టేషన్ మధ్య వయడక్ట్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి కనిపించాడు. మెట్రో పట్టాలపై ఉన్న వయడక్ట్‌పై నడుచుకుంటూ వెళుతున్నాడు. దీంతో కూడా మెట్రో సేవలు కొంత సమయం నిలిచిపోయాయి.
మార్చి 21– లా విద్యార్థి ఆత్మహత్య
అత్తిగుప్పే మెట్రోస్టేషన్‌లో 19 ఏళ్ల ధ్రువ్ టక్కర్ అనే లా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌కు రైలు వస్తుండగా నేరుగా పట్టాలపైకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు మానసిక ఒత్తిడి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు.
ఆగస్టు 3 – మరో ఆత్మహత్య
దొడ్డకల్లసంద్ర మెట్రో స్టేషన్‌లో ట్రైన్ రావడాన్ని గమనించిన 35 ఏళ్ల వ్యక్తి ట్రాక్ మీదకు దూకాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ప్రమాదంతో చాలా సమయం వరకు మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి.
సెప్టెంబర్ 17 – మరో ఆత్మహత్యాయత్నం..
జ్ఞానభారతి మెట్రో స్టేషన్‌లో రైలు రావడాన్ని గమనించి ఆత్మహత్య చేసుకునేందుకు ట్రాక్ మీదకు దూకాడు. ఈసందర్భంలో మెట్రో సెక్యురిటీ సిబ్బంది సిద్ధార్థ జైన్ అతని ప్రాణాలను కాపాడారు. బ్యాంకులో రూ. 3 లక్షల అప్పు చేసి తీర్చలేకనే బాధతో ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.
అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మెట్రో రైళ్లు, స్టేషన్లకు వెళ్లడం ఒక మంచి అనుభూతిగా ఉంటుంది. అందుకే ఎంతోమంది అవసరం లేకపోయినా మెట్రో రైళ్లలో ప్రయాణిస్తారు. అనేక ఊర్ల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో ఔత్సాహికులు మెట్రో సేవల కోసం వస్తుంటారు. కానీ కొందరికి మాత్రం అది ఆత్మహత్యకు అనువైన ప్రాంతంగా కనిపిస్తోంది. చిన్న చిన్న సమస్యలకు కుంగిపోయి మెట్రో పట్టాలపైకి దూకాలని వస్తారు. ఈ సమస్యను నివారించడం మెట్రోకు చిక్కుముడిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment