అనుమానంతో భార్యను వేధించాడు. విభేదాలు వచ్చి ఆమెతో విడిపోయాడు. అయినా అతనిలోని శాడిజం చల్లారలేదు. భార్య ఫొటోలను అశ్లీల వెబ్‌సైట్‌లలోకి పోస్ట్ చేశాడు. ఆమె పేరుతో చాటింగ్ చేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
సాక్షి, సిటీబ్యూరో: వృత్తిరీత్యా బ్యాంక్ మేనేజర్ అయినప్పటికీ శాడిస్ట్‌గా మారి బరితెగించాడు. భార్యను వేధించాలనే ఉద్దేశంతో ఆమె ఫొటోలను అశ్లీల వెబ్‌సైట్లలో పోస్ట్ చేయడంతో పాటు ఆమె మాదిరిగానే చాటింగ్స్ చేయడం మొదలెట్టాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను బట్టి నిందితుడిని బుధవారం శ్రీకాకుళంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని ఓ గ్రామీణ బ్యాంకులో ఓ వ్యక్తి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కూడా కొన్నాళ్లపాటు అక్కడే మరో బ్యాంకులో పని చేసి, ఇటీవలే హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. భార్యపై అనుమానం పెంచుకున్న అతను ఆమెను వేధిస్తుండటంతో ఇద్దరి మధ్యా విభేదాలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో అదును చూసుకుని ఆమె సెల్‌ఫోన్ తీసుకుని అందులో ఉన్న ఆమె ఈ–మెయిల్ ఐడీ సంగ్రహించాడు. దీనిని వినియోగించి కొన్ని అశ్లీల వెబ్‌సైట్లలో ఖాతాలు తెరిచి అందులో తన భార్య ఫొటోలు పోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె పేరుతో ఉన్న అకౌంట్ నుంచి ఆమె మాదిరిగానే చాటింగ్స్ చేస్తున్నాడు. ఈ పంథాలో ఆమెకు పరిచయం ఉన్న వారికి మేసేజ్‌లు పంపిస్తూ... ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురి చేశాడు. తన పేరుతో ఎవరో ఈ పని చేశారని భావించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి భర్తే నిందితుడిగా గుర్తించి అరసవెల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ శాడిస్ట్ మొగుడిని నగరానికి తరలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment