ప్రధాని మోదీతో సంభాజీ భిడే(పాత చిత్రం)
సాక్షి, ముంబై : కుల చిచ్చు కారణంగా చెలరేగిన అల్లర్ల తర్వాత పరిస్థితులు దాదాపుగా చక్కబడటంతో మహారాష్ట్ర పోలీసు శాఖ రంగంలోకి దిగింది. సీసీపుటేజీలు, సాక్ష్యాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా భీమ-కోరేగావ్ వద్ద చెలరేగిన హింసకు సంబంధించి సంభాజీ భిడే, మిలింద్ ఎక్‌బోతే పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో ప్రధానంగా చేర్చింది. అయితే వారు మాత్రం తమకు ఈ అల్లర్లతో సంబంధం లేదని చెబుతుండటం విశేషం.
సంభాజీ భిడే(85) హిందూ అతివాది. శివ్ రాజ్ ప్రతిస్థాన్ అనే సంస్థ ప్రధాన ప్రతినిధి అయిన భిడే సరిగ్గా అల్లర్లు చెలరేగటానికి ముందు తన అనుచరులతో భేటీ అయ్యారు. కవ్వింపు చర్యల గురించి ఆయన వారితో చర్చించారు. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ముందుగానే వారిని మోహరించి అల్లర్లకు పురిగొల్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరో నిందితుడు మిలింద్ రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా తన అనుచరుల్ని ఉసిగొల్పాడు అని పోలీసులు వెల్లడించారు.
ఈ మేరకు జనవరి 2న ఓ ఫిర్యాదు అందటంతో పింప్రి పోలీసులు ఆ రెండు సంస్థల ప్రతినిధులపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక భరిప బహుజన్ మహాసంగ్(బీబీఎం) నేత ప్రకాశ్ అంబేద్కర్ మాట్లాడుతూ.. అల్లర్లకు హిందూ ఎక్తా అగాది, శివ్‌రాజ్ ప్రతిస్థాన్ సంస్థలే కారణమని ఆరోపిస్తున్నారు.
భిడే వివరణ...
కాగా తనపై ఆరోపణలను భిడే తీవ్రంగా ఖండించారు. ‘‘కుల చిచ్చు రేపాల్సిన అవసరం నాకేంటి? దానివల్ల నాకేం ఒరుగుతుంది? నా పేరును ఇందులోకి లాగి కొందరు రాజకీయం చేస్తున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది’’ అని భిడే పేర్కొన్నారు. గురువారం వేలాది మంది అనుచరులతో ఆయన సంగలి జిల్లా కలెక్టర్‌ను కలిసి తనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. మిలింద్ కూడా దాదాపు ఇలాంటి వాదననే వినిపిస్తున్నారు.
ఇంకోపక్క వారిపై కేసుల విషయంలో వెనక్కి తగ్గితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నాయి. భీమ-కోరేగావ్ పోరాటానికి 200 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దళితులు నిర్వహించిన కార్యక్రమంలో హింస చెలరేగగా.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకగణం వెనకుండి హింసకు ప్రేరేపించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment