ప్రమాద స్థలంలో బోల్తా పడిన ట్రాక్టర్ తొట్టి
సత్తుపల్లి(ఖమ్మం) : ఆదివాసీ సదస్సుల్లో పాల్గొందామని రామగోవిందాపురం నుంచి సత్తుపల్లికి ట్రాక్టర్‌లో బయల్దేరగా..మృత్యువు మరో వాహనం రూపంలో దూసుకొచ్చింది. దినసరి కూలీలు, నిరుపేదల బతుకుల్లో చీకట్లు నింపింది. సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొమరం భీం విగ్రహావిష్కరణ, ప్రదర్శన, బహిరంగసభలో పాల్గొనేందుకు మండలం లోని రామగోవిందాపురం నుంచి సుమారు 30 మంది ట్రాక్టర్లో ఉదయం 10 గంటల సమయంలో బయల్దేరారు. పది నిమిషాల్లోనే వీరు బేతుపల్లి–తాళ్లమడ గ్రామాల మధ్య రాష్ట్రీయ రహదారిపైకి చేరుకుని సత్తుపల్లి వైపునకు వస్తుండగా..కంటెయినర్ లారీ ఓవర్‌టేక్ చేయబోయి..ట్రాక్టర్‌కు తగలడంతో ట్రక్కు పడిపోయింది.
19 మంది తీవ్రంగా గాయపడగా..క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనం, ఆటోల్లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి సరియం వెంకటేశ్వర్లు(40), ఖమ్మం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కణితి లక్ష్మయ్య(45) చనిపోయారు. ఈ ప్రమాదంతో సుమారు గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో సీఐ టి.సురేష్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన ట్రాక్టర్ ట్రక్కును పక్కకు జరిపించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఢీ కొట్టిన కంటెయినర్ లారీ తప్పించుకొని వెళ్లిపోవడంతో పెనుబల్లి వద్ద పోలీసులు పట్టుకున్నారు.
సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రి, కిమ్స్‌లో క్షతగాత్రులు..
తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు ఖమ్మం కిమ్స్ ఆస్పత్రికి అంబులెన్స్‌లలో తరలించారు. అక్కడ ఉచితంగా వైద్య సహాయం చేశారు. వాసం కాంతమ్మ తలకు, నడుముకు, రేలా వెంకట దానయ్య తలకు తీవ్రగాయమై చెవుల్లో నుంచి రక్తం కారింది. తాటి సుకన్య, తాటిపర్తి అచ్చమ్మ, కణితి వీరభద్రం, బేతి శివకు తలకు, కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ఖమ్మం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులైన సరియం మురారి, కోలా రాంబాబు, ఇటుక తిరుపతమ్మ, రేలా వరలక్ష్మి, రాములు, రాజు, సిద్దిన ఆదామ్మ, సరియం ఇం దు, సరియం నందు, సిద్ధిని గంగులు, వాసం నాగలక్ష్మిలకు వైద్య సేవలు అందిస్తున్నారు. పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వసుమతీదేవి తెలిపారు.
పరామర్శించిన నామా, సండ్ర, పొంగులేటి..
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటీన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. ఖమ్మం కిమ్స్ ఆస్పత్రికి తరలించి మెరుగై చికిత్స అంది స్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభయ మి చ్చి, పంపించారు. క్షతగాత్రులకు జరుగుతున్న వైద్యసేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నా రు. సరియం వెంకటేశ్వర్లు, కణితి లక్ష్మయ్య మృ తదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరివెంట కోటగిరి సుధాకర్, దొడ్డా శంకర్‌రావు, మందపాటి ముత్తారెడ్డి, ఎస్‌కె మౌలాలీ, ఎండి కమల్‌పాషా ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిశాక ఖమ్మం నుంచి ఎంపీ నామా నాగేశ్వరరావు చేరుకున్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
రామ గోవిందాపురంలో విషాద ఛాయలు..
సత్తుపల్లి మండలం రామగోవిందాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు, క్షతగాత్రులందరూ బంధువర్గం కావడంతో గ్రామం కన్నీటి సంద్రమైంది. మృతుల బంధువుల రోదనలు, ఆర్తనాదాలతో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రి దద్దరిల్లింది. ఆదివాసీ దినోత్సవానికి వచ్చిన గిరిపుత్రులు ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో దవాఖానా ప్రాంగణం కిటకిటలాడింది.
ఇదే ప్రమాదంలో ట్రాలీ బోల్తా..
కాగా ట్రాక్టర్‌ను కంటెయినర్ లారీ ఢీ కొనగానే తొట్టి పడిపోగా, ట్రాక్టర్ ఇంజిన్ వేగంగా వెళ్లి ముందు వెళుతున్న ట్రాలీ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ట్రాలీ ఎగిరి పక్కనే ఉన్న వరిపొల్లాల్లో పడింది. ఈ ప్రమాదంలో ఆటో దెబ్బతినగా దీనిలో ఉన్న ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment