ఆర్టీసీ బస్సులు ఢీ: డ్రైవర్‌ మృతి  | RTC Bus Accident In Khammam Driver Died And Another In Critical | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులు ఢీ: డ్రైవర్‌ మృతి 

Published Wed, Sep 11 2019 12:50 PM | Last Updated on Wed, Sep 11 2019 12:50 PM

RTC Bus Accident In Khammam Driver Died And Another In Critical - Sakshi

క్యాబిన్‌లో ఇరుక్కుపోయి ఉన్న డ్రైవర్‌ జంగయ్య

సాక్షి ఖమ్మం : అర్ధరాత్రి 1.20 గంటల సమయం.. రాష్ట్రీయ రహదారి.. వాహనాలు రోడ్డుపై వేగంగా వెళ్తున్నాయి.. ఒకేసారి పెద్ద శబ్దం.. ఆ సమయంలో పక్కనే వినాయకుడి మండపంలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి చూశారు. రెండు ఆర్‌టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొని ఉన్నాయి. రెండు బస్సుల డ్రైవర్లు బస్సుల క్యాబిన్‌లో ఇరుక్కుపోయి కనిపించారు. అప్పటికే ఒక డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుని మృతి చెంది ఉన్నాడు. మరో బస్సులో ఉన్న డ్రైవర్‌ మూలుగుతూ కనిపించాడు. బస్సుల్లో ఉన్న ప్రయాణికుల హాహాకారాలు. ఏం జరిగిందోనని ప్రయాణికులు పెద్దగా బిగ్గరగా కేకలు వేస్తూ కనిపించారు. ఈ ఘటన ఖమ్మంరూరల్‌ మండలం తల్లంపాడు గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున 1.20 గంటలకు చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తాండూరు డిపోకు చెందిన డీలక్స్‌ బస్సు తాండూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కుంట వెళ్తోంది. ఏలూరు డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు జంగారెడ్డిగూడెం నుంచి హైదరాబాద్‌ వెళ్తోంది. ఈ రెండు బస్సులు మార్గమధ్యలో తల్లంపాడు ఊరి చివర ఉన్న మూల మలుపు వద్ద అతివేగంతో వచ్చి ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో ఏలూరు డిపో బస్సు డ్రైవర్‌ కిరణ్‌(40) బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. పొట్టకు, తలకు, కాళ్లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

తాండూరు డిపో బస్సు డ్రైవర్‌ జంగయ్య కూడా బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుని తీవ్ర గాయాల పాలై చావు బతుకుల మధ్య ఉన్నాడు. రెండు బస్సుల్లో ఉన్న 90 మంది ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. కానీ, ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అందులో ఓ మహిళా ప్రయాణికురాలికి తలకు గాయం కావడంతో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరించారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలం పక్కనే వినాయకుడి మండపంలో ఉన్న భక్తులు జరిగిన ఘటన చూసిన వెంటనే గ్రామస్తులను నిద్ర నుంచి లేపి ప్రమాదస్థలానికి తీసుకువచ్చారు. ఈలోపు కొందరు రూరల్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్లు జంగయ్యను, మృతి చెందిన కిరణ్‌ మృతదేహాన్ని గంటపాటు శ్రమించి బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న జంగయ్యను వెంటనే 108 ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. 

ప్రమాదాలకు నిలయం..  
తల్లంపాడు గ్రామ శివారు మూలమలుపు అంటేనే తెలిసిన వారు అక్కడకు రాగానే జాగ్రత్తగా డ్రైవ్‌ చేస్తుంటారు. ప్రధానంగా ఇక్కడ అర్ధరాత్రి సమయాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ మూలమలుపు వద్ద దగ్గరకు వచ్చే వరకు కూడా రెండు వాహనాల డ్రైవర్లకు ఎదురుగా వాహనం వస్తున్నట్లు అర్థంకాదు. ఈ రహదారిలో ఎక్కువ సార్లు ప్రయాణం చేసిన వారికి కొద్దిగా తెలిసి ఉంటుంది. కొత్తవారు మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కనురెప్ప పాటులో ఘోర ప్రమాదాల్లో ఇరుక్కున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పదేళ్ల కిందట ఇదే మూలమలుపులో ఎదురెదురుగా రెండు ఆర్‌టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లు ఇదే తరహాలో క్యాబిన్లలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారు. నాలుగేళ్ల కిందట డీసీఎం వ్యాన్‌ లారీ ఇదే స్థలం మూలమలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొనగా వ్యాన్‌ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కపోయి మృతి చెందాడు.

ఈరెండు ప్రమాదాలు అర్ధరాత్రి సమయంలోనే జరగడం గమనార్హం. అనంతరం రెండు ద్విచక్రవాహనాలు కూడా ఇక్కడే ఎదురెదురుగా ఢీకొనగా ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు. రెండేళ్ల కిందట కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటోను ఇదే మూలమలుపులో ఆర్‌టీసీ బస్సు ఢీకొనగా ఆటోలో ఉన్న ఇద్దరు కూలీల పొట్టలోకి బస్సు ముందు భాగంలో ఉన్న ఇనుప రాడ్లు దూసుకెళ్లి ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక చిన్నాచితకా ఘటనలు స్వల్ప ప్రమదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు ప్రమదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. కాగా, ఘటనా స్థలాన్ని ఖమ్మం, జంగారెడ్డిగూడెం డిపోల ఆర్‌టీసీ అధికారులు సందర్శించి క్రేన్లతో రెండు బస్సులను వేరు చేశారు. 

స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి 
ప్రమాదాలకు నిలయమైన ఈ మూమలుపు వద్ద కనీసం స్పీడు బ్రేకర్లు కూడా లేకపోవడంతో వాహనాలు వేగం తగ్గించకుండా వచ్చి ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించే అవకాశంలేక ఢీకొంటున్నాయి. అయితే స్పీడ్‌ బ్రేకర్లు ఉం టే అక్కడకు రాగానే వాహనాలు కొద్దిగా వేగం తగ్గించి నడుపుతారని, ప్రమాదం జరిగినా తీవ్రత తగ్గుతుందని తద్వారా ప్రాణ నష్టం కూడా ఉండదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మూలమలుపు ఇరువైపులా స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

డ్రైవర్‌ జంగయ్యపై కేసు 
తల్లంపాడు బస్సు ప్ర మాదంలో మృతి చెంది న డ్రైవర్‌ కిరణ్‌కుమార్‌(38)ది పశ్చిమగోదా వరి జిల్లా లింగపాలెం మండలం తోచెలకరాయుడుపాలెం గ్రామం. ఆయన అవివాహితు డు. గాయపడిన వారు చింతలపూడికి చెందిన గంటి విజయ్‌కుమార్, ఖానాపురానికి చెందిన రాంకోటి, కె.నర్సింహులు తాండురుకు రజిత, బి.షాబోర్‌ ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్‌ జంగయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement