
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భాషను అపహాస్యం చేస్తున్నాడని ఆరోపిస్తూ వీ6 చానెల్ తీన్మార్ యాంకర్ కావలి రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తిపై సోమవారం దాడికి పాల్పడిన మణికంఠను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. గత కొంత కాలంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని వీ6 చానెల్ వద్ద రెక్కి నిర్వహించి మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన బిత్తిరి సత్తిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. చానల్ కార్యాలయం లోపలికి వెళ్తుండగా హెల్మెట్‌తో దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
విచారణలో అతడిని సికింద్రాబాద్‌కు చెందిన కలాసిగుడకు చెందిన మణికంఠగా గుర్తించారు. సత్తి వాడే భాష తెలంగాణ యాసను వెక్కిరిస్తున్నట్టు ఉందని అందుకే దాడి చేసినట్లు తెలిపాడు. తెలంగాణ భాషా గౌరవాన్ని దెబ్బతీయవద్దనే ఈ దాడికి పాల్పడినట్టు తెలిపాడు. తన వెనుక ఎవరూ లేరని అతను పేర్కొన్నాడు. బిత్తిరి సత్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment