హత్యకు గురైన బీజేడీ యువజన నాయకుడు ప్రతాప్ చంద్ర పోలాయి
బరంపురం: గంజాం జిల్లా హెడ్‌క్వార్టర్ ఛత్రపూర్‌లో ఇటీవల జరిగిన ఎన్‌ఏసీ కౌన్సిలర్, అధికార పార్టీ బీజేడీ యువజన నాయకుడు లక్ష్మీదత్త ప్రధాన్ హత్యను జిల్లా ప్రజలు మరువక ముందే జిల్లాలోని అస్కాలో మరో బీజేడీ యువజన నాయకుడు ప్రతాప్ చంద్ర పోలాయి హత్యకు గురయ్యారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా మరోసారి సంచలనం రేపింది. పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో అస్కా నుంచి బరంపురానికి యువజన నాయకుడు ప్రతాప్ చంద్ర పోలాయి బస్సులో వస్తున్న సమయంలో పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొరంజయి జంక్షన్‌లో గుర్తు తెలియని దుండగులు బస్సులో చొరబడి ప్రతాప్ చంద్ర పోలాయిపై తుపాకీలతో నాలుగు రౌండ్‌లు కాల్పులు జరిపి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాల పాలైన ప్రతాప్ చంద్ర పోలాయిని తోటి ప్రయాణికులు తొలుత అస్కా గోష్ఠి ఆరోగ్య సేవా కేంద్రానికి తరలించగా వైద్యులు చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో వెంటనే బరంపురం ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం ప్రతాప్ చంద్ర పోలాయి మృతి చెందినట్లు నిర్ధారించారు.
మద్యం దుకాణం వివాదమే కారణమా?
ప్రతాప్ చంద్ర పోలయి అస్కా ఎన్‌ఏసీలో ని 13వ వార్డుకు చెందిన బీజేడీ కౌన్సిలర్ బబితా పోలాయి భర్త. ప్రతాప్ చంద్ర పోలాయి అస్కాలోని పకలపల్లిలో నివాసం ఉంటున్నారు. మద్యం వ్యాపారం వివాదంలో ప్రతాప్ చంద్ర పోలాయి హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సమాచారం. అస్కా బస్‌స్టాండ్‌లో నెలకొల్పిన మద్యం దుకాణంలో ప్రతాప్ చంద్ర పోలాయి పార్టనర్. అయితే గత కొద్ది రోజుల నుంచి మద్యం దుకాణం భాగస్వాముల మధ్య జరుగుతున్న వివాదం నేపథ్యంలో ప్రతాప్ చంద్ర పోలాయి హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అస్కా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment