బెం‘బ్లేడ్‌’ ఎత్తిస్తూ.. | Blade Batch Attacks In East Godavari | Sakshi
Sakshi News home page

హడలెత్తిస్తున్న బ్లేడ్‌ బ్యాచ్‌ 

Published Mon, Jun 24 2019 9:41 AM | Last Updated on Mon, Jun 24 2019 9:41 AM

Blade Batch Attacks In East Godavari - Sakshi

బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి సంఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్న  త్రీటౌన్‌ ఎస్సై ఆనంద్‌ కుమార్‌

సాక్షి, రాజమహేంద్రవరం  : అమాయకులను టార్గెట్‌ చేస్తూ నగరంలో బ్లేడ్‌ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి. బ్లేడ్‌తో దాడులు చేయడం వారి వద్ద ఉన్న నగలు, నగదు, ఇతర వస్తువులు దోచుకోవడం ఈ బ్యాచ్‌లు అలవాటుగా మారింది. నగరంలో ఈ సమస్య మూడేళ్లుగా ఉన్నా పోలీసులు ఉదాసీనత వైఖరి వల్ల బ్లేడ్‌ బ్యాచ్‌లు రెచ్చిపోయి. సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. 

నిర్మానుష ప్రాంతాలను ఎంచుకొని ఒంటరిగా వెళుతున్న వారి పై దాడులు చేసి వారి వద్ద నుంచి బంగారు వస్తువులు, నగదు చోరీలకు పాల్పడుతున్నారు. రాజమహేంద్రవరం లోని గోదావరి రైల్వే స్టేషన్, అండర్‌ గ్రౌండ్, సుబ్రహ్మణ్యం మైదానం రోడ్డు, ఆనం కళా కేంద్రం వెనుక వైపు ఉన్న రోడ్డు, గోకవరం బస్టాండ్‌ ప్రాంతాలు, నాగదేవి ఎదురుగా ఉన్న రోడ్లు, జయరామ్, నటరాజ్‌ థియేటర్ల వద్ద తదితర నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకొని బ్లేడ్‌ బ్యాచ్‌లు దాడులకు పాల్పడుతున్నాయి. రాత్రి సమయాల్లో ట్రైను, బస్సులు దిగి వెళుతున్న వారిని ఎంచుకొని రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు చొప్పున వచ్చి ఒంటిరిగా వెళుతున్న వారిని బెదిరించి వారి జేబుల్లో ఉన్న నగదు, ఒంటిపై ఉన్న వస్తువులు చోరీలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని బ్లేడ్‌ చూపించి బెదిరించి వారిని దోచుకుంటున్నారు.

ఐరన్‌ పట్టుకుపోతున్న వారిని అడ్డుకున్నందుకు 
రాజమహేంద్రవరం తుమ్మలావలోని జయరామ్, నటరాజ్‌ థియేటర్ల వద్ద నిర్మిస్తున్న మున్సిపల్‌ పాఠశాల వద్ద సత్యనారాయణ అనే వ్యక్తి వాచ్‌మన్‌ గా పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఎనిమిది మంది బ్లేడ్‌ బ్యాచ్‌ కు చెందిన వ్యక్తులు వచ్చి స్కూల్‌ నిర్మాణానికి ఉపయోగించే ఐరన్‌ ఊచలు పట్టుకుపోతుండగా వాచ్‌మెన్‌ సత్యనారాయణ, అతడి కుమారుడు రామకృష్ణ అడ్డుకున్నారు. దీంతో బ్లేడ్‌ బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది దాడి చేసి వారిద్దరినీ రోడ్డు పైకి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి దాడి చేశారు. ఈ దాడిలో రామకృష్ణ కాలు విరిగిపోయింది.

అతడి తండ్రికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే మాదిరిగా పేపర్‌ మిల్లు వద్ద ఒక వ్యక్తిని అకారణంగా కొట్టి అతడి వద్ద నగదు లాక్కున్నారు. అలాగే క్వారీ మార్కెట్‌ సెంటర్‌లో ఒక వైన్‌ షాపు వద్ద ఒక ఉపాధ్యాయుడిని బెదిరించి ఆయన వద్ద ఉన్న రూ.పది వేలు లాక్కున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిరోజూ రాజమహేంద్రవరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది బాధితులు ఉన్నారు. కొంత మంది ఫిర్యాదులు సైతం చేయకుండా వెళ్లిపోవడంతో బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకాలు కొన్ని బయటకు రావడం లేదు.

నిఘా కొరవడడంతో రెచ్చిపోతున్న వైనం
నగరంలో బ్లేడ్‌ బ్యాచ్‌ ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నా పోలీసులు నిఘా కొరవడడంతో రెచ్చిపోతున్నారు. గతంలో రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలో ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు ఒక రక్షక్‌ వాహనం ఉండేది. వీటి నిర్వహణ, ఆయిల్‌ ఖర్చులు భారంగా మారడంతో వీటిని తొలగించారు. వీటి స్థానంలో యాంటీ గూండా స్వాడ్‌(ఏజీఎస్‌) పేరుతో ఒక టీమ్‌ ఏర్పాటు చేశారు. రామహేంద్రవరం మొత్తం ఈ టీమ్‌ తోనే పర్యవేక్షణ చేయడంతో రాత్రిపూట గస్తీ కొరవడిందని ఆరోపణలు ఉన్నాయి. అర్భన్‌ జిల్లా మొత్తం పరిధి పెరిగింది. జాతీయ రహదారితో పాటు ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన గామన్‌ ఇండియా బ్రిడ్జిపైనా బ్లేడ్‌ బ్యాచ్‌లు విరుచుకుపడుతున్నాయి.

ఈ బ్రిడ్జి పై కూడా నిఘా ఏర్పాటు చేయకపోవడంతో రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సాదరాజు గుట్ట ప్రాంతానికి చెందిన కాగిత సత్యనారాయణ తన కుమారుడికి బదిలీ కావడంతో విశాఖ జిల్లా నక్కపల్లి నుంచి ఇంటి సామగ్రిని టాటా ఏస్‌ వ్యాన్‌లో తీసుకువెళుతుండగా బ్లేడ్‌ బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది యువకులు దాడి చేసి వీరి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, రూ.ఏడు వేల నగదు, టాటా ఏస్‌ వ్యాన్‌తో పాటు ఇంటి సామగ్రిని దోచుకున్నారు. 

వ్యక్తిపై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి
 అడిగిన డబ్బులు ఇవ్వలేదని బ్లేడ్‌ బ్యాచ్‌కు చెందిన యువకులు బీరు సీసాతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. త్రీటౌన్‌ సీఐ శేఖర్‌బాబు కథనం ప్రకారం... నగరంలోని సీతంపేట ఉప్పువారి వీధికి చెందిన షేక్‌ సుభానీ ఆదివారం మధ్యాహ్నం బ్రాందీ షాపు వద్ద మద్యం తాగుతుండగా బ్లేడ్‌ బ్యాచ్‌కు చెందిన ఉప్పు శివ, బుడ్డ అనే వ్యక్తులు వచ్చి డబ్బులు అడిగారు. సుభానీ డబ్బులు ఇవ్వకపోవడంతో బీరు సీసాతో అతడి తలపై బలంగా కొట్టారు. ఈ దాడిలో గాయాలపాలైన సుభానీని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement