people afraid
-
కోతకని వెళితే కొండచిలువ కనిపించడంతో..
సాక్షి, ప్రకాశం : మండలంలోని తాటివారిపాలెంలో సోమవారం ఉదయం వ్యవసాయం భూముల్లో కొండచిలువ కనిపించగా స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తాటివారిపాలెం గ్రామానికి చెందిన బాదరాజుపల్లి ఉదయమ్మ గ్రామ సమీపంలోని కొండ దిగువ భాగాన తమ వ్యవసాయ భూమిలో మినుము పంట కోసేందుకు మనుషులతో వెళ్లింది. పంట కోత సమయంలో మినప చెట్ల మధ్య చుట్టు చుట్టుకొని ఉన్న కొండ చిలువను చూసి భయంతో కోతను ఆపేసి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. అద్దంకి నుంచి తాటివారిపాలెం చేరుకున్న ఫారెస్ట్ బీట్ అధికారులు ఆంజనేయులు, శ్రీనివాసరావు 15 అడుగుల పొడవు ఉన్న కొండ చిలువను ఖాళీ గోనె సంచిలో బంధించి కొండపై భాగాన ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ మార్టూరులోని అమరావతి నూలు మిల్లులో కనిపించిన కొండచిలువ కోసం రెండు రోజులుగా వెతికినా దొరకలేదన్నారు. -
బెం‘బ్లేడ్’ ఎత్తిస్తూ..
సాక్షి, రాజమహేంద్రవరం : అమాయకులను టార్గెట్ చేస్తూ నగరంలో బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోతున్నాయి. బ్లేడ్‌తో దాడులు చేయడం వారి వద్ద ఉన్న నగలు, నగదు, ఇతర వస్తువులు దోచుకోవడం ఈ బ్యాచ్‌లు అలవాటుగా మారింది. నగరంలో ఈ సమస్య మూడేళ్లుగా ఉన్నా పోలీసులు ఉదాసీనత వైఖరి వల్ల బ్లేడ్ బ్యాచ్‌లు రెచ్చిపోయి. సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. నిర్మానుష ప్రాంతాలను ఎంచుకొని ఒంటరిగా వెళుతున్న వారి పై దాడులు చేసి వారి వద్ద నుంచి బంగారు వస్తువులు, నగదు చోరీలకు పాల్పడుతున్నారు. రాజమహేంద్రవరం లోని గోదావరి రైల్వే స్టేషన్, అండర్ గ్రౌండ్, సుబ్రహ్మణ్యం మైదానం రోడ్డు, ఆనం కళా కేంద్రం వెనుక వైపు ఉన్న రోడ్డు, గోకవరం బస్టాండ్ ప్రాంతాలు, నాగదేవి ఎదురుగా ఉన్న రోడ్లు, జయరామ్, నటరాజ్ థియేటర్ల వద్ద తదితర నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకొని బ్లేడ్ బ్యాచ్‌లు దాడులకు పాల్పడుతున్నాయి. రాత్రి సమయాల్లో ట్రైను, బస్సులు దిగి వెళుతున్న వారిని ఎంచుకొని రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు చొప్పున వచ్చి ఒంటిరిగా వెళుతున్న వారిని బెదిరించి వారి జేబుల్లో ఉన్న నగదు, ఒంటిపై ఉన్న వస్తువులు చోరీలు చేస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని బ్లేడ్ చూపించి బెదిరించి వారిని దోచుకుంటున్నారు. ఐరన్ పట్టుకుపోతున్న వారిని అడ్డుకున్నందుకు రాజమహేంద్రవరం తుమ్మలావలోని జయరామ్, నటరాజ్ థియేటర్ల వద్ద నిర్మిస్తున్న మున్సిపల్ పాఠశాల వద్ద సత్యనారాయణ అనే వ్యక్తి వాచ్‌మన్ గా పని చేస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి ఎనిమిది మంది బ్లేడ్ బ్యాచ్ కు చెందిన వ్యక్తులు వచ్చి స్కూల్ నిర్మాణానికి ఉపయోగించే ఐరన్ ఊచలు పట్టుకుపోతుండగా వాచ్మెన్ సత్యనారాయణ, అతడి కుమారుడు రామకృష్ణ అడ్డుకున్నారు. దీంతో బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది దాడి చేసి వారిద్దరినీ రోడ్డు పైకి ఈడ్చుకుంటూ తీసుకొచ్చి దాడి చేశారు. ఈ దాడిలో రామకృష్ణ కాలు విరిగిపోయింది. అతడి తండ్రికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే మాదిరిగా పేపర్ మిల్లు వద్ద ఒక వ్యక్తిని అకారణంగా కొట్టి అతడి వద్ద నగదు లాక్కున్నారు. అలాగే క్వారీ మార్కెట్ సెంటర్లో ఒక వైన్ షాపు వద్ద ఒక ఉపాధ్యాయుడిని బెదిరించి ఆయన వద్ద ఉన్న రూ.పది వేలు లాక్కున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతిరోజూ రాజమహేంద్రవరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అనేక మంది బాధితులు ఉన్నారు. కొంత మంది ఫిర్యాదులు సైతం చేయకుండా వెళ్లిపోవడంతో బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు కొన్ని బయటకు రావడం లేదు. నిఘా కొరవడడంతో రెచ్చిపోతున్న వైనం నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నా పోలీసులు నిఘా కొరవడడంతో రెచ్చిపోతున్నారు. గతంలో రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక రక్షక్ వాహనం ఉండేది. వీటి నిర్వహణ, ఆయిల్ ఖర్చులు భారంగా మారడంతో వీటిని తొలగించారు. వీటి స్థానంలో యాంటీ గూండా స్వాడ్(ఏజీఎస్) పేరుతో ఒక టీమ్ ఏర్పాటు చేశారు. రామహేంద్రవరం మొత్తం ఈ టీమ్ తోనే పర్యవేక్షణ చేయడంతో రాత్రిపూట గస్తీ కొరవడిందని ఆరోపణలు ఉన్నాయి. అర్భన్ జిల్లా మొత్తం పరిధి పెరిగింది. జాతీయ రహదారితో పాటు ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నిర్మించిన గామన్ ఇండియా బ్రిడ్జిపైనా బ్లేడ్ బ్యాచ్‌లు విరుచుకుపడుతున్నాయి. ఈ బ్రిడ్జి పై కూడా నిఘా ఏర్పాటు చేయకపోవడంతో రెండేళ్ల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సాదరాజు గుట్ట ప్రాంతానికి చెందిన కాగిత సత్యనారాయణ తన కుమారుడికి బదిలీ కావడంతో విశాఖ జిల్లా నక్కపల్లి నుంచి ఇంటి సామగ్రిని టాటా ఏస్ వ్యాన్‌లో తీసుకువెళుతుండగా బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన ఎనిమిది మంది యువకులు దాడి చేసి వీరి వద్ద ఉన్న సెల్ఫోన్లు, రూ.ఏడు వేల నగదు, టాటా ఏస్ వ్యాన్‌తో పాటు ఇంటి సామగ్రిని దోచుకున్నారు. వ్యక్తిపై బ్లేడ్ బ్యాచ్ దాడి అడిగిన డబ్బులు ఇవ్వలేదని బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన యువకులు బీరు సీసాతో ఓ వ్యక్తిపై దాడి చేశారు. త్రీటౌన్ సీఐ శేఖర్‌బాబు కథనం ప్రకారం... నగరంలోని సీతంపేట ఉప్పువారి వీధికి చెందిన షేక్ సుభానీ ఆదివారం మధ్యాహ్నం బ్రాందీ షాపు వద్ద మద్యం తాగుతుండగా బ్లేడ్ బ్యాచ్‌కు చెందిన ఉప్పు శివ, బుడ్డ అనే వ్యక్తులు వచ్చి డబ్బులు అడిగారు. సుభానీ డబ్బులు ఇవ్వకపోవడంతో బీరు సీసాతో అతడి తలపై బలంగా కొట్టారు. ఈ దాడిలో గాయాలపాలైన సుభానీని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండాల్లో తంగేడి దెయ్యం
బొంరాస్‌పేట : మనిషి అంతరిక్షంలో వ్యోమాగామిగా దూసుకెళ్తున్నాడు. మరో పక్క సంద్రం లోతును చూస్తున్నాడు. కానీ గ్రామీణ నిరక్షరాస్యులు మాత్రం నూరేళ్ల కిందటి మూఢ విశ్వాసాల్ని వీడడంలేదు. ముఖ్యంగా తండాల్లో గిరిజనులు భయంకర మూఢ విశ్వాసాల నుంచి బయటికి రావడం లేదు. జిల్లాలోనే అత్యధిక గిరిజన ప్రాంతాలు (తండాలు) కలిగిన మండలాల్లో బొంరాస్‌పేట ఒకటి. సుమారు ఎనభైకి పైగా గిరిజన తండాలున్నాయి. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేస్తూ ప్రభుత్వాలు అభివృద్ధి పర్చేందుకు విధానలు అమలు చేస్తున్న తరుణంలోనూ వీరిని మూఢనమ్మకాలు వదిలి వెళ్లడం లేదు. వీరి జీవన విధానాలు కొన్ని తండాల్లోని కుటుంబాలు ఆధునిక వర్తమాన కాలానికి సరితూగేలా ఉన్నప్పటికీ మరికొన్ని కుటుంబాలు పాత విశ్వాసాలు పట్టుకొని ఊగిసలాడుతున్నాయి. బొట్లోని తండాలాంటి వాటిలో కోట్లు ఖర్చుపెట్టి దేవాలయాలు కట్టినా కూడా మరికొన్ని తండాల్లో దెయ్యం, భూతం అంటూ నమ్ముతున్నారు. భాషా, వేషంలో కొంత వూర్పు వీరిలో వచ్చినప్పటికీ మూఢ విశ్వాసాలను ఏమాత్రం విడిచి పెట్టడంలేదు. ఏళ్లు గడుస్తున్నా తండాలవారు ‘దెయ్యం తంతు’ను మరవడంలేదు. అనారోగ్యమే దెయ్యమట! అనారోగ్యం పాలైన వ్యక్తి రోగనిరోధక శక్తి క్షీణించినంత వరకు తండాను విడిచిరారు. నడవ లేని పరిస్థితి దాపురించినప్పుడుకానీ దావాఖాన ముఖం చూడరు. మతిస్థిమితం కోల్పోయి విచిత్ర మాటలు పలుకగానే ఆవ్యక్తి కేదో భూత పిశాచం, గాలి(దెయ్యం) సోకిందంటారు. ఇంతలో తండాలో ఉండే మరో వ్యక్తి వచ్చి తంగెడి దెయ్యం అంటాడు. తంగెడిదెయ్యం, అడవిదెయ్యం, అడవి భవాని లాంటి పేర్లతో పిలువబడే ఈ భూత పిశాచాన్ని వదిలించుకోవడానికి ఓ పద్ధతుందండోయ్.. తంగేడి దెయ్యం తంతు! అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తీసుకొని తండాకు దూరంలో ఉన్న ఒక తంగెడి చెట్టు వద్ద రెండు రాళ్లకు సున్నం, జాజు పూతలు పూసి ఒక మేక, గొర్రె లేదా కోడి పుంజులు ఆ చెట్టు దగ్గర బలి ఇవ్వాలి. అక్కడే వండాలి. అక్కడే తినాలి. మెుదట అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఎంత బాధలో ఉన్నా తన శక్తికి మించినంతవరకు మద్యం, కల్లు, సారా తాగాలి. వ్యక్తికి మాంసం, అన్నాన్ని పొట్టపగిలేటట్లు కడుపార శక్తి కొలది తినిపించాలి. ఆ తర్వాతే అందరు తింటారు. అనారోగ్యానికి గురైన వ్యక్తి మిగిలిన వంటలను వెంట తీసుకురాకూడదు సుమా! అక్కడి నుంచి ఏ చిన్న వస్తువును తీసుకెళ్లరాదట. అలా తీసుకెళ్తే దెయ్యం మళ్లీ వెంటవచ్చినట్లేనట. ఇదంతా చేయడానికి సుమారు రూ.2వేలకుపైగా ఖర్చవుతుంది. ఇక మరుసటి రోజు తిన్నగా ఆస్పత్రికి పయనమై వైద్యం చేయించుకుంటారు. ఇలా ఏడాదిలో రూ.10 వేలవరకు కుటుంబంపై భారం పడుతుంది. ఈ పూజలు చేయడానికి 4, 5 రోజులు పడుతుంది. ఇంతలో వ్యక్తికి ఏ ప్రాణాపాయం జరిగినా తంగెడి దేవర పట్టి పీడించిందని నమ్ముతారు. జరిగిన విషాదానికి చేతులు ముడుచుకొని దీనంగా కూర్చొంటారు. ఇలా నిరక్షరాస్యతతో గిరిజనులు బలికావడం కొత్తేమి కాదు. అయినా అధికారులు, సేవా సంస్థలు వీరి పట్ల ఎలాంటి చైతన్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు. బంధువులకు.. భయంభయం.. తంగెడి దేవర పూజలకు నిలయమైన మండలంలోని మూడువూమిళ్లతండాకు వెళ్లాలంటే వారి బంధువులు భయపడుతున్నారు. ఆ తండావారు మాత్రం ఎప్పుడూ, ఎవరికి, దేవర పడుతుందో తెలియని ఆయోమయస్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తండా చుట్టూరా ఉన్న ప్రాంతంలో పూజ చసిన తంగేడి చెట్లు కనిపిస్తాయి. మందులతో నయమైనా నాటువైద్యమే అంటారు నేను గిరిజన తండాలోనే పుట్టిన. ఎంతచెప్పినా వారి మూఢ విశ్వాసాన్ని మానుకోరు. చివరి సమయంలో ఆస్పత్రి కెళ్లి మందులు వాడి నయం అయినప్పటికీ తంగెడి దేవర పారిపోవండవల్లే నయమైందంటారు. ఇప్పటికీ తండాల్లో తంగెడిదెయ్యం భయంకర విశ్వాసం మారడంలేదు. మా గిరిజనుల్లో అందరూ బాగా చదువుకుంటేనే మార్పు. – మోతిలాల్, విద్యావంతుడు, మూడుమామిళ్లతండా -
మయూరి హోటల్ సమీపంలో మనిషి కాలు
సాక్షి, విజయనగరం ఫోర్ట్ : జిల్లా కేంద్రంలో తెగిపడి ఉన్న కాలు ఎముకలు కలకలం రేపాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న మయూరి హోటల్ సమీపంలో మనిషి కాలు పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఓ మనిషి కాలు అక్కడకు ఏలా వచ్చిందన్న దానిపై సర్వత్రా చర్చించుకున్నారు. ఎవరైనా నరికి పడేశారా.. లేదా సమీపంలో ఉన్న ఆస్పత్రుల్లో ఆపరేషన్ చేసి కాలు తొలిగించి పడేశారా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే పోలీసుల విచారణలో ఆస్పత్రిలో తొలగించబడిన కాలు ఎముకలని తేలడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఒకటో పట్టణ సీఐ చంద్రశేఖర్ తెలియజేసిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల కిందట మయూరి హోటల్‌కు సమీపంలో ఉన్న ఆస్పత్రికి ఓ మ«ధుమేహ రోగి వచ్చారు. అతని కాలు కుళ్లిపోవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి కాలు తొలిగించి, బయోవేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహించే సంస్థకు అప్పగించారు. అయితే వారు వాహనంలో తరలిస్తుండగా కాలు జారి పడిందని సమాచారం. ప్రస్తుతం ఆ కాలును ఆస్పత్రి వైద్య సిబ్బంది భద్రపరిచారు. -
‘కొండ’నాగులు
సాక్షి, తిరుమల : తిరుమల కొండపై ఆదివారం రెండు నాగుపాములు జనాన్ని హడలెత్తించా యి. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆకాశగంగ సమీపంలో ఓ టీ దుకాణంలోకి నాగుపాము వెళ్లింది. ఈ సమాచారంతో స్థానికుడు మునస్వామి ఆ పామును పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇక స్థానికులు నివాసం ఉండే తిరుమల బాలాజీనగర్ ఈస్ట్‌లో 1012 నంబరు ఇంటికి సమీపంలో మరో నాగుపాము వచ్చింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు దాన్ని చూసి పరుగులు తీశారు. ఈ సమాచారంతో మునస్వామి వెళ్లి ఆ పామును కూడా చాకచక్యంగా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆయన పాము కాటుకు గురయ్యాడు. కుడిచేతికి కాటు పడడంతో రక్తం వచ్చింది. ఆ పామును అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నాడు. -
సర్పాల సయ్యాట చూడతరమా!
తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల సాయిబాబా ఆలయం ఎదుట నాగుపాము, జెరిపోతు శనివారం ఉదయం సయ్యాటలాడాయి. వాటిని చూడటానికి స్థానికులు ఆసక్తి చూపారు. పాముల సయ్యాటను చూస్తే మంచిది కాదని కొందరు.. వాటిని వెళ్లగొట్టొద్దని మరికొందరు దూరంగా వెళ్లిపోయారు. శుక్రవారం కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోగా ఇరుగుపొరుగు వారు పాముల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు.