మూడుమామిళ్ల తండా సమీపంలో తంగేడి దేవర పూజలు చేస్తున్న దృశ్యం (ఫైల్)
బొంరాస్‌పేట : మనిషి అంతరిక్షంలో వ్యోమాగామిగా దూసుకెళ్తున్నాడు. మరో పక్క సంద్రం లోతును చూస్తున్నాడు. కానీ గ్రామీణ నిరక్షరాస్యులు మాత్రం నూరేళ్ల కిందటి మూఢ విశ్వాసాల్ని వీడడంలేదు. ముఖ్యంగా తండాల్లో గిరిజనులు భయంకర మూఢ విశ్వాసాల నుంచి బయటికి రావడం లేదు. జిల్లాలోనే అత్యధిక గిరిజన ప్రాంతాలు (తండాలు) కలిగిన మండలాల్లో బొంరాస్‌పేట ఒకటి.
సుమారు ఎనభైకి పైగా గిరిజన తండాలున్నాయి. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలు చేస్తూ ప్రభుత్వాలు అభివృద్ధి పర్చేందుకు విధానలు అమలు చేస్తున్న తరుణంలోనూ వీరిని మూఢనమ్మకాలు వదిలి వెళ్లడం లేదు. వీరి జీవన విధానాలు కొన్ని తండాల్లోని కుటుంబాలు ఆధునిక వర్తమాన కాలానికి సరితూగేలా ఉన్నప్పటికీ మరికొన్ని కుటుంబాలు పాత విశ్వాసాలు పట్టుకొని ఊగిసలాడుతున్నాయి.
బొట్లోని తండాలాంటి వాటిలో కోట్లు ఖర్చుపెట్టి దేవాలయాలు కట్టినా కూడా మరికొన్ని తండాల్లో దెయ్యం, భూతం అంటూ నమ్ముతున్నారు. భాషా, వేషంలో కొంత వూర్పు వీరిలో వచ్చినప్పటికీ మూఢ విశ్వాసాలను ఏమాత్రం విడిచి పెట్టడంలేదు. ఏళ్లు గడుస్తున్నా తండాలవారు ‘దెయ్యం తంతు’ను మరవడంలేదు.
అనారోగ్యమే దెయ్యమట!
అనారోగ్యం పాలైన వ్యక్తి రోగనిరోధక శక్తి క్షీణించినంత వరకు తండాను విడిచిరారు. నడవ లేని పరిస్థితి దాపురించినప్పుడుకానీ దావాఖాన ముఖం చూడరు. మతిస్థిమితం కోల్పోయి విచిత్ర మాటలు పలుకగానే ఆవ్యక్తి కేదో భూత పిశాచం, గాలి(దెయ్యం) సోకిందంటారు. ఇంతలో తండాలో ఉండే మరో వ్యక్తి వచ్చి తంగెడి దెయ్యం అంటాడు. తంగెడిదెయ్యం, అడవిదెయ్యం, అడవి భవాని లాంటి పేర్లతో పిలువబడే ఈ భూత పిశాచాన్ని వదిలించుకోవడానికి ఓ పద్ధతుందండోయ్..
తంగేడి దెయ్యం తంతు!
అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తీసుకొని తండాకు దూరంలో ఉన్న ఒక తంగెడి చెట్టు వద్ద రెండు రాళ్లకు సున్నం, జాజు పూతలు పూసి ఒక మేక, గొర్రె లేదా కోడి పుంజులు ఆ చెట్టు దగ్గర బలి ఇవ్వాలి. అక్కడే వండాలి. అక్కడే తినాలి. మెుదట అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఎంత బాధలో ఉన్నా తన శక్తికి మించినంతవరకు మద్యం, కల్లు, సారా తాగాలి. వ్యక్తికి మాంసం, అన్నాన్ని పొట్టపగిలేటట్లు కడుపార శక్తి కొలది తినిపించాలి. ఆ తర్వాతే అందరు తింటారు.
అనారోగ్యానికి గురైన వ్యక్తి మిగిలిన వంటలను వెంట తీసుకురాకూడదు సుమా! అక్కడి నుంచి ఏ చిన్న వస్తువును తీసుకెళ్లరాదట. అలా తీసుకెళ్తే దెయ్యం మళ్లీ వెంటవచ్చినట్లేనట. ఇదంతా చేయడానికి సుమారు రూ.2వేలకుపైగా ఖర్చవుతుంది. ఇక మరుసటి రోజు తిన్నగా ఆస్పత్రికి పయనమై వైద్యం చేయించుకుంటారు. ఇలా ఏడాదిలో రూ.10 వేలవరకు కుటుంబంపై భారం పడుతుంది.
ఈ పూజలు చేయడానికి 4, 5 రోజులు పడుతుంది. ఇంతలో వ్యక్తికి ఏ ప్రాణాపాయం జరిగినా తంగెడి దేవర పట్టి పీడించిందని నమ్ముతారు. జరిగిన విషాదానికి చేతులు ముడుచుకొని దీనంగా కూర్చొంటారు. ఇలా నిరక్షరాస్యతతో గిరిజనులు బలికావడం కొత్తేమి కాదు. అయినా అధికారులు, సేవా సంస్థలు వీరి పట్ల ఎలాంటి చైతన్య అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదు.
బంధువులకు.. భయంభయం..
తంగెడి దేవర పూజలకు నిలయమైన మండలంలోని మూడువూమిళ్లతండాకు వెళ్లాలంటే వారి బంధువులు భయపడుతున్నారు. ఆ తండావారు మాత్రం ఎప్పుడూ, ఎవరికి, దేవర పడుతుందో తెలియని ఆయోమయస్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఈ తండా చుట్టూరా ఉన్న ప్రాంతంలో పూజ చసిన తంగేడి చెట్లు కనిపిస్తాయి.
మందులతో నయమైనా నాటువైద్యమే అంటారు
నేను గిరిజన తండాలోనే పుట్టిన. ఎంతచెప్పినా వారి మూఢ విశ్వాసాన్ని మానుకోరు. చివరి సమయంలో ఆస్పత్రి కెళ్లి మందులు వాడి నయం అయినప్పటికీ తంగెడి దేవర పారిపోవండవల్లే నయమైందంటారు. ఇప్పటికీ తండాల్లో తంగెడిదెయ్యం భయంకర విశ్వాసం మారడంలేదు. మా గిరిజనుల్లో అందరూ బాగా చదువుకుంటేనే మార్పు. – మోతిలాల్, విద్యావంతుడు, మూడుమామిళ్లతండా
Comments
Please login to add a commentAdd a comment