
ఇద్దరు ప్రేమించుకున్నారు. తీరా వివాహం చేసుకునే సమయానికి ఒక కిడ్నీ లేదని ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు.
చెన్నై, తిరువొత్తియూరు: ఇద్దరు ప్రేమించుకున్నారు. తీరా వివాహం చేసుకునే సమయానికి ఒక కిడ్నీ లేదని ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆలందూరు ప్రాంతానికి చెందిన నిత్య (32) గురువారం ఓ ఫిర్యాదు చేసింది. అందులో కుటుంబ సభ్యులతో కలిసి ఉండే తనకు రెండు సంవత్సరాల ముందు విక్కి అలియాస్ విఘ్నేష్ (29) స్నేహితురాలి ద్వారా పరిచయం అయ్యాడని తెలిపింది. తరువాత వాట్సాప్ చాటింగ్‌లో విఘ్నేష్ తనను ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని తెలుపగా తన కన్నా మూడేళ్లు చిన్నవాడు కావడంతో తిరస్కరించానని చెప్పింది.
అయినా అతను ఒత్తిడి చేయడంతో ప్రేమించానని, తనకు పుట్టుకతోనే కిడ్నీ లేదనే విషయం నాలుగేళ్ల క్రితం తెలిసిందని అతనికి చెప్పానంది. అందుకు విఘ్నేష్ తాను దివ్యాంగుడని వివాహానికి అభ్యంతరం లేదని తెలిపాడు. తరువాత 2017, ఫిబ్రవరి 26న ఇద్దరి కుటుంబ సభ్యుల సమ్మతితో నిశ్చితార్థం జరిగింది. ఈ లోపు తన తండ్రి మృతి చెందడంతో వివాహం ఆలస్యమైందని తెలిపింది. ఈ క్రమంలో తను ఓ కిడ్నీ లేదని విఘ్నేష్ తనను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని పేర్కొంది. విఘ్నేష్ అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని, అతనితో వివాహం చేయించాలని ఫిర్యాదులో కోరింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.