సాక్షి, చెన్నై: వివాహమైన నెలరోజుల్లోనే భర్త ప్రియురాలితో పరార్ కావడంతో ఆవేదనకు గురైన నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని ఆర్కేపేటలో మంగళవారం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా పళ్లిపట్టు తాలూకా ఆర్కేపేట మండలంలోని తామనేరి పంచాయతీ రంగాపురం గ్రామానికి చెందిన సంపత్‌రెడ్డి కుమార్తె అర్చనదేవి (21) బీబీఏ వరకు చదువుకుంది. ఈమెకు వేలూరు జిల్లా నెమిలి సమీపంలోని పుధూరు గ్రామానికి చెందిన బీఈ ఇంజినీర్ తంగరాజ్‌తో నెల రోజుల కిందట పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది.
ఆనందంతో కుటుంబ జీవితంలో అడుగు పెట్టిన అర్చనదేవి జీవితంలో కొద్ది రోజుల్లోనే భర్త రూపంలో పిడుగుపడింది. వివాహమైన నెల రోజుల్లోనే తంగరాజ్ ప్రియురాలితో పరారయ్యాడు. దీంతో ఆవేదనకు గురైన అర్చనదేవి రంగాపురంలోని తల్లిదండ్రులతో ఉంటోంది. ఈ స్థితిలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న ఆర్కేపేట పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షోళింగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment