
సాక్షి, బళ్లారి రూరల్: నగరంలోని సత్యనారాయణపేటలో ఆస్తి కోసం తమ్ముడు తన సొంత అక్కనే హతమార్చిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్యనారాయణపేటకు చెందిన సునంద పూజార్(40) న్యాయవాదిగా జీవనం సాగిస్తుండేది. తండ్రి ఆస్తికి సంబంధించి సునంద పూజార్‌కు సోదరుడు వేణుగోపాల్‌కు మధ్య కొంతకాలంగా వివాదం నెలకొంది. ఈనేపథ్యంలో శుక్రవారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో అక్కా తమ్ముళ్లు సునంద పూజార్, వేణుగోపాల్ మధ్య వాగ్వాదం తీవ్రమైంది.
దీంతో ఆవేశంతో వేణుగోపాల్ ఇంట్లో ఉన్న మచ్చు కత్తితో సునందపై దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు తీవ్ర రక్తస్రావంతో అక్కడే కుప్పకూలింది. తల్లి పరిస్థితి చూసి సునంద కూతురు చుట్టు పక్కల వారిని పిలవగా, వెంటనే వారు విమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ సునంద శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడు పరారీలో ఉన్నాడు.