శివనందిని( ఫైల్) నిందితుడు సిద్దార్ధ
మలక్‌పేట: ఆస్తి కోసం ఓ వ్యక్తి సొంత అక్కను గొంతు నులిమి హత్య చేయడమేగాక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన మూసారంబాగ్ డివిజన్ ఈస్ట్‌ప్రశాంత్‌నగర్‌లో గురువారం వెలుగులోకి వచ్చింది. ఇందుకు అతని తల్లిదండ్రులు సహకరించడం గమనార్హం. ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు కథనం మేరకు వివరాలి ఉన్నాయి.. జహీరాబాద్, పోతిరెడ్డిపల్లెకు చెందిన కోనాపురం మైసయ్య బ్యాంక్ అధికారిగా పని చేసి రిటైర్ అయ్యాడు. మూసారంబాగ్ డివిజన్ ఈస్ట్ ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్న అతడికి భార్య నిర్మల ఇద్దరు కుమార్తెలు శివనందిని (38), అర్చన, కుమారుడు సిద్దార్ధ ఆలియాస్ సిద్దూ ఉన్నారు. పెద్ద కుమార్తె శివనందినికి వరంగల్‌కు చెందిన దేవేంద్రనాథ్‌తో 2004లో వివాహం చేశారు. రెండో కుమార్తె అర్చన కుటుంబంతో కలిసి బెంగుళూరులో ఉంటోంది. వనపర్తి జిల్లాలో ఇరిగేషన్ శాఖలో ఏఈగా పని చేస్తున్న సిద్దార్ధ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. అయితే దేవేంద్రనాథ్, శివనందిని కుమారుడు బ్రిజినిల్‌తో కలిసి సైనిక్‌పురిలో ఉండేవారు. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో 2017లో వారు విడాకులు తీసుకున్నారు. అనంతరం శివనందిని కుమారుడితో కలిసి ఈస్ట్ ప్రశాంత్‌నగర్‌లోని పుట్టింటికి వచ్చింది. వనస్థలిపురంలో ఉన్న ఓపెన్ ప్లాట్, ఈస్ట్‌ప్రశాంత్‌నగర్‌లో ఇంట్లో వాటా ఇవ్వాలని శివనందిని గత కొంతకాలంగా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తోంది.
అందుకు అంగీకరించని సిద్ధార్థ ఆమెపై కక్ష పెంచుకుని హత్య చేయడానికి పథకం పన్నాడు. ఇందులో భాగంగా ఈనెల 17న తల్లిదండ్రులతో కలిసి అతను అక్క శివనందిపై దాడి చేశాడు. అనంతరం తల్లి నిర్మల పట్టుకోగా సిద్దార్ధ శివనందిని గొంతునులిమి చంపేశాడు. మృతదేహాన్ని ఇంటి వెనక ఉన్న బాత్‌రూమ్‌లో పడేసి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఆమె ఒంటిపై వస్త్రాలను తొలగించి ముఖంపై ఆర్పిక్ పోశాడు. అనంతరం బయటికి వెళ్లిన తన సోదరి ఇంటికి రాలేదని పేర్కొంటూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయం అతను తన సోదరి బాత్‌రూంలో మృతి చెందిందని పేర్కొంటూ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. జాగిలాలు సిద్దార్ధ చుట్టూ తిరగడంతో అతడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.
నిందితులు సిద్దార్థ, నిర్మల కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. శివనందిని అంత్యక్రియల అనంతరం మైసయ్యను కూడా అరెస్ట్ చేస్తామన్నారు. మలక్‌పేట ఏసీపీ సుదర్శన్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మృతురాలి పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్లు తల్లి, తమ్ముడు నటించడం పట్ల పోలీసులు ఆశ్చ ర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘అక్క ఒంటిపై నగలు ఉన్నాయని, నగలు పోయినా ఫర్వాలేదు.. అక్క క్షేమంగా తిరిగివస్తే చాలు అంటూ ప్రేమ ఒలకబోశాడన్నారు...‘ఏమైంది సార్.. మా అమ్మాయి విషయం ఏమైనా ఆచూకీ దొరికిందా.. ఫోన్ ఇంట్లోనే పెట్టిపోయింది.. ఫోన్‌లో ఏమైనా సమాచారం దొరుకుతుందా.. అని తల్లి నిర్మల పోలీసులను ఆడగటం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment