నడిరోడ్డుపై దారుణ హత్య | Brutal murder on the main road | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై దారుణ హత్య

Jun 1 2019 2:12 AM | Updated on Jun 1 2019 2:12 AM

Brutal murder on the main road - Sakshi

పటాన్‌చెరు టౌన్‌: ప్రతీకారం ‘కత్తి’పట్టింది. దాదాపు ఏడు నెలల క్రితం నాటి కక్ష.. పట్టపగలు జాతీయ రహదారిపై హత్యకు దారితీసింది. నాడు జరిగిన హత్యకు ప్రతీకారంగా సరిగ్గా అదే ప్రాంతంలో దుండగుడు ఓ వ్యక్తిని తెగనరికాడు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు రుద్రారం ప్రాంతంలో శుక్రవారం 65వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ హత్యోదంతం సంచలనం కలిగించింది. హత్యోదంతాన్ని కొందరు వీడియోలు, ఫొటోలుగా చిత్రీకరించడంలో మునిగిపోయారు తప్ప.. అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఒళ్లు గగుర్పాటు కలిగించిన ఈ ఘటనతో జాతీయ రహదారిపై రెండు పక్కలా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. హంతకుడు ప్రత్యర్థిని కత్తితో తెగనరికి.. పది నిమిషాల్లో పని ముగించుకుని పరారయ్యాడు. ఈ దృశ్యాలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ భోలక్‌పూర్‌ ప్రాంతానికి చెందిన మహబూబ్‌ హుస్సేన్‌ (25) ఓ హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్నాడు.

ఈ కేసుకు సంబంధించి సంగారెడ్డి పట్టణంలోని కోర్టుకు శుక్రవారం హాజరయ్యాడు. కోర్టు పని ముగించుకున్న అనంతరం తన స్నేహితునితో కలిసి స్కూటీపై హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వీరు పటాన్‌చెరు రుద్రారం సమీపానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న దుండగుడు ఒక్కసారిగా హుస్సేన్‌ ప్రయాణిస్తున్న వాహనాన్ని అటకాయించాడు. ముప్పు ఊహించిన హుస్సేన్, అతని స్నేహితుడు వాహనం వదిలి పరుగులు పెట్టారు. దుండగుడు.. హుస్సేన్‌ను వెంబడిస్తూ కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన హుస్సేన్‌పై దుండగుడు యథేచ్ఛగా కత్తితో దాడి చేశాడు. తల, మెడ భాగాలను పలుమార్లు కత్తితో నరికి కిరాతకంగా హతమార్చాడు.

హుస్సేన్‌ను దుండగుడు తెగనరుకుతున్న క్రమంలో కత్తి బలంగా శరీరంలోకి దిగబడగా, దాన్ని బలంగా బయటకు లాగి పదేపదే వేటు వేసిన వైనం సంఘటన స్థలంలో ఉన్న వారిని హడలెత్తించింది. కాగా, హుస్సేన్‌ స్నేహితుడు ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. ఈ సంఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై ప్రయాణిస్తున్న వారు హడలెత్తిపోయి, ఎక్కడి వారు అక్కడే ఆగిపోయి ఉదంతాన్ని కళ్లప్పగించి చూశారు. హుస్సేన్‌ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత ఆ దుండగుడు పరారయ్యాడు. 

రెండు హత్యలూ అక్కడే.. 
గత ఏడాది నవంబర్‌లో హుస్సేన్‌ వ్యాపార భాగస్వామి అర్షద్‌ పటాన్‌చెరు లక్డారం సమీపంలోనే హత్యకు గురయ్యాడు. ఇప్పుడు హత్యకు గురైన హుస్సేన్‌ కూడా లక్డారం ప్రాంతానికి అతి సమీపంలోని రుద్రారంలో హతమయ్యాడు. అర్షద్‌ తాలూకు మనుషులే ఈ హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడే హత్యకు గురికావడం సంచలనంగా మారింది.

పథకం ప్రకారమే హత్య!
హుస్సేన్‌ శుక్రవారం కోర్టుకు హాజరవుతాడనే విషయం ముందే తెలిసిన వ్యక్తులే పథకం ప్రకారం మాటు వేసి ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు. కోర్టుకు హాజరై సంగారెడ్డి నుంచి తిరుగు ప్రయాణమైన హుస్సేన్‌.. ఎప్పుడు, ఏ సమయంలో ఎక్కడికి చేరుకున్నాడో పక్కాగా గమనిస్తూ, సమాచారం సేకరించిన మీదటే రుద్రారం వద్ద అతడిని హతమార్చినట్టు పోలీసులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖరరెడ్డి సందర్శించారు. హుస్సేన్‌ గతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడని, ఆ కేసులోని ప్రత్యర్థులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని, మొత్తానికి పాత కక్షలే ఘటనకు కారణమని అనుమానిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

పాత హత్య కేసు నేపథ్యం..
సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్‌ భోలక్‌పూర్‌కు చెందిన మహబూబ్‌ హుస్సేన్, చర్లపల్లికి చెందిన హర్షద్‌ కలిసి రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారం నిర్వహించేవారు. ఈ దందాలో విభేదాలు రావడంతో హుస్సేన్‌.. అర్షద్‌కు చెందిన రేషన్‌ బియ్యాన్ని ఒక సందర్భంలో అధికారులకు సమాచారం ఇచ్చి పట్టించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలు పెరిగి పెద్దవైన నేపథ్యంలో అర్షద్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్న మహబూబ్‌ హుస్సేన్‌.. అతని డీసీఎం డ్రైవర్‌ సమీర్‌తో పాటు మరికొందరితో కలిసి పథకం వేశాడు. ఈ క్రమంలో మాట్లాడే పని ఉందని గత ఏడాది నవంబర్‌ 17న కబురంపిన హుస్సేన్‌.. పటాన్‌చెరు మండలం లక్డారం సమీపంలోకి అర్షద్‌ను రప్పించాడు. అక్కడ రాడ్‌తో కొట్టి అర్షద్‌ను హతమార్చాడు. మృతదేహాన్ని రోడ్డుపై పడవేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. హత్యోదంతం మర్నాడు అర్షద్‌ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అనంతరం దర్యాప్తు చేసి మహబూబ్‌ హుస్సేనే అర్షద్‌ను హత్య చేశాడని నిర్ధారించి, అతడిని ఏ1గా, ఇందుకు సహకరించిన సమీర్‌ను ఏ2గా నిర్ధారిస్తూ రిమాండ్‌కు తరలించారు. అనంతరం బెయిల్‌పై విడుదలైన మహబూబ్‌ హుస్సే న్‌.. శుక్రవారం ఈ కేసుకు సంబంధించి సంగారెడ్డి కోర్టుకు వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలోనే రుద్రారం సమీపంలో హత్యకు గురయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement