ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతుందని ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. గత నెల 29న సదాశివపేట మండలంలోని ముబారక్ పూర్ గ్రామ శివారులో సన్నం వాగు సమీపంలో అనుమానాస్పద స్థితిలో జరిగిన మహిళ హత్య కేసును ‘పేట’ పోలీసులు ఛేదించారు. శనివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో హత్యకు సంబంధించిన వివరాలను సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, సీఐ సంతోష్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి మండలంలోని గుడితాండకు చెందిన రమావత్ లక్ష్మీ అలియాస్ బులీబాయి(38) అడ్డమీద కూలీ పని చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తుంది.
ఈమెకు సంగారెడ్డి పట్టణంలోని మారుతీనగర్ కు చెందిన వడ్డే నర్సింలు(38)తో పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా రమావత్ లక్ష్మీతో నర్సింలు, అతడి భార్య ఎల్లమ్మకు పరిచయం ఉంది. అందరూ కలిసి కూలి పనులకు వెళ్లేవారు. భార్యాభర్తల మధ్య గొడవలు పెడుతుందని ఈ మధ్యకాలంలో భార్య ఎల్లమ్మ తరుచూ నర్సింలుతో గొడవలు పడుతుంది. తనపై లేనిపోని మాటలు తన భార్యకు చెప్పి గొడవలకు కారణమవుతున్న లక్ష్మీని ఎలాగైనా చంపాలని నర్సింలు నిర్ణయించుకున్నాడు. గత నెల 29న బైక్‌పై లక్ష్మీని ఇరిగిపల్లికి తీసుకెళ్లి ఇద్దరూ కలిసి కల్లు సేవించారు.
అనంతరం రెండు బాటిల్లు తీసుకొని తర్వాత తాగుదామని చెప్పి ముబారక్ పూర్(బి) గ్రామ శివారులో గల సన్నం వాగు ప్రక్కన ఉన్న తుమ్మ చెట్ల పొదలకు తీసుకొని కట్టతో ఆమెను తీవ్రంగా కొట్టి చంపేశాడు. ఈ నెల 5న ఘటన వెలుగులోకి రావడంతో గుర్తుతెలియని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు చాకచక్యంగా వారం రోజుల్లో కేసును ఛేదించారు. నిందితుడు నర్సింలును అదుపులోకి తీసుకొని అతడి నుంచి లక్ష్మికి సంబంధించిన కడియాలు, నిందితుడి బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. త్వరితగతిన కేసును ఛేదించిన సీఐ సంతోష్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించి.. పోలీస్ సిబ్బంది రమేశ్, వీరేశం, శ్రీనులకు డీఎస్పీ బాలాజీ రివార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment