
చీమకుర్తి: తల్లీబిడ్డను హత్య చేసి దహనం చేసిన అమానుష ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో మంగళవారం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని పసిబిడ్డతో సహా సుమారు 23 సంవత్సరాల వయస్సు గల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అతి దారుణంగా హత్యచేశారు. వీరిద్దరినీ తల్లీబిడ్డలుగా పోలీసులు భావిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఈ సంఘటన జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌లో దిశ ఘటన మరువక ముందే జరిగిన ఈ దారుణం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు, మద్దిపాడు మండలం పెదకొత్తపల్లికి మధ్య రోడ్డులోని పొలాల్లో ఓ రైతు మంటలను గమనించి పేర్నమిట్టలో కొందరికి చెప్పాడు.
వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తల్లీబిడ్డ మృతదేహాలు కొంతమేర కాలిపోయి గుర్తించడానికి వీల్లేకుండా ఉన్నాయి. ఘటనా స్థలంలో పెట్రోల్ డబ్బా, పెద్ద బండ రాయి ఉన్నాయి. తల్లిని పెద్ద బండరాయితో తలపై మోది చంపి ఉంటారని, ఆ తర్వాత బిడ్డను చంపి ఇద్దరిపై పెట్రోల్ పోసి దహనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చిన్న బిడ్డను బాలికగా గుర్తించారు. హత్యకు గురైన మహిళ గులాబీ రంగు చీర, అదే రంగు చెప్పులు ధరించి ఉంది. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్ నేతృత్వంలో స్థానిక పోలీసులు ఘటనా ప్రాంతంలో వివరాలు సేకరించారు. నిందితులు ఎవరు?, ఎందుకీ ఘోరానికి పాల్పడ్డారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment