లక్నో : గోవులను వధించారనే వార్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆందోళనకారుల దాడిలో ఎస్‌ఐ సుబోధ్ కుమార్, సుమిత్ కుమార్ అనే యువకుడు మృతి చెందారు. ఈ ఘటన డిసెంబర్ 3న జరగగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న యోగేష్‌రాజ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని జిల్లా భజరంగ్‌దళ్ కన్వీనర్ యోగేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, అరెస్టు ముందు అతనొక వీడియోలో.. అల్లర్లు జరిగిన చోట నేను లేను. హింసాకాండ, ఆందోళలనకు నాకు ఏ సంబంధం లేదు. ప్రభుత్వం నన్ను చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోంది. చెరుకు తోట సమీపంలో పశువుల కళేబరాలున్నాయని ఎవరో కాల్ చేశారు. దాంతో నేరుగా సియానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. ఆందోళన జరుగుతున్న సమయంలో భజరంగ్‌దళ్ మిత్రులతో కలిసి స్టేషన్‌లోనే ఉన్నాను’ అని చెప్పుకొచ్చాడు. (యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా)
ఇదొక కథ..?
యోగేష్‌రాజ్ పోలీసులకు ఇచ్చిన నివేదికలో వివరాలు మరోలా ఉన్నాయి. మిత్రులతో కలిసి సోమవారం (డిసెంబర్, 3) ఉదయం 9 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్‌కి వెళ్లినట్టు చెప్పాడు. పొరుగునున్న మహావ్ గ్రామంలోని చెరుకు తోట సమీపంలో గోవులను వధిస్తున్న ఏడుగురు ముస్లిం యువకులను గుర్తించామని, వారిని పట్టుకుందామనే లోపలే పారిపోయారని వివరించాడు. ఆ యువకులు తమ గ్రామానికి చెందినవారేనని తెలిపాడు.
ఇదిలాఉండగా.. హింసాకాండ చెలరేగిన అనంతరరం కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వాటిల్లో.. పశువధ నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ యోగేష్ రోడ్లను బ్లాక్ చేయించినట్టుగా ఉంది. ఆందోళన సాగుతున్న సమయంలో అతను పోలీసులతో మాట్లాడుతున్న మరో వీడియో కూడా బయటకొచ్చింది. వీడియోల్లో లభ్యమైన ఆధారాలను బట్టి హింసాకాండకు ప్రధాన సూత్రధారి యోగేష్ అనేందుకు బలం చేకూరుతోంది. భజరంగ్‌దళ్ రాష్ట్ర కో-కన్వీనర్ ప్రవీణ్ భాటి మాట్లాడుతూ.. బులంద్‌షహర్ హింసాకాండతో యోగేష్‌రాజ్‌కి సంబంధం లేదని అన్నారు. ఆందోళన సమయంలో అతను పోలీసులకు సాయం చేశాడని చెప్పారు. హత్య, హత్యాయత్నం నేరాల కింద యోగేష్‌పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని నష్టపరిచారని కూడా కేసు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment