సాక్షి, సిటీబ్యూరో: రైల్వేలో ఉద్యోగాల పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు వంద మంది నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు దండుకున్న ఘరానా మోసగాడు పమ్మిడి దుర్గా ప్రసాద్ రావు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు చిక్కాడు. భార్యతో కలిసి మోసాలు చేస్తున్న ఇతడిపై ఐదు కేసులు నమోదై ఉండగా... మరో ఏడు కేసుల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు స్పెషల్ టీమ్–2 అధికారులు గుర్తించారు. డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీకి చెందిన దుర్గా ప్రసాద్ కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉన్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మోసాలకు శ్రీకారం చుట్టాడు. తన భార్య పద్మినితో కలిసే పథకం రచించిన అతను రైల్వేలో తనకు ఉన్న పరిచయాలు వినియోగించుకుని దొడ్డిదారిన గ్రూప్ సీ,డీతో పాటు స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రచారం చేసుకున్నాడు. ఆసక్తి చూపిన వారి నుంచి అడ్వాన్స్‌గా రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు.
మోసం చేస్తూ ‘మోసగాళ్లని’...
ఈ అభ్యర్థుల్లో కొందరితో బోగస్ పత్రాలపై సంతకాలు చేయించుకోవడంతో పాటు రైల్వే ఉద్యోగాలకు వైద్య పరీక్షలు తప్పనిసరని చెప్పిన అతను కొందరు అభ్యర్థులను లాలగూడలోని రైల్వే ఆస్పత్రికి తీసుకెళ్లి వీరికి రక్త, మూత్ర పరీక్షలు చేయించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఇంకా ఎందుకు రాలేదంటూ ప్రశ్నించడంతో దీంతో తన భార్య సహకారంతో వీరిని సొంత కారులోనే సికింద్రాబాద్‌లోని రైల్ నిలయానికి పంపాడు. అక్కడి ఓ చోట వీరిని కూర్చోబెట్టిన పద్మిని ఈ కార్యాలయం నుంచే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు వస్తాయంటూ నమ్మబలికింది. అయితే ఇటీవల కొందరు మోసగాళ్లు రైల్వేలో ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేశారని, దీంతో రైల్ నిలయం అధికారులు వారిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారని, అందుకే నియామక పత్రాల జారీని తాత్కాలికంగా నిలిపేశారని, నెల రోజుల తర్వాత ప్రారంభిస్తారంటూ చెప్పి వారిని నమ్మించి పంపింది.
కారు ఇచ్చి మళ్లీ కేసు పెట్టాడు...
దుర్గా ప్రసాద్ నగరానికి చెందిన ఓ యువకుడికి హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించాడు. పూర్తిగా తన వల్లో పడ్డాడని నిర్ధారించుకున్న తర్వాత వివిధ పేర్లు చెప్పి అతడి నుంచి రూ.10 లక్షలు వసూలు చేశాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో సదరు యువకుడు దుర్గాప్రసాద్‌ను నిలదీయడమేగాక తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. దీంతో తన కారును ఇచ్చిన దుర్గాప్రసాద్ ఆపై సదరు యువకుడు తన కారు ఎత్తుకెళ్లాడని కేసు పెట్టి అరెస్టు చేయించాడు. చివరకు అసలు విషయం తెలియడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఇతడిపై సీసీఎస్‌లో నమోదైన కేసును ఇన్‌స్పెక్టర్ ఆర్‌జీ శివమారుతి నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసింది. ముమ్మరంగా గాలింపు చేపట్టి మంగళవారం బంజారాహిల్స్‌లో దుర్గా ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనేక మందిని మోసం చేసిన ఇతను తన ఇంటి చుట్టూ దాదాపు 80 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాడు. బాధితులు, పోలీసులు తన కోసం వస్తే వాటి ద్వారా తెలుసుకుని ఉడాయించేవాడు. అయితే కొన్ని రోజులుగా ఆ సీసీ కెమెరాలు పని చేయట్లేదని తెలిసింది.
మరికొన్ని కేసులూ వెలుగులోకి...
ఈ కేసును సాంకేతికంగా దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు దుర్గా ప్రసాద్‌పై మరికొన్ని కేసులు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని బంజారాహిల్స్, సైఫాబాద్‌లతో పాటు విజయవాడలోనూ కేసులు ఉన్నట్లు తేల్చారు. వీటితో పాటు మరో ఏడు కేసుల్లో పరోక్షంగా ప్రమేయం కలిగి ఉన్నట్లు తెలిపారు. రేషన్ షాపులకు బియ్యం తదితరాలు తక్కువ ధరకు ఇప్పిస్తామని, బంగారం వ్యాపారం పేరుతో పలువురిని మోసం చేసిన నేరగాళ్లతో ఇతడికి ప్రమేయం ఉన్నట్లు, ఈ తరహాకు చెందిన ఐదు కేసులు ఉన్నట్లు గుర్తించారు. మరో మూడు కేసుల్లో ఇతర ప్రాంతాలకు చెందిన పోలీసులు నిందితుడు ఎవరనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. సీసీఎస్ పోలీసులు దుర్గారావును అరెస్టు చేయడంతో వారికి మార్గం సుగమమైంది. ఇంతటి ఘరానా చరిత్ర ఉన్న దుర్గా ప్రసాద్‌కు ఓ కాలు లేకపోవడం, ప్రతి రెండు రోజుకోసారిడయాలసిస్ తప్పనిసరి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment