సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వివాదాస్పద గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్టీ) అనే వెబ్ సిరీస్ తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు శనివారం మూడుగంటపాలు విచారించారు. పోలీసుల విచారణ ముగిసిన అనంతరం వర్మ మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు.
జీఎస్టీ వెబ్‌సిరీస్‌లో మహిళలను కించపరిచారని, సామాజిక కార్యకర్త దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగాలపై వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు. వర్మపై దేవి చేసిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. వర్మను 25 నుంచి 30 ప్రశ్నలు అడిగామని, అతని ల్యాప్‌ట్యాప్‌ను సీజ్ చేశామని సీసీఎస్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మీడియాకు తెలిపారు. సామాజిక కార్యకర్త దేవిపై ఉద్దేశపూర్వకంగా ఏ వ్యాఖ్య చేయలేదని, టీవీ చర్చలో భాగంగా ఆవేశంలో, ఉద్వేగపూరితంగానే వ్యాఖ్యలు చేశానని వర్మ వివరణ ఇచ్చినట్టు తెలిపారు. వారం తర్వాత వచ్చే శుక్రవారం విచారణకు రావాలని వర్మను ఆదేశించినట్టు తెలిపారు.
‘వర్మపై నమోదైన కేసు ప్రకారమే విచారణ జరిపాం. టెక్నికల్, లీగల్ అంశాలపై వర్మని ప్రశ్నించాం. జీఎస్టీ అనే వీడియోని ఏ దేశంలో పోస్టు చేసి విడుదల చేశారో ప్రశ్నించాం. జీఎస్టీని పోలాండ్, యూకేలో తీశామని వర్మ చెప్పారు. వెబ్‌లో విడుదల చేసిన మియా మల్కోవా నగ్న ఫోటోలను ఎక్కడ తీశారో ప్రశ్నించాం. ఆ ఫోటోలు తను వేరే చిత్రం షూటింగ్‌లో ఉన్నప్పుడు కలిసి తీసుకున్నానని వర్మ తెలిపారు. ఆ ఫోటోలను, సినిమా వీడీయోకి సంబంధించిన ఆధారాలను ఎఫ్ఎస్ఎల్ కి పంపించాం’ అని ఆయన వివరించారు.
వర్మ పాస్‌పోర్ట్ వెరీఫై చేస్తామని, అతను నిజంగానే ఇతర దేశాలకి వెళ్లి జీఎస్టీని తీశాడా లేదా ఇక్కడే ఉండి తీశాడా అన్నది విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఇంకా మిగతా టెక్నికల్ ఆధారాలకి సంబంధించి మూడు రోజుల సమయం కావాలని వర్మ కోరారని, ఈ విషయంలో లీగల్ సలహా తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment