నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలో గొలుసు దొంగలు హల్‌చల్ చేశారు. ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో పనిచేస్తున్న పద్మావతి ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం సమీపంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇంటికి వెళుతుండగా ఇంటికి సమీపంలోని పెట్రోల్‌బంకు వద్దకు వచ్చేసరికి ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని ఏడు సవర్ల బంగారు గొలుసులను తెంపుకెళ్లారు. ఆమె గట్టిగా కేకలు వేసినా లాభం లేకుండా పోయింది.
మహిళా హెడ్‌కానిస్టేబుల్ మెడలో..
వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో అమృతవల్లి హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఆమె నగరంలోని ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం సమీపంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆమె స్టేషన్ నుంచి స్కూటీలో ఇంటికి బయలుదేరింది. ఇంటిగేట్ తీసేందుకు స్కూటీ ఆపి వెళుతుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని ఆరు సవర్ల బంగారు గొలుసును తెంపుకెళ్లారు. బాధితురాలు పెద్దగా అరిచేలోగా దుండగులు బైక్ వేగం పెంచి పరారయ్యారు.
రమేష్‌రెడ్డినగర్‌లో...
కె.లక్ష్మీప్రసన్న అనే మహిళ రమేష్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె మంగళవారం రాత్రి ఏసీ కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి నడుచుకుంటూ బయలుదేరింది. ఇంటికి సమీపంలో వచ్చేసరికి ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని మూడుసవర్ల బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ మేరకు బాధితులు ఘటన జరిగిన కొద్దిసేపటికే చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణ చేస్తున్న పోలీసులు
గొలుసు దొంగతనాలు జరగడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం నగర వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మోటార్‌బైక్‌పై అనుమానాస్పదంగా వెళుతున్న ఇద్దరు వ్యక్తులను చిన్నబజారు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. వారే గొలుసులను దొంగలించినట్లుగా విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment