విద్యార్థి కాల్పుల్లో మరణించిన ప్రిన్సిపాల్ రితు చబ్రా
యమునానగర్: స్నేహితుల ముందు మందలించిందన్న కోపంతో 12వ తరగతి విద్యార్థి మహిళా ప్రిన్సిపాల్‌ను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. హరియాణాలోని యమునానగర్‌లో స్వామి వివేకానంద పాఠశాలలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల ఆ విద్యార్థి అదే పాఠశాలలో కామర్స్ కోర్సు చదువుతున్నట్లు తెలిసింది. తండ్రి తుపాకీని దొంగిలించి ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని హత్యా నేరం కింద కేసు నమోదుచేశారు. యమునానగర్ ఎస్పీ రాజేశ్ కాలియా వెల్లడించిన వివరాల ప్రకారం...ప్రిన్సిపాల్‌తో కొద్దిసేపు మాట్లాడి బయటకు వచ్చిన తరువాత విద్యార్థి మళ్లీ లోనికి వెళ్లి ఆమెపై కాల్పులు జరిపాడు.
ఛాతీ, పొట్ట, భుజంపై నాలుగు బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్ రీతు చాబ్రా(47)ను వెంటనే ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. ఆమెను కాల్చిన తరువాత విద్యార్థి పారిపోవడానికి ప్రయత్నించినా అక్కడే ఉన్న కొందరు తల్లిదండ్రులు, స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయులు ఫిర్యాదు చేయడంతో స్నేహితుల ముందే ప్రిన్సిపాల్ తనను గతంలో రెండుసార్లు మందలించడం బాధించిందని అతడు పోలీసులకు చెప్పాడు. దాన్ని మనసులో ఉంచుకుని ఆమెపై కోపంతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో అల్మారా బద్దలుకొట్టి తన తండ్రి తుపాకీని దొంగిలించి ఆమెపై కాల్పులు జరిపాడు. విచారణలో విద్యార్థి తన నేరాన్ని అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment