స్వాధీనం చేసుకున్న నగదును చూపుతున్న సీపీ అంజనీకుమార్ నిందితుడు మురళి
సాక్షి, సిటీబ్యూరో: అతని పేరు సుబ్రమణియన్ మురళి... వృత్తి ప్రైవేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్... ఈయనకు నెలకు వచ్చే జీతం రూ.32 వేలు... అయితే సంస్థ నుంచి కాజేసిన మొత్తం మాత్రం సరాసరి నెలకు రూ.1.77 లక్షలు... 2016 నుంచి 33 నెలల్లో రూ.58.49 లక్షలు స్వాహా చేశాడు... ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. మంగళవారం జాయింట్ సీపీ తరుణ్ జోషి, డీసీపీ పి.రాధాకిషన్‌రావులతో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
క్లర్క్ నుంచి సీనియర్ మేనేజర్ వరకు....
బెంగళూరులోని శివాజీనగర్‌కు చెందిన పరోల్ సుబ్రమణియన్ మురళి ప్రాథమిక విద్య పూర్తి చేసిన అనంతరం నగరానికి వలసవచ్చాడు. సికింద్రాబాద్‌లోని ఓ కాలేజీలో బీకాం చదివాడు. ఆపై కోఆపరేటివ్ బ్యాంక్స్‌లో అడుగుపెట్టిన ఇతను బేగంపేటలోని ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, రామ్‌కోఠిలోని వర్థమాన్ మహిళా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, చందానగర్‌లోని ఈనాడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌ల్లో పని చేసి ప్రస్తుతం సికింద్రాబాద్, ఘాసీమండీలోని ఏపీ మహాజన్స్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌లో పని చేస్తున్నాడు. బ్యాంకింగ్ రంగంలో క్లర్క్‌గా అడుగుపెట్టిన ఇతగాడు అకౌంటెంట్, మేనేజర్ స్థాయిలు దాటి ప్రస్తుతం సీనియర్ మేనేజర్ హోదాలో ఉన్నాడు. 2014 నవంబర్ నుంచి ఈ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్ హోదాలో ఉన్న మురళికి సదరు సంస్థ నెలకు రూ.32 వేల చొప్పునజీతం ఇస్తోంది.
అంత డబ్బు చూసి కన్నుకుట్టడంతో...
ఈ బ్యాంక్‌లో జరుగుతున్న భారీ నగదు లావాదేవీలు చూసిన ఇతగాడి కన్నుకుట్టింది. ఆ నగదు కాజేయాలనే దుర్బుద్ధితో 2016 జనవరి 8 నుంచి గత నెల 15 వరకు 35 లావాదేవీల్లో బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ.58,49,566 కాజేశాడు. సరాసరిన నెలకు రూ.1.77 లక్షల చొప్పున స్వాహా చేసినట్లయ్యింది.
వీటిని వివిధ మార్గాల్లో తనతో పాటు తన కుటుంబీకుల పేర్లతో ఉన్న ఖాతాల్లోకి మళ్లించి అనేక చోట్ల పెట్టుబడులు పెట్టాడు. ఈ విషయం గుర్తించిన సంస్థ సీఈఓ సూర్యనారాయణమూర్తి మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇతడి కదలికలపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎస్సైలు బి.శ్రవణ్‌కుమార్, కేఎస్ రవి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీకాంత్ వలపన్ని పట్టుకున్నారు. ఇతడినుంచి రూ.56.3 లక్షలు రికవరీ చేసి తదుపరి చర్యల నిమిత్తం మార్కెట్ పోలీసులకుఅప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment