
మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులు (ఇన్‌సెట్) సెవ్వంది (ఫైల్)
అన్నానగర్: దిండుగల్‌లో బుధవారం బావిలో దూకి కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దిండుగల్‌లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. దిండుగల్ ఆర్‌ఎంకాలనీ 12వ వీధికి చెందిన ధనశేఖరన్. ఇతని భార్య ఈశ్వరి. వీరి కుమార్తె సెవ్వంది (19). ఈమె దిండుగల్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదివేది. కొన్ని సంవత్సరాల ముందు ధనశేఖరన్ మృతి చెందాడు. అనంతరం కూలీపనులు చేస్తూ బంధువుల సహా యంతో కుమార్తెని ఈశ్వరి చదివిస్తోంది.
ఈ క్రమంలో సెవ్వంది తరచూ తల్లి, బంధువుల వద్ద గొడవపడేది. కొన్ని సార్లు ఆత్మహత్యకి యత్నించినట్లు తెలిసింది. ఈ స్థితిలో కొన్ని రోజుల ముందు సెవ్వంది ఇంట్లో టీవీ చూస్తుండగా ఆమెను ఈశ్వరి మందలించింది. దీంతో ఆమె తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకి వెళ్లింది. చాలాసేపైనా సెవ్వంది తిరిగి రాకపోవడంతో ఈశ్వరి కూతురి కోసం వెతికింది. కాని ఆమె ఆచూకీ తెలియలేదు. అనంతరం దిండుగల్ పోలీసుస్టేషన్‌లో ఈశ్వరి ఫిర్యాదు చేసింది. ఈ స్థితిలో బుధవారం ఈశ్వరి ఇంటి సమీపంలో ఉన్న బావిలో సెవ్వంది శవంగా తేలింది. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో సెవ్వంది తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఆమె బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.