చిందరవందరగా పడిఉన్న వంట సామగ్రి
దుండిగల్: ఓ వివాహ వేడుకలో డీజే సౌండ్ విషయంలో తలెత్తిన గొడవ గురువారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సుమారు ఆరుగురు వ్యక్తులు మరో 20 మందితో కలిసి వివాహ విందులో వీరంగం సృష్టించారు. పెళ్లి కొడుకు అన్నతో సహా బంధువులపై విచక్షణా రహితంగా దాడులు చేసిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సూరారం న్యూశివాలయ నగర్‌కు చెందిన సాయిశంతిన్‌కుమార్ వివాహ విందు గురువారం రాత్రి ఏర్పాటు చేశారు. రాత్రి 11.30 సమయంలో ఒక్కసారిగా డీజే సౌండ్ విషయంలో అంతకు ముందు జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని అదే ప్రాంతానికి చెందిన మన్నె రాజు, మరో 20 మంది కలిసి ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. గతంలో మన్నెరాజుపై దుండిగల్ పీఎస్ పరిధిలో కేసులు నమోదై ఉండగా తాజాగా ఈ కేసుతో మరో వివాదంలో చిక్కుకున్నాడు. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ నుంచి సూరారం డివిజన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఇతను ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు.
గొడవలో డెకరేషన్ సెట్, విందు సామగ్రి ధ్వంసమయ్యాయి. ఈ మేరకు సంతోష్, కాశీ, శ్రీకాంత్, వెంకటేశ్, ఉమామహేశ్, నర్సింగ్‌లతో పాటు ఇరవై మంది కుటుంబ సభ్యులపై అకారణంగా దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరంతా షాపూర్‌నగర్ రామ్ ఆస్పత్రి, సూరారం మల్లారెడ్డి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహిళల మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, అరతులం ఉంగరం, ఐదు తులాల బంగారు చైన్, రెండున్నర తులాల నెక్లెస్, మూడు తులాల నల్లపూసల గొలుసు ఎత్తుకెళ్లిన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దుండిగల్ పోలీసు లు 324, 384, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై, తన తమ్ముడు కాశీని చంపేందుకు కుట్ర పన్నాడని బాధితుడు సంతోష్ ఆందోళన వ్యక్తం చేశారు. వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా గొడవ జరుగుతున్న విషయంపై గాయపడిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో వచ్చిన పెట్రోలింగ్ సిబ్బందిపై సైతం దాడికి దిగారు. డీజేను నిలిపి వేయడంతో తిరిగి పెట్టమని ఒత్తిడి చేసి తనపై దాడికి పాల్పడ్డారని మరో వర్గం వారు ఫిర్యాదు చేశారు. తమపై దాడి జరిగిందంటూ ఇరు వర్గాల వారుపోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment