సీఐ అవినీతిపై కానిస్టేబుల్‌ సెల్ఫీ వీడియో | Constable Selfie Video on CI Corruption | Sakshi
Sakshi News home page

సీఐ అవినీతిపై కానిస్టేబుల్‌ సెల్ఫీ వీడియో

Published Thu, Apr 26 2018 8:40 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

Constable Selfie Video on CI Corruption - Sakshi

సాయి ఈశ్వర్‌గౌడ్, మిర్యాలగూడ టూ టౌన్‌ సీఐ

మిర్యాలగూడ అర్బన్‌ : మిర్యాలగూడ టూటౌన్‌ సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ అవినీతిపై అదే స్టేషన్‌ కానిస్టేబు ల్‌ రాజుకుమార్‌ తీసిన ఆడియో, వీడియోలు బుధవారం పోలీస్‌శాఖను కలవరానికి గురిచేశాయి. ఇసుక, కిరోసిన్, రేషన్‌ బియ్యం వ్యాపారులనుంచి నెలవారీ మాముళ్లు వసూలు చేస్తున్నారని వీడియో ద్వారా బయటపెట్టాడు. ఈ అక్రమాలను అడ్డుకున్నాడనే నెపంతో కొద్ది రోజులుగా కానిస్టేబుల్‌ రాజుకుమార్‌ను డ్యూటీల విషయంలో వేధిస్తున్నారని పోలీస్‌ రికార్డులను చూపిస్తూ నిజాలను బయటపెట్టాడు.

స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక హోంగార్డును దఫేదార్‌గా నియమించుకున్న సీఐ.. అతని ద్వారా అవినీతి వ్యవహారాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. దఫేదార్‌లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తున్నారనే సమాచారంతో ముందస్తుగా ఆ హోంగార్డు డ్యూటీని జనరల్‌ డ్యూటీగా మార్చారని రికార్డుల్లో మార్పుచేసిన విధానాన్నీ.. చూపించాడు. అతడి డ్యూటీని జనరల్‌ డ్యూటీగా మార్చడంతో ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ కాలేదని, తిరిగి పోలీస్‌స్టేషన్‌లోనే విధులు నిర్వహిస్తున్నాడని తెలిపారు.

అక్రమాలను అడ్డుకున్నందుకు తనపై కక్ష కట్టిన సీఐ డ్యూటీల విషయంలో తనను నిత్యం వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. స్టేషన్‌ వాచ్‌ డ్యూటీ చేసి  దిగిన అనంతరం ఆ రోజు ఆబ్సెంట్‌ వేశారని రాకార్డుల్లో చూపించాడు. ఈ నెల 18న పాతబస్టాండ్‌ సమీపంలో కిరోసిన్‌ అక్రమంగా తరలిస్తున్న ఆటోను పట్టుకున్న కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌ ఆ వివరాలను సైతం వీడియో తీశారు.  ప్రతి నెలా రూ.2500 మాముళ్లు ఇస్తున్నామని ఈ మొత్తాన్ని ఐడీ పార్టీలో పనిచేసే రబ్బాని తీసుకెళ్తాడని ఆ వ్యాపారి చెప్పాడు. అతను డ్యూటీ విషయంలో ఎలా వేధిస్తున్నాడు. అక్రమ కిరోసిన్‌ దందా వద్ద నెలసరి మాముళ్లు ఎలా వస్తున్నాయో వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశాడు.

రాత్రికి రాత్రే ఎస్పీ నుంచి పిలుపు..

సామాజిక మాధ్యమాల్లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అవినీతి బాగోతం వీడియో, ఆడియోలు పోలీస్‌శాఖ సామాజిక మాధ్యమ గ్రూప్‌లో  సైతం హల్‌చల్‌ చేశాయి. దీంతో స్పందించిన జిల్లా పోçలీస్‌బాస్‌ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్, కానిస్టేబుల్‌ రాజ్‌కుమార్‌లకు తన కార్యాలయానికి రాత్రికి రాత్రే పిలిపించి వివరాలు సేకరించినట్లు విశ్వసనీ యంగా తెలిసింది.నెలవారీ మామూళ్లు ఇలా..పట్టణ శివారు ప్రాంతాలతో ముడిపడి ఉన్న టూటౌన్‌ పోలీన్‌ స్టేషన్‌ అధికారులకు నెలవారీ మామూళ్లకు కొదవలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పట్టణంలో గుట్కా, ఖైనీ ఉత్పత్తుల తయారీ, అక్రమ రవాణ జరిపే వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అశోక్‌నగర్‌కు చెందిన ఒక గుట్కా వ్యాపారి నుంచి ప్రతినెలా మాముళ్లు అందుతున్నట్లు విమర్శలున్నాయి. నెలవారీ మామూళ్లను ముట్టజెప్పని సమయంలోనో, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు పెరిగిన రోజుల్లోనో నామమాత్రంగా దాడిచేసి గుట్కా వ్యాపారులను పట్టుకోవడం, కేసులు పెట్టడం.. ఆ తరువాత యథేచ్ఛగా దందా కొనసాగేట్లు సహకరించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు పోలీసులు ఎదుర్కొంటున్నారు.

తడకమళ్ల, వేములపల్లి మండలాలనుంచి అనుమతుల పేరుతో రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణ జరిపే ట్రాక్టర్ల యజమానులతో సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఒప్పందం చేసుకున్న ట్రాక్టర్లను పట్టణంలోకి అనుమతిస్తూ రాత్రి 10గంటల వరకు అంటే ఇసుక అన్‌లోడ్‌ చేసే వరకు బీట్‌ డ్యూటీలు వేయకుండా సిబ్బందిని స్టేషన్‌కు పరిమితం చేసి వారికి సహకరిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇదే తరహాలో పీడీఎస్‌ బియ్యం, కిరోసిన్‌ అక్రమ రవాణాకు నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది.  ఇప్పుడు బయటపడిన ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందోనని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ప్రమాద ట్రాక్టర్‌ మార్చిన..ఆడియో హల్‌చల్‌

పై విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది సేపటికే గత నెల ఏడుకోట్ల తండా వద్ద జరిగిన ట్రాక్టర్‌ ప్రమాదం కేసులో ప్రమాదం చేసిన ట్రాక్టర్‌ స్థానంలో మరో ట్రాక్టర్‌ మార్చి వారి వద్ద సీఐ సాయి ఈశ్వర్‌గౌడ్‌ రూ.లక్ష తీసుకున్నట్లు సాక్షాలున్నాయి. దీనికి సంబంధించి టూటౌన్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న వన్‌స్టార్‌ అధికారి కీలకపాత్ర పోషించి రూ.లక్ష వసూలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఆడియో కూ డా సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ అయింది.  దీం తో సీఐ అవినీతి ఏ విధంగా సాగిందో వీడియో, ఆడియో టేపుల ద్వారా బయటికొచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement