నూకరాజు, గీత కుటుంబం
ఆమె వందలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపే గురువు. కానీ ఆ మాతృమూర్తికి ఏ కష్టమొచ్చిందోగానీ మూడేళ్ల బాబుతో పాటు పొత్తిళ్లలో చిన్నారిని వదిలి శాశ్వతంగా వెళ్లిపోవాలనుకుంది. పేగుబంధాన్ని తెంచుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఏడిస్తే పరుగు పరుగున వచ్చి అక్కున చేర్చుకోవాల్సిన తల్లి.. విగతజీవిలా ఎందుకు పడి ఉందో తెలియని పరిస్థితి ఆ చిన్నారులది. ఈ సంఘటన చూసిన వారి కళ్లు చెమరుస్తున్నాయి.
సోంపేట: కుటుంబ కలహాలతో మానసికంగా కుంగిపోయిన కాంట్రాక్టు లెక్చరర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా తెర్లాం గ్రామానికి చెందిన తెర్ల నూకరాజుతో, అదే జిల్లా చౌదంటివలస గ్రామానికి చెందిన గేదెల సింహాచలం (గీత)తో 2012, మార్చి9న వివాహం జరిగింది. నూకరాజు ఏపీజీవీబీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా, గీత ప్రభుత్వ కళాశాలలో ఒప్పంద అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. 2016లో విజయనగరం నుంచి బొరివంక ఏపీజీవీబీ బ్రాంచికి నూకరాజుకు బదిలీ అయింది.
గీత కూడా అదే సంవత్సరం విజయనగరం నుంచి సోంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకురాలిగా బదీలీపై వచ్చారు. వీరు ఏడు నెలల క్రితం రాజా పంతుల కాలనీలోని ఇంట్లో అద్దెకు దిగారు. వీరికి మూడేళ్ల బాబు చేతన్‌తో పాటు ఐదు నెలల పాప హయాతి ఉన్నారు. వివాహం అయిననాటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో గీత కుంగిపోయి శుక్రవారం ఉదయం బెడ్‌రూమ్‌లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విగత జీవి పడి ఉన్న తమ కుమార్తెను చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 24 నుంచి ఆమె ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్‌కు వెళ్లాల్సి ఉంది.
మూడు రోజులుగా గొడవలు
శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఇంటి ఓనర్ వద్దకు వెళ్లిన నూకరాజు.. తన భార్య ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. వాళ్లు వచ్చేసరికి ఆమె మెయిన్‌హాల్‌లో కింద పడి ఉంది. దీనిపై నూకరాజును విచారించగా.. తాను బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చే సరికి గీత చీరతో ఉరివేసుకుని ఉందన్నారు. వెంటనే చీర కోసి రక్షించే ప్రయత్నం చేశానని, దుస్తులు మార్చి ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి కిందకు దించానని పోలీసులు, ఇంటి యజమానికి వివరించారు.కాగా, మూడు రోజులుగా నూకరాజు, గీత మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. మూడు రోజులుగా బ్యాంకు బ్రాంచిలోనూ నూకరాజు ముభావంగా ఉండేవాడని, భోజనం కూడా సరిగ్గా చేయక పోయేవాడని బ్యాంకు సిబ్బంది వివరిస్తున్నారు. నూకరాజుకు స్వగ్రామంలో కొందరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గృహహింస, అధిక కట్నం వేధింపులతోనే..
నూకరాజు తనను చాలాకాలం నుంచి అధిక కట్నం కోసం వేధిస్తున్నాడని తరుచూ గీత చెబుతుండేదని తండ్రి సత్యనారాయణ తెలిపారు. వీటితో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సోంపేట ఎస్.ఐ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేశారు. íసీఐ సన్యాసినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment