సాక్షి, సీతమ్మధార(విశాఖపట్టణం) : ఇసుకతోట జంక్షన్ రామాలయం వద్ద మంగళవారం రాత్రి ఓ యువతి మంటలతో పరుగులు తీసిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో నిందితుడు చెన్నా నరేంద్రను పోలీసులు విజయనగరంలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ వై.వి.నాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎన్‌ఏడీ జంక్షన్‌కి చెందిన చెన్నా నరేంద్ర అంబులెన్స్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏఎన్‌ఏంగా విధులు నిర్వహిస్తున్న కావ్య తన సోదరితో ఇసుకతోట జంక్షన్ రామాలయం వద్ద ఉంటోంది. నరేంద్రకు ఏడాది క్రితం కావ్యతో పరిచయం ఏర్పడగా.. వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది.
తనను పెళ్లి చేసుకోవాలని కావ్య పలుమార్లు ఒత్తిడి చేయగా నరేంద్ర ముఖం చాటేశాడు. మంగళవారం రాత్రి కావ్య తాను ఇసుకతోట జంక్షన్‌లో ఉన్నాను.. వెంటనే రావాలని నరేంద్రకు ఫోన్ చేసింది. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. వెంటనే నరేంద్ర అక్కడకు చేరుకోగా కొద్దిసేపు వారు మాట్లాడుకున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని కావ్య కోరగా అందుకు అతడు నిరాకరించాడు. అప్పటికే ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఉన్న కావ్య నిప్పంటించుకుంది. మంటలు వ్యాపించడంతో నరేంద్ర ఆపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి చేతులు కూడా కాలిపోయాయి. భయాందోళన చెందిన అతడు అక్కడ నుంచి విజయనగరం పారిపోయాడని ఏసీపీ తెలిపారు. తీవ్ర గాయాలపాలైన కావ్యను 108లో కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతోంది.
కాల్ డేటా ఆధారంగా..
ద్వారకాజోన్ ఏసీపీ వై.వి.నాయుడు నేతృత్వంలో పోలీసు సిబ్బంది దర్యాప్తు ముమ్మరం చేశారు. కావ్య పనిచేస్తున్న ఆసుపత్రిలోను, తన అక్కను విచారించి కొంత సమాచారం సేకరించారు. మంగళవారం రాత్రి 8.20 గంటల సమయంలో కావ్యను ఆసుపత్రి నుంచి బైక్‌పై తీసుకెళ్లి ఆర్కే బీచ్‌లో దించినట్లు అక్కడ పనిచేస్తున్న యువకుడు తెలిపాడు. తరువాత ఆమె బస్సులో వెళ్లినట్లు తెలపడంతో పోలీసులు దర్యాప్తు మరింత ముందుకు సాగింది. ఆసుపత్రిలోని సీసీ కెమెరాలో వీడియో ఫుటేజ్‌లను పరిశీలించారు. ఆమె ఫోన్ కాల్స్ డేటాను పరిశీలించారు. చెన్నా నరేంద్రతో చాటింగ్ చేసినట్లు తేలింది. నరేంద్ర విజయనగరంలో ఉన్నట్లు కాల్ డేటా ద్వారా తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment