ర్యాగింగ్‌ చేస్తే వేటు పడుద్ది | Counselling On Ragging in NIT | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌ చేస్తే వేటు పడుద్ది

Published Sat, Feb 24 2018 1:01 PM | Last Updated on Sat, Feb 24 2018 1:01 PM

Counselling On Ragging in NIT - Sakshi

నిట్‌ విద్యార్థులు (ఫైల్‌)

పశ్చిమగోదావరి , తాడేపల్లిగూడెం: ఉన్నత విద్యాసంస్థలలో ర్యాగింగ్‌ జాడ్యం జడలు విప్పి కరాళ నృత్యం చేస్తోంది. విద్యార్థుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. నిట్‌లో జరిగిన ర్యాగింగ్‌ ఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఒక జూనియర్‌ విద్యార్థి ధరించిన దుస్తులపై సీనియర్‌ చేసిన కామెంట్‌ ఘర్షణకు దారితీసింది. విషయం కాస్తా ఢిల్లీలోని యాంటీ ర్యాగింగ్‌ సెల్‌కు వెళ్లింది. రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి దృష్టికి చేరింది. క్షేత్రస్థాయి దర్యాప్తు అనంతరం 15 మంది విద్యార్థులపై తీసుకున్న చర్యలు వారి భవిష్యత్తుపై పెద్ద మచ్చగా మిగిలిపోనున్నాయి. దేశంలో మొత్తం 31 నిట్‌లు, ఐఐటీలు ఉన్నాయి. ఈ సంస్థలలో గతంలో ర్యాగింగ్‌ ఘటనలు జరిగినా, సర్దుబాట్లతో, మహా అయితే రూ.25 వేల అపరాధ రుసుంతో విద్యార్థులు రక్షణాత్మక వలయంలో ఉండేవారు.

అయితే ఏపీ నిట్‌ ఘటనలో ఏకంగా 15 మంది విద్యార్థులకు శిక్ష పడింది. ఒక విద్యార్థిని ఏకంగా కళాశాల నుంచి సస్పెండ్‌ చేశారు. ఐదుగురిని నాలుగు సెమిస్టర్ల పాటు రెండేళ్లు కళాశాల ప్రవేశాన్ని రద్దు చేశారు. తొమ్మిదిమందికి హాస్టల్‌ ప్రవేశాన్ని నిషేధించారు. దేశంలో హిమాచల్‌ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో ర్యాగింగ్‌ నేపథ్యంగా సాగిన ఘటనలతో సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ వర్సెస్‌ కౌన్సిల్‌ ప్రిన్సిపల్స్‌... కాలేజెస్‌ కేరళ వర్సెస్‌ అండ్‌ అదర్స్‌ కేసులో ఆర్‌.కె.రాఘవన్‌ కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ర్యాగింగ్‌ చట్టాల పదును పెంచారు. ర్యాగింగ్‌ నిరోధంపై విశ్వ జాగృతి మిషన్‌ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో ర్యాగింగ్‌ను కట్టడి చేయడానికి కొత్త చట్టాలు, సెక్షన్లు వచ్చాయి.

దేనిని ర్యాగింగ్‌గా పరిగణిస్తారంటే..
సైకలాజికల్, సోషల్, పొలిటికల్, ఎకనమిక్, కల్చరల్, అకడమిక్‌ డైమెన్షన్‌లో ఏ రూపంలోనైనా ఇబ్బంది పెట్టడాన్ని ర్యాగింగ్‌గా పరిగణిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రిగా కపిల్‌ సిబాల్‌ ఉన్న సమయంలో ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థల ఆధ్వర్యంలో యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ పర్యవేక్షణలో ర్యాగింగ్‌ బాధితులకు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఢిల్లీలో యాంటీ ర్యాగింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. 1800–180–5522 నంబరుకు ఫోన్‌ చేసి ర్యాగింగ్‌ జరిగిన విషయాన్ని బా«ధితుడు తెలియచేస్తే, అందుబాటులో ఉన్న ఉద్యోగి వివరాలు నమోదు చేసుకొని బాధితునికి ఒక యూనిక్‌ నంబర్‌ కేటాయిస్తారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో యాక్షన్‌ ప్రారంభమౌతుంది. పోలీసులు, ఉన్నత విద్యాసంస్థల అధికారులు ఎప్పటికప్పుడు విషయాలను యాంటీ ర్యాగింగ్‌ సెల్‌కు తెలపాలి. ఫిర్యాదు చేరింది మొదలు తొలి కాల్‌ వెళ్లేది ఘటన జరిగిన రాష్ట్రానికి చెందిన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుకు.

ఐపీసీ సెక్షన్లు పనిచేయవు
ర్యాగింగ్‌ ఘటనలో బాధ్యులకు శిక్షలు వేయడానికి ఐపీసీ సెక్షన్లు పనికిరావు. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం ఆ ఆదేశాలలోని సెక్షన్‌ 48 ప్రకారం శిక్షలు, చర్యలు ఉంటాయి. ఘటన జరిగిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావాల్సిందే. కళాశాల నుంచి పంపించి వేసి ప్రవేశాన్ని రద్దు చేయడం, ఒకటి నుంచి నాలుగు సెమిస్టర్లు సస్పెండ్‌ చేయడం, హాస్టళ్ల నుంచి బహిష్కరించడం వంటì చర్యలు ఉంటాయి.

యాంటీ ర్యాగింగ్‌ యాక్టు
ర్యాగింగ్‌ను క్రిమినల్‌ అఫెన్సుగా గుర్తించిన ప్రభుత్వం యుజీసీ యాక్టులోని సెక్షన్‌ 3 ఆఫ్‌ 1956 లోని సెక్షన్‌–26 ను అనుసరించి యాంటీ ర్యాగింగ్‌ సెంట్రల్‌ యాక్టును 2009 జులై నాలుగో తేదీన తీసుకువచ్చింది. ఈ చట్టం 2009 అక్టోబరు 21వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ర్యాగింగ్‌ ఘటనల తీవ్రత ఆధారంగా సెంట్రల్‌ యాక్టు పురుడుపోసుకుంది. ర్యాగింగ్‌ బాధితులకు సాంత్వన కోసం పోరు సాగించడానికి యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు, స్క్వాడ్‌లను ఉన్నత విద్యాసంస్థలలో ఏర్పాటు చేశారు.

ఏపీ నిట్‌లో ర్యాగింగ్‌పై అవగాహన
ఏపీ నిట్‌లో ర్యాగింగ్‌ దుష్ఫలితాలు వివరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ర్యాగింగ్‌లోకి వెళితే విద్యార్థుల జీవితాలు ఎలా తలకిందులవుతాయో వివరిస్తున్నాం. సైక్రియాటిస్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, అనుభవజ్ఞులతో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశాం. విద్యార్థులకు ల్యాబ్‌లు, పరీక్షలు లేని సమయంలో ర్యాగింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రాంగణంలో యాంటీ ర్యాగింగ్‌ బోర్డులు ఏర్పాటు చేశాం. – ఎస్‌.శ్రీనివాసరావు, నిట్‌ రెసిడెంటు కోఆర్డినేటర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement