బెట్టింగ్‌కు ఉపయోగించే వివిధ లైన్ బాక్సులు, ఇతర పరికరాలు
తూర్పుగోదావరి,కాకినాడ క్రైం: జిల్లాలో మూడు చోట్ల దాడులు నిర్వహించి బెట్టింగ్‌కి పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.11.26 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన బెట్టింగ్ సామగ్రిని, 180 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ విశాల్‌గున్ని తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ సూర్యనారాయణపురం యాళ్లవారివీధిలో చీకట్ల ఈశ్వరరావు ఇంట్లో డబ్బులతో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు దాడి చేసి ఈశ్వరరావు, అతడికి సహాయకుడిగా ఉన్నా అట్లూరి శివనాగవెంకటేశ్వరరావు అనే వ్యక్తులను పట్టుకున్నట్టు వెల్లడించారు. వీరి నుంచి ఒక లైన్‌బాక్సు, రెండు సెల్‌ఫోన్లు, ఒక డెల్ ల్యాప్‌ట్యాప్, ఒక ప్రింటర్, ఒక సోనీ ఎల్‌ఈడీ టీవీ, బెట్టింగ్‌లో ఉపయోగించిన రూ.1.71 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ విశాల్‌గున్ని వివరించారు.
ఈశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు కాకినాడ సాంబమూర్తినగర్ రెవెన్యూకాలనీ, సాయిబాబాగుడి వీధిలో ఒక ఇంటి వద్ద జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న దండు గోపాలకృష్ణంరాజు అలియాస్ గోపాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతడి నుంచి లైన్ బాక్సు, 20 సెల్‌ఫోన్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్, బెట్టింగులో ఉపయోగించే రూ.9,55,900 నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ విశాల్‌గున్ని వివరించారు. గోపాలకృష్ణంరాజును ప్రశ్నించగా అతడు ఇచ్చిన సమాచారం మేరకు రాజమండ్రిలో బెస్ట్ ప్రెస్ ఎదురుగా గల శ్రీసాయి ఎవెన్స్ అపార్టుమెంట్‌లో ప్లాటు నంబర్ 504లో మూడేళ్ల నుంచి బెట్టింగ్ నడుపుతున్న సికింద్రాబాద్‌కు చెందిన కుప్ప ప్రవీణ్‌కుమార్, భీమవరం చిన అప్పారావుతోటకు చెందిన మేకల కళ్యాణ్, భీమవరం డీఎన్‌ఆర్ కాలేజీ ఎదురుగా ఉంటున్న అడపాల జగదీష్‌ప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన కలిదిండి శివధర్మతేజలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సోలాపూర్, రాజస్థాన్, విశాఖపట్నం తదితర లైన్ల నుంచి వచ్చే నాలుగు లైన్ బాక్సులు, 124 సెల్ ఫోన్లు, ఒక ప్రింటర్, ఒక ల్యాప్‌ట్యాప్, ఎల్‌సీడీ టీవీలను బెట్టింగ్‌లో ఉపయోగిస్తున్న వాటిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ విశాల్‌గున్ని వివరించారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ దాడుల్లో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ విశాల్ గున్ని అభినందించారు. విలేకర్ల సమావేశంలో ఎస్బీ డీఎస్పీ పల్లపురాజు, కాకినాడ డీఎస్పీ రవివర్మలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment