
అందుబాటులోకి వస్తోన్న ఆధునిక టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు అందిపుచ్చుకుంటున్నారు. నగరంలో ప్రతిరోజూ కనిష్టంగా 10 మంది మోసపోతున్నారని పోలీసులే అంగీకరిస్తున్నారు. ‘నయా’ నేరగాళ్లు కంప్యూటర్, సెల్‌ఫోన్ ఆధారంగా చేసుకుని ప్రజలను తేలికగా మాయచేస్తున్నారు. నేరం జరిగినట్టు గుర్తించేలోగా భారీగా నష్టం జరిగిపోతోంది. దీనివల్ల ఎంతోమంది జీవితాలు తల్లకిందులైపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. నేరస్తులను పట్టుకున్నా జరిగిన నష్టం మాత్రం పూడ్చలేనంతగా ఉంటోంది. ఇక నగదు రికవరీ లాంటివి దాదాపు అసాధ్యమే. – సాక్షి, సిటీబ్యూరో
సెల్‌ఫోన్ కెమెరాలు వచ్చాక వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పడింది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా రహస్య జీవితాన్ని చిత్రీకరించి నెట్‌లో పెట్టేస్తున్నారు. ఇలా చేసేవారిలో మాజీ భర్తలు, ప్రియులు ముందుంటున్నారు. గడిచిన వారం రోజుల్లో సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయియించిన బాధితురాళ్ల ఉదంతాలే ఇందుకు నిదర్శనం. ఈ విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎంతటి పరిచయస్తుడైనా అతన్ని వ్యక్తిగత విషలు తెలుసునే అవకాశం ఇవ్వొద్దు.
ఇన్సూరెన్స్‌పై బోనస్ అంటూ..
ఇటీవల ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్, హెర్బల్ సీడ్స్ వ్యాపారం, వడ్డీ లేని రుణాల పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్ పెరిగిపోయాయి. ఆకర్షణీయంగా పలకరించే అవతలివారు మనకు సంబంధించిన కొన్ని విరాలను ముందే చెప్తారు. దీంతో వారు ఆయా బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన వారే అని నమ్మేస్తాం. వల్లోపడిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ప్రారంభించి అందినకాడికి దండుకుంటారు. హెర్బల్ సీడ్స్ వ్యాపారం పేరు చెప్పే వారు ఏకంగా వాటిని విక్రయించే వ్యక్తుల్నీ తామే పరిచయం చేస్తామని, తమ కంపెనీ ద్వారానే కొనిపిస్తామంటూ ఎర వేస్తుంటారు.
కంప్యూటర్ ‘కీ’లాగర్స్..
ప్రస్తుతం అన్ని లావాదేవీలు ఇంటర్‌నెట్, కంప్యూటర్ ద్వారానే చేస్తున్నారు. ఇలా నిర్వహించే లావాదేవీలను తెలుసుకునేందుకు ‘కీ లాగర్స్’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఎవరైనా ఓ కంప్యూటర్‌ను వినియోగించి వెళ్లిపోయాక వారు ఏం టైప్ చేశారో ఈ సాఫ్ట్‌వేర్‌తో తేలిగ్గా తెలుసుకోవచ్చు. నెట్ కేఫ్‌ల్లోని సిస్టమ్స్‌లో వీటిని ఏర్పాటు చేసి చూస్తున్నారు. బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్ కార్డు వివరాలు ఉంటే ఎదుటి వ్యక్తిని నిండా ముంచుతున్నారు.
వైరస్‌తో విచ్చలవిడిగా స్మిష్షింగ్
సెల్‌ఫోన్ కేంద్రంగా ఇటీవల ‘స్మిష్షింగ్’గా పిలిచే వైరస్ పంపిస్తున్నారు. మీరు అత్యంత విలువైన కస్టమర్ అని.. కొన్ని అదనపు సదుపాయాలు అందిస్తున్నామని, దీనికోసం కొంత మొత్తం నెలవారీగా చెల్లించాలని సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) వస్తుంది. సర్వీసులు కావాలంటే ‘ఎస్’, వద్దనుకుంటే ‘నో’ నొక్కి పంపమంటూ అందులో ఉంటుంది. అయితే ఏది నొక్కినా.. సైబర్ నేరగాళ్లు పంపే వైరస్ మీ ఫోన్‌లోకి చేరిపోతుంది. ఇక అప్పటి నుంచి ఫోన్ ద్వారా నిర్వహించే బ్యాంకింగ్, క్రెడిట్‌కార్డ్ లావాదేవీలన్నీ నేరగాళ్లకు చేరిపోతాయి. దీంతో మీ ప్రమేయం లేకుండానే నగదు మాయమైపోతుంది.
ప్రొఫైల్స్‌తో పెనుముప్పు
ఉపాధి అవకాశాలను వెతుక్కునే వారి సౌకర్యార్థం అనేక వెబ్‌సైట్లు ‘ప్రొఫైల్స్’ పేరుతో సదుపాయాలు అందిస్తున్నాయి. ఎవరైనా తవు ఫొటోతో పాటు ఇతర వివరాలనూ ఇందులో పొందుపరచవచ్చు. ఎవరైనా అమ్మాయి ఫొటోలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు దొరికితే కొందరు సైబర్ నేరగాళ్లు ద్వంద్వార్థాలతో ప్రొఫైల్స్‌లో పెట్టేస్తున్నారు. దీంతో సదరు యువతికి వేధింపు ఫోన్‌కాల్స్ తప్పట్లేదు. మరికొన్ని సందర్భాల్లో మార్ఫింగ్ ద్వారా పోర్న్ ఫొటోలకు ఈ యువతులు తలలు పెట్టి పరువు తీస్తున్నారు. అందుకే యువతులు, మహిళలు తమ ఫొటోలు పరాయి వ్యక్తుల చేతిలో పడకుండా జాగ్రత్తపడాలి. ఫొటో స్టూడియోలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి.
ఉచితమని ఆశపడితే అంతే..
కొత్తగా యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ తయారు చేశాం.. పరిశీలను కొద్ది రోజులు ఉచితం.. ఇలాంటి ప్రకటనలు ఇంటర్‌నెట్‌లో ఊరిస్తుంటాయి. ఆశపడి డౌన్‌లోడ్ చేసుకుంటే నిండా మునిగినట్లే. ఇలా ఉచితంగా అందించే వాటి వెనుక ఓ ప్రొగ్రామింగ్ నిబిడీకృతమై ఉంటుంది. దీన్ని ‘ట్రోజన్ హార్స్’ అంటారు. అంటే ఏదైనా సదుపాయాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో నిక్షిప్తమై ఉన్న ప్రొగ్రామింగ్ మన కంప్యూటర్‌లో జరిగే ప్రతి లావాదేవీని సైబర్ నేరగాడికి అందిస్తుంది. ఇలా మన ఆర్థిక వ్యవహారాలు వారికి చేరిపోతున్నాయి.
రింగ్‌తో విష్షింగ్ మొదలు
సాంకేతికంగా ‘విష్షింగ్’గా పిలిచే ప్రక్రియలో నేరం ఫోన్ చేయడంతో ప్రారంభమవుతుంది. రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఫోన్ ఎత్తగానే అవతలి వారు మీ బ్యాంకు, క్రెడిట్‌కార్డ్ కంపెనీ నుంచి చేస్తున్నట్లు మాట్లాడతారు. ప్రస్తుతం ఉన్న సదుపాయాలను మరింతగా పెంచుతున్నామనో, అనివార్య కారణాల వల్ల మీకు అందిస్తున్న సేవల్ని నిలిపి వేయాల్సి వస్తోందనో చెప్పి హడావుడి చేస్తారు. ఆపై మొల్లగా కార్డు/ఖాతా నెంబరు నుంచి అన్ని వివరాలనూ సంగ్రహించేస్తారు. ఈ వివరాలన్నీ కూడా మన సెల్‌ఫోన్‌లో మీటలు నొక్కడం ద్వారానే ఫీడ్ చేయిస్తారు. ఆపై వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) కూడా తీసుకుంటారు. వీటిని వినియోగించి మీ ఖాతాలకు ఖాళీ చేసేస్తారు.
నగరంలో కొన్ని కేసులు ఇలా..
⇒ ఫార్వర్డ్ ట్రేడింగ్‌లో పెట్టుడబడి పెడితే 24 గంటల్లోనే డబ్బు రెట్టింపు అవుతుందంటూ ఫోన్ ద్వారా ఎర వేసి నగరానికి చెందిన మరియదాస్ ఫ్రాన్సిస్ జయరాజ్ నుంచి రూ.11 లక్షలు గుంజారు.
⇒ చాటింగ్ సైట్ ద్వారా ఓ యువతికి పరిచయమైన దుండగుడు ఆమెతో స్నేహంగా మెలిగాడు. ఆపై మార్ఫింగ్ చేసిన ఆమె ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. తీవ్రస్థాయిలో భయపెట్టి ఆమె అర్ధనగ్న చిత్రాలు ఫేస్‌బుక్ ద్వారా పంపేలా చేసుకుని బ్లాక్‌మెయిలింగ్ పెంచాడు.
⇒ సికింద్రాబాద్‌లోని ఎస్డీ రోడ్‌లో నివసించే శ్రీనివాస్ సైబర్ నేరగాళ్ల వేసిన ఈ–మెయిల్ ఉచ్చులో చిక్కుకున్నాడు. అమెరికా కంపెనీకి హెర్బల్ సీడ్స్ సరఫరా చేసే కాంట్రాక్ట్ అంటే ఆసక్తి చూపడంతో వివిధ పేర్లతో ఇతడి నుంచి రూ.8.5 లక్షలు కొట్టేశారు.
⇒ నారాయణగూడ ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మహ్మద్ అబ్దుల్ ఫారూఖ్‌కు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఎలాంటి వడ్డీ లేకుండా, ఏడాది తర్వాత వాయిదాలు చెల్లించేలా రూ.20 లక్షల రుణం ఇస్తామన్నారు. వివిధ రకాల ఫీజుల పేర్లు చెప్పి రూ.62 లక్షలు స్వాహా చేశారు.
⇒ బంజారాహిల్స్‌కు చెందిన విద్యార్థి ఫెరోజ్ ఖాన్‌కు రూ.3.6 కోట్లు లాటరీ వచ్చిందంటూ ఎస్సెమ్మెస్ పంపారు. ఆ నగదు పొందడానికి వివిధ రకాలైన కోడ్స్ చార్జీల పేరు చెప్పి రూ.22 లక్షలు దోచేశారు.
⇒ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ మహిళ చిలకలగూడ వాసికి ఎర వేసింది. తాము కోటీశ్వరులమని, తమ కుమార్తె పేరిట బ్యాంకులో రూ.1.7 కోట్లు ఉన్నాయంటూ నమ్మించింది. స్నేహం నటిస్తూ ఆ నగదు తీసుకోవాలని సూచిస్తూ ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో అతడి ఎనిమిదేళ్ల కష్టార్జితం రూ.76 లక్షలు కాజేసింది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
⇒ క్రెడిట్/ డెబిట్ కార్డులను అందుకున్న వెంటనే దాని వెనుక విధిగా సంతకం చేయాలి. దుకాణ యజమానులు సైతం ఎవరైనా కార్డు ద్వారా లావాదేవీలు జరిపినప్పుడు వారి సంతకాన్ని కార్డుపై ఉన్న దాంతో సరిచూడాలి. దీని వల్ల ఇతరులు ఆ కార్డులను వినియోగించడానికి అవకాశముండదు.
⇒ ప్రతి కార్డుకి వెనుక భాగంలో మూడు అంకెల సీవీవీ (కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ) నెంబర్ ఉంటుంది. దీన్ని గుర్తుంచుకుని, కార్డుపై చెరిపేయాలి.
⇒ మీ కార్డులను స్వైప్ చేయడానికి ఎవరికైనా ఇచ్చినప్పుడు.. మీ దృష్టి ఆ ప్రక్రియపైనే ఉంచండి. దీనివల్ల స్కిమ్మింగ్‌కు అవకాశాలు తక్కువవుతాయి.
⇒ మీ క్రెడిట్ కార్డును చాలా కాలం పాటు వినియోగించకుండా ఉంటే... ఆ విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలిపి దాని అకౌంట్‌ను తాత్కాలికంగా మూసేయండి.
⇒ ఆన్‌లైన్ ద్వారా వ్యవహారాలు సాగించేట్లయితే.. మీరు వినియోగిస్తున్న సైట్ అడ్రస్ (జ్టి్టp://)తో ప్రారంభమైతేనే ముందుకు వెళ్లండి.
⇒ కార్డులను పొగోట్టుకున్న వెంటనే సంబంధిత బ్యాంకుకు సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించండి.
⇒ మీ కార్డు ద్వారా లావాదేవీలు జరిగిన ప్రతిసారీ ఆ సమాచారం ఈ–మెయిల్, ఎస్‌ఎమ్మెస్ ద్వారా మీకు వచ్చేలా చూసుకోండి.
⇒ ఎగ్జిబిషన్లు, సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్‌లో ఏర్పాటు చేసే గిఫ్ట్ కూపన్లు, లక్కీ డిప్స్, వోచర్స్‌కు సంబంధించిన కాగితాల్లో సెల్‌ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీలను గుడ్డిగా రాయకూడదు. ఆ నిర్వాహకులు ఈ విధంగా సేకరించిన డేటాను అనేక నకిలీ సంస్థలకు సైతం విక్రయిస్తున్నాయి.
⇒ మనం ఒక పోటీలోనో, కార్యక్రమంలోనో పాల్గొంటే మాత్రమే బహుమతులు వస్తాయి. అలాంటివి ఏమీ లేకుండా మీరు బహుమతులు గెలుపొందారని, లక్కీ కపుల్స్‌గా ఎంపికయ్యాని వచ్చే ఫోన్లు ఎంత వరకు వాస్తవమో ఆలోచించండి.
⇒ మార్కెటింగ్ సంస్థలు అనేక ఎత్తులను ప్రయోగిస్తాయి. వినియోగదారులను కలిసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నో ఉపయోగాలున్నాయని చెప్తూ.. ఆశ పెడతారు. అయితే సొమ్ము చెల్లించిన తరవాత చేసుకునే అగ్రిమెంట్‌లో మాత్రం వీటి ప్రస్తావని ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏజెంట్లు చెప్పిన విషయాలు, అగ్రిమెంట్‌లో ఉన్న వివరాలు ఒకేలా ఉన్నాయా? అన్నది సరిచూసుకోవాలి.
⇒ ఏదైనా క్లబ్‌లో మెంబర్‌గా చేరే ముందు ఆ సంస్థ గురించి, వారిచ్చే సౌకర్యాలపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలి.
సైబర్ నేరాలు ఎన్నెన్ని రూపాలో..
కంప్యూటర్ హ్యాకింగ్, వివిధ రకాల వైరస్‌లను, డిసిమినేషన్, చాట్ రూమ్స్‌ను ఆధారంగా చేసుకుని చేసే ఇంటర్‌నెట్ రిలే చాట్ (ఐఆర్‌సీ) క్రైమ్, లాటరీలు వచ్చాయంటూ, వ్యాపార భాగస్వాములుగా మారతామంటూ నిండా ముంచే నైజీరియన్ ఫ్రాడ్స్, ఆర్కూట్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా మోసాలు చేసే సోషల్ ఇంజినీరింగ్, సైబర్ స్టాకర్‌గా పిలిచే ఆన్‌లైన్ ద్వారా వేధింపులు.. సైబర్ నేరాలే. ఇవన్నీ ఇటీవల పెరిగిపోతున్నాయి. వీటికంటే ‘అకౌంట్ టేకోవర్’ అనే నేరం వేగంగా విస్తరిస్తోందని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. అంతేగాక ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ‘సెల్‌ఫోన్ల’నూ వదదలదం లేదు.
Comments
Please login to add a commentAdd a comment