మిథున్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బ్యాంకుల్లో పని చేస్తున్న అధికారుల మాదిరిగా ఫోన్లు చేసి వ్యక్తిగత సమాచారంతో పాటు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) సైతం సంగ్రహించి అందినకాడికి దోచుకునే ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఇవి ఉత్తరాదిలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలే కాదు... చివరకు అడవుల్నీ అడ్డాగా చేసుకుని తమ దందా కొనసాగిస్తున్నాయి. జార్ఖండ్‌లోని నిర్షా అడవుల కేంద్రంగా ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. శనివారం వీరికి చిక్కిన ఓ ముఠా సభ్యుడు తాము హైదరాబాద్‌కు చెందిన వారినీ ముంచినట్లు వెల్లడించాడు. దీంతో ఈ విషయంపై ఇక్కడి పోలీసులను సంప్రదించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు.
డార్క్ నెట్ నుంచి నెంబర్లు...
జార్ఖండ్‌కు చెందిన ముఖేష్ ప్రసాద్ నేతృత్వంలో అజయ్ శర్మ, మిథున్‌కుమార్ ఓ ముఠాగా ఏర్ప డ్డారు. బోగస్ చిరునామాలు, ధ్రువీకరణలతో వివిధ సిమ్‌కార్డులు తీసుకున్నారు. వీటి ఆధారంగా దేశ వ్యాప్తంగా ‘ఓటీపీ క్రైమ్స్’చేయడం మొదలెట్టారు. అయితే జనం మధ్యలో ఉండి ఈ వ్యవహారం నడిపితే బయటకు పొక్కుతుందని భావించారో ఏమో... నిర్షా ప్రాంతంలో ఉన్న చిట్టడవిని తమ అడ్డాగా మార్చు కున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందే ఏరియాలో కొందరు టెలీకాలర్స్‌ను ఏర్పాటు చేసుకుని పని ప్రారంభించారు. ఇంటర్‌నెట్ ప్రపంచంలో అథోజ గత్తుగా పిలిచే డార్క్ నెట్ నుంచి ప్రసాద్ వివిధ బ్యాంకులకు చెందిన వినియోగదారుల ఫోన్ నెంబర్లు ఖరీదు చేశాడు. ఆయా ఖాతాదారులకు ఫోన్లు చేసే ఈ కాలర్స్ బ్యాంకు అధికారులు, ఎగ్జిక్యూటివ్స్‌గా పరిచయం చేసుకుంటారు.
ఒక్కొక్కరు డజను ఈ–వాలెట్స్...
ఇలా చేయడానికి ముందే ఈ ముగ్గురు సూత్రధా రులు బోగస్ వివరాలతో ఒక్కొక్కరు దాదాపు డజను వరకు ఈ–వాలెట్ అకౌంట్లు తెరిచారు. తమ టెలీకాలర్లు వాడుతున్న ఫోన్ నెంబర్లను ట్రూ కాలర్ యాప్‌లో ఆయా బ్యాంకులకు చెందిన హెడ్– ఆఫీస్‌లు అంటూ సేవ్ చేశారు. ఓ బ్యాంకు ఖాతాదా రుడికి ఫోన్ చేయడానికి ఆ బ్యాంకు పేరుతో సేవ్ చేసిన సిమ్‌కార్డునే వినియోగించేవారు. ఈ ఫోన్లు అందుకున్న వారికి ఆధార్ లింకేజ్ అని, వివరాలు అప్‌డేట్ అని, సాంకేతిక కారణాలతో ఖాతా ఫ్రీజ్ అవుతోందని చెప్పి భయపెట్టేవాళ్లు. ఇలా తమ దారి కి వచ్చిన ఖాతాదారుడి నుంచి వ్యక్తిగత వివరాలతో పాటు ఓటీపీని సంగ్రహించేవారు. ఆ వెంటనే ఈ వివరాలు వినియోగించి అతడి ఖాతాలోని డబ్బును తమ ఈ–వాలెట్స్‌లోకి మళ్లించి కాజేసేవారు. రోజు కో సిమ్‌కార్డు మార్చేసే వీరిని మళ్లీ సంప్రదించాలని బాధితుడు యత్నించినా ఫలితం ఉండేది కాదు.
రెండేళ్లుగా వేటాడిన ఢిల్లీ కాప్స్...
ఈ గ్యాంగ్ 2017లో ఢిల్లీకి చెందిన సీబీఎస్‌ఈ రిటైర్డ్ అధికారి సుభీర్‌సింగ్‌ను టార్గెట్ చేసింది. అతడికి ఫోన్ చేయించిన ఈ కేటుగాళ్లు బ్యాంకు ఖాతా క్లోజ్ అయిపోతోంది అంటూ భయపెట్టారు. ఆయన నుంచి ఓటీపీ సహా ఇతర సమాచారం సంగ్రహించి ఆయన ఖాతాలోని రూ.2 లక్షలు స్వాహా చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.సాంకేతిక ఆధారాలను బట్టి ఆ నగదు కొన్ని ఈ–వాలెట్స్‌లోకి బదిలీ అయినట్లు గుర్తించి ఆరా తీశారు. ఎట్టకేలకు జార్ఖండ్‌కు చెందిన ప్రసాద్, మిథున్, అజయ్ సూత్రధారులుగా గుర్తించారు. వీరిని పట్టుకోవడానికి ఆ ప్రాంతానికి ప్రత్యేక బృందాన్ని పంపినా వీరు చిక్కలేదు. దీంతో అప్పటి నుంచి వీరి కదలికలపై కన్నేసి ఉంచిన ఢిల్లీ పోలీసులు శనివారం మిథున్ అక్కడకు వచ్చిన విషయం తెలుసుకుని పట్టుకున్నారు.
విచారణలో హైదరాబాద్ వివరాలు...
మిథున్‌ను విచారించిన పోలీసులు స్కామ్ మొత్తానికి ప్రసాద్ సూత్రధారిగా తేల్చారు. దీంతో అతడితో పాటు అజయ్ కోసమూ గాలిస్తున్నారు. ఈ పంథాలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన వారికీ టోకరా వేశామని మిథున్ బయటపెట్టాడు. అయితే నగరంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ... ఇలా 3 కమిషనరేట్లు ఉన్నాయి. ఈ గ్యాంగ్ చేతిలో మోసపోయిన వారు ఏ కమిషనరేట్ పరిధికి చెందిన వారో స్పష్టంగా తెలియట్లేదని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. దీంతో 3 కమిషనరేట్లకు చెందిన సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మిథున్‌ను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాతే ఇక్కడి పోలీసులకు అధికారిక సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment