హెల్ప్‌లైన్స్‌ పేరుతో బ్యాంకు ఖాతాలు కాళీ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు | Cyber ​​criminals Entering into Google with Fake helpline numbers - Sakshi
Sakshi News home page

కాల్‌ నాగులు

Published Mon, Jan 6 2020 10:53 AM | Last Updated on Mon, Jan 6 2020 11:41 AM

Cyber Criminals Fake customer care Number Entry in Google - Sakshi

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో నివసించే ఓ వ్యక్తి ఇటీవల జోమాటో యాప్‌ ద్వారా రూ.200 వెచ్చించి స్వీట్లు ఆర్డర్‌ చేశాడు. డెలివరీ అయిన తర్వాత పరిశీలిస్తే అవి వాసన వస్తున్నట్లు గుర్తించాడు. దీంతో జోమాటో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసిన అతడికి‘9330017233’ కనిపించింది. దానికి కాల్‌ చేసిన ఆయన విషయం చెప్పగా... స్పందించిన అవతలి వ్యక్తి మీరు చెల్లించిన నగదు తిరిగి ఇచ్చేస్తామని, బ్యాంకు ఖాతా వివరాలతో పాటు యూపీఐ పిన్‌ పంపాలని కోరాడు. బాధితుడు అలాగే చేయగా ఆయన ఖాతాలో ఉన్న రూ.70 వేలు నేరగాళ్ల పాలయ్యాయి. తాను మోసపోయినట్లు గుర్తించినబాధితుడు చివరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

సాక్షి, సిటీబ్యూరో: ప్రజలకు టోకరా వేయడానికి సమయం, సందర్భాన్ని బట్టి ఒక్కో పంథాను అనుసరించే సైబర్‌ నేరగాళ్లు ఇటీవలి కాలంలో ఈ తరహాలో టోకరా వేస్తున్నట్లు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్తున్నారు. ఈ అంతరాష్ట్ర నేరగాళ్లు ఏకంగా గూగుల్‌లోకే చొచ్చుకుపోయి బురిడీ కొట్టించే ఈ క్రైమ్‌ ఎలా సాగుతుందో వివరించారు. గత కొద్ది రోజులు గా ఇలాంటి ఫిర్యాదులు పెరిగాయని, వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

తప్పుడు వివరాలతో ఫోన్‌ నంబర్లు...  
ఇవే కాదు... ఎలాంటి మోసాలు చేయాలన్నా సైబర్‌ నేరగాళ్లకు ప్రాథమికంగా సిమ్‌కార్డులు అవసరం. వీటిని నకిలీ పేర్లు, చిరునామాలతో తీసుకుంటున్నారు. బోగస్‌ వివరాలతో కొన్ని యాప్స్, బ్యాంకు ఖాతాలు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు బ్యాంకు ఖాతాలకు బదులుగా మనీమ్యూల్స్‌గా పిలిచే దళారులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మెట్రోనగరాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన యవతకు కమీషన్‌ ఆశ చూపి తమ వైపు తిప్పుకుంటున్నారు. వీరికి చెందని మనీ ట్రాన్స్‌ఫర్‌ యాప్స్, బ్యాంక్‌ ఖాతాలను తమకు అనుకూలంగా వాడుకుంటూ ఐదు శాతం చొప్పున కమీషన్‌ ఇస్తున్నారు.

ఉనికి బయపటడకుండా...
ఈ సైబర్‌ నేరగాళ్లు ఎక్కడా తమ ఉనికి బయటపకుండా ఉండేలా కొన్ని మెయిల్‌ ఐడీలు సృష్టిస్తున్నారు. వీటిని వినియోగించి గూగుల్‌లోకి ఎంటర్‌ అవుతున్న కేటుగాళ్లు అందులో రిజిస్టర్‌ చేసుకోవడం ద్వారా తమ నంబర్లను ఆయా సంస్థలతో పాటు బ్యాంకులకు చెందిన కాల్‌ సెంటర్లవిగా పేర్కొంటూ పొందుపరుస్తున్నారు. ట్రూ కాలర్‌లో సైతం వీటిని ఆ తరహా పేర్లతోనే రిజిస్టర్‌ చేసుకున్నారు. గూగుల్‌ సెర్చ్‌లో పొందుపరిచిన వాటిలో వేటికి వ్యూస్‌ ఎక్కువగా ఉంటే అది పై భాగానికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సదరు సైబర్‌ నేరగాళ్లు ఈ నకిలీ కాల్‌ సెంటర్ల నంబర్లకు వ్యూస్‌ పెరిగేందుకుగాను థర్డ్‌ పార్టీ గేమ్‌ యాప్స్‌ను వాడుతున్నారు. ఈ గేముల్లో అంతర్గతంగా నకిలీ కాల్‌ సెంటర్‌కు చెందిన నంబర్‌ లింకు ఉండేలా చేస్తున్నారు. దీంతో ఆయా గేమ్స్‌ ఆడే వారు ఎన్నిసార్లు స్క్రీన్‌పై టచ్‌ చేస్తే అన్నిసార్లు ఆ నెంబర్‌ లింకు అంతర్గతంగా ఓపెన్‌ అయి అది వ్యూగా మారిపోతుంది. కొన్నిసార్లు పాప్‌అప్‌ యాడ్స్‌ వాడుతున్నారు. ఇలా ఆయా నంబర్లకు వ్యూస్‌ పెరిగేలా చేసి సెర్చ్‌లో పైకి తీసుకువస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత ఎవరైనా ఖాతాదారుడు ఓ సంస్థ, బ్యాంక్‌నకు సంబంధించిన కాల్‌ సెంటర్‌ కోసం సెర్చ్‌ చేస్తే ఈ నేరగాళ్లు పొందుపరిచినవే ముందు కనిపిస్తుంటాయి. 

పరిష్కారం పేరుతో ఎంపిన్‌ పంపిస్తూ...
ఇలా కనిపించిన ‘కాల్‌ సెంటర్‌’ నెంబర్‌కు ఖాతాదారుడు కాల్‌ చేసిన వెంటనే అది సదరు సైబర్‌ నేరగాడికి చేరిపోతుంది. తాను ఆ సంస్థకు లేదా బ్యాంక్‌నకు చెందిన అధికారినంటూ మాట్లాడే అతగాడు డబ్బు తిరిగి రావాలంటే తాము మరో నంబర్‌ నుంచి ఎస్సెమ్మెస్‌ పంపుతామని, దానిని మళ్లీ అదే నెంబర్‌కు సెండ్‌ చేయాలని సూచిస్తుంటారు. ఎవరైనా సరే తమ బ్యాంకు ఖాతాలను నగదు లావాదేవీలు జరిపే వివిధ రకాలైన యాప్స్‌కు అనుసంధానం చేయాలంటూ యూపీఐగా పిలిచే యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ కచ్చితంగా ఉండాలి. ఇది కావాలంటే బ్యాంకు ఖాతాతో రిజిస్టర్‌ అయి ఉన్న సెల్‌ఫోన్‌ నుంచి యూపీఏకు సంబంధించిన ఎంపిన్‌ను బ్యాంక్‌నకు సంబంధించిన నంబర్‌కు పంపాల్సి ఉంటుంది. దీన్నే సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

వేరే యాప్స్‌ను అనుసంధానిస్తూ...
తమ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లలోకి అప్పటికే కొన్ని యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఉంచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు ఇలా కాల్‌ వచ్చినప్పుడు ఎంపిన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. దీన్ని తొలుత తమకు కాల్‌ చేసిన ఖాతాదారుడికి వేరే నెంబర్‌ నుంచి పంపిస్తున్నారు. అలా వచ్చిన ఎంపిన్‌ను అదే నంబర్‌కు సెండ్‌ చేయాలని సూచిస్తున్నారు. ఖాతాదారుడు ఇలా చేస్తే తన బ్యాంకు ఖాతాను వారి యాప్‌తో అనుసంధానించడానికి యాక్సస్‌ ఇచ్చినట్లే అవుతుంది. ఆ వెంటనే సదరు నంబర్‌ను వినియోగించి యాప్‌ను యాక్టివేట్‌ చేయడంతో పాటు ఖాతాదారుడి ఖాతా నుంచి నగదు కాజేస్తున్నారు. మరికొన్నిసార్లు నగదు తిరిగి ఇవ్వడానికి బ్యాంకు ఖాతా వివరాలతో పాటు యూపీఐ పిన్‌ తదితరాలు పంపమని కోరి స్వాహా చేస్తున్నారు. ఈ విధానంలో రోజుకు గరిష్టంగా రూ.లక్ష వరకు బదిలీ చేసుకునే అవకాశం ఉండటంతో సైబర్‌ నేరగాళ్లు తమ యాప్స్‌కు లేదా మనీమ్యూల్స్‌ ఖా తాలోకి డబ్బు బదిలీ చేసి స్వాహా చేస్తున్నారు.

ఆ వివరాలు పంపొద్దు
ఇలాంటి సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫోన్‌ చేసిన వారితో బ్యాంకు అధికారి, మేనేజర్‌ అంటూ పరిచయం చేసుకునే వీరిలో అత్యధికులు హిందీలోనే మాట్లాడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యూపీఐ ఎంపిన్‌ను ఎవరి సెల్‌ నెంబర్‌కు పంపకూడదు. మెసేజ్‌ వచ్చినా ఏటీఎం నుంచి డబ్బు రాకుంటే సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించాలి. గూగుల్‌లో చూసి అవి బ్యాంకుల కాల్‌ సెంటర్లు అని నమ్మితే నిండా మునిగినట్లే. అనేక సందర్భాల్లో ఏటీఎం మిషన్‌ నుంచి బయటకు రాని డబ్బులు రెండుమూడు పని దినాల్లో తిరిగి ఖాతాలోకి జమ అవుతూ ఉంటాయి. అపరిచితులు, ఫోన్‌ ద్వారా పరిచయమైన వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోవడం ఉత్తమం.– సైబర్‌ క్రైమ్‌ పోలీసులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement