
సింగరాయకొండ : సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. వీరి ఉచ్చులో అమాయక ప్రజలతో పాటు చదువుకున్న వారు, ఉద్యోగులు చిక్కుకుంటూ తాము బ్యాంకు అకౌంట్‌లో దాచుకున్న డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గతంలో పంచాయతీ కార్యదర్శి ఈ విధంగా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తన బ్యాంకు అకౌంట్‌లోని 7 వేల రూపాయలు పోగొట్టుకోగా ఇప్పుడు తాజాగా తహసీల్దార్ కామేశ్వరరావు వారి ఉచ్చులో చిక్కుకున్నారు. కామేశ్వరరావు కార్యాలయంలో పని ఒత్తిడిలో ఉండగా బుధవారం ఫోన్ వచ్చింది. తాము బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, పేరు, అకౌంట్ నంబర్, పుట్టిన తేదీ చెప్పి తనపై నమ్మకాన్ని ఏర్పరచుకున్న ఆ వ్యక్తి చివరకు ఓటీపీ నంబర్ అడిగాడు.
పని ఒత్తిడిలో ఉన్న కామేశ్వరరావు బ్యాంకుకు చెందిన వ్యక్తి అనే నమ్మకంతో ఓటీపీ నంబరు చెప్పారు. సాయంత్రానికి తహసీల్దార్ సెల్‌కు మెసేజ్ వచ్చింది. జరిగిన పొరపాటు అప్పుడుగానీ తహసీల్దార్‌కు అర్ధం కాలేదు. తెలిసింది. ఫోన్ చేసింది బ్యాంకు సిబ్బంది కాదని, సైబర్ నేరగాడని అర్థమైంది. ఆ మెసేజ్‌లో తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.89 వేలు డ్రా అయినట్లు ఉంది. సదరు నేరగాడు తెలివిగా ఇతని అకౌంట్‌తో పాటు ఫోన్ నంబరును హ్యాక్ చేయడంతో ఎప్పుడు బ్యాంకు లవాదేవీలు జరగినా మొబైల్‌కు మెసేజ్ వస్తుండగా తహసీల్దార్‌కు సాయంత్రానికిగాని మెసేజ్ రాలేదు. వెంటనే సీఐ ఆర్.దేవప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆర్.దేవప్రభాకర్ తెలిపారు. సైబర్ నేరగాడు స్థానికుడు కాదని సీఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment