సాక్షి, సిటీబ్యూరో: మనలో ఎవరికైనా రుణం కావాలంటే బ్యాంకుకో, ఇతర ఫైనాన్స్ సంస్థకో వెళ్తాం. అక్కడి వారు అడిగే సవాలక్ష ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, దరఖాస్తుతో పాటు పదుల సంఖ్యలో పత్రాలు సమర్పిస్తేనే... రుణం మంజూరు అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఇలా మం జూరైనా... ఆ మొత్తాని కంటే ఎక్కువ విలువైందే ష్యూరిటీగా పెట్టాలి. అలాంటిది ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తి ఫోన్ చేసి, ఎలాంటి ష్యూరిటీలు లేకుండా రుణం ఇస్తున్నామనడమే కాదు ఏకంగా మంజూరైనట్లు లేఖలు కూడా పంపించేస్తే... కచ్చితంగా అనుమానించా ల్సిందే. అయితే నగరానికి చెందిన అనేక మంది ఇలాంటి ఫోన్‌కాల్స్‌ను గుడ్డిగా నమ్ముతూ నిలువునా మునిగిపోతున్నారు. శుక్రవారం ఒక్క రోజే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఇద్దరు బాధితులు ఆశ్రయించారు.
రిఫండబుల్ చార్జీలంటూ...
నగరానికి చెందిన శ్రీకాంత్, శ్రీనివాసమూర్తిలకు కొన్ని రోజుల క్రితం ఫోన్లు వచ్చాయి. మొదటి వ్యక్తికి టాటా క్యాపిటల్ ఫైనాన్స్, రెండో ఆయనకు ఎస్‌ఎస్‌సీ ఫైనాన్స్ సంస్థల నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నామని, మీ ప్రొఫైల్ అద్భుతంగా ఉండటంతోనే కాల్స్ చేస్తున్నామంటూ చెప్పారు. ఎలాంటి ష్యూరిటీలు అక్కర్లేకుండా రుణం మంజూరైందంటూ ఎర వేశారు. శ్రీకాంత్‌కు రూ.15 లక్షలు, శ్రీనివాస్‌కు రూ.10 లక్షలు మంజూరు చేస్తూ ఆ లేఖల్ని సైతం ఈ–మెయిల్ రూపంలో పంపేశారు. ఇంత వరకు కథ మామూలుగానే నడిచినా ఇక్కడే టర్న్ తీసుకుంది. రుణం మంజూరు చేసిన తర్వాత మీ బ్యాంకు ఖాతాలో వేయడానికి కొంత ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ మెలికపెట్టారు. అలా ఇచ్చే ప్రాసెసింగ్ ఫీజు కూడా రిఫండబుల్ అని, రుణం మొత్తంతో పాటు మీ బ్యాంకు ఖాతాలోకి వచ్చిపడుతుందంటూ నమ్మించారు. ఈ సైబర్ నేరగాళ్ల వల్లో పడిన వీరు రూ.3 లక్షలు, రూ.70 వేల చొప్పున ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించారు. ఈ మొత్తాలను ఆయా సైబర్ నేరగాళ్ళు చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్/డిపాజిట్ చేశారు. నగదు వెళ్ళిందే తడవుగా వారి సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ క్రైమ్ ఢిల్లీ కేంద్రంగా నడిచినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్తున్న పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
దక్షిణాదివారే టార్గెట్
రుణం మంజూరు చేశామంటూ ఫోన్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. ఢిల్లీ కేంద్రంగా ఈ తరçహా నేరాలకు పాల్పడే ముఠాలు ప్రధానంగా దక్షిణాదినే టార్గెట్‌గా చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోనూ బాధితులు ఎక్కువగా ఉంటున్నారు. ఇక్కడి వారిని మోసం చేస్తే వారు పోలీసులకు ఫిర్యాదు చేసినా అక్కడి వరకు వెళ్లి పట్టుకోవడం అసాధ్యం/కష్టసాధ్యమనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఎవరికి వారు అప్రమత్తంగా ఉండటమే ఈ మోసాలకు విరుగుడు. ఎలాంటి ష్యూరిటీలు లేకుండా అసలు మనం దరఖాస్తే చేయకుండా రుణం మంజూరు కాదని గుర్తుంచుకోవాలి. ఈ మోసగాళ్లకు బాధితుల ఫోన్ నెంబర్లు వివిధ రకాలుగా లభిస్తున్నాయి. ‘షా ప్లస్’ వంటి యాప్స్‌లో తనిఖీ చేయడం ద్వారా ఆ నెంబర్ దక్షిణాదికి చెందిన వ్యక్తిదా? కాదా? అనేది నిర్థారించుకుని మరీ టార్గెట్ చేస్తున్నారు. – కేవీఎంప్రసాద్, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment