సాక్షి, సిటీబ్యూరో: ‘ఒంటరిగా ఫీల్ అవుతున్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. మీ గొంతు వినకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఈ నెంబర్‌కు కాల్ చెయ్యి’ అంటూ ఎస్సెమ్మెస్‘హలో హలో మీరు మాట్లాడుతోంది నాకు వినిపించట్లేదు. నేను చెప్పేది వినిపిస్తోందా? దయచేసి నాకు కాల్ బ్యాక్ చేయండి’ అంటూ మహిళల గొంతుతో హిందీలో ఫోన్‌కాల్స్‌వీటితో పాటు ఉక్రెయిన్, అజార్‌బైజాన్ తదితర దేశాల నంబర్లతో అర్ధరాత్రి వేళల్లో మిస్డ్‌కాల్స్ ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఎవరైనా స్పందించి ఆయా నెంబర్లను సంప్రదిస్తే నిండా మునిగినట్లే. ఫోన్‌కాల్స్ బిల్లు భారీగా వస్తుంది. స్నేహం, ప్రేమ, డేటింగ్ పేరుతో వర్చువల్ నెంబర్లతో వల వేసి నిలువునా ముంచే ‘ప్రీమియం కాల్స్’ బెడద ఇటీవల పెరిగిందని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. యువతులు పేర్లతో బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపడం, ఫోన్లు చేయడం, మిస్డ్ కాల్స్ ఇవ్వడంతో పాటు ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్‌లో దోచుకునే ఈ వ్యవహరంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
వర్చువల్ నంబర్లు ఎంపిక చేసుకుని...
మెట్రో నగరాల్లో ఉంటున్న కొందరు ‘ప్రీమియం గాళ్లు’ తాము టార్గెట్‌గా చేసుకున్న వారికి పంపడానికి వర్చువల్ నంబర్లను వాడుతున్నారు. ఇంటర్‌నెట్‌లోని అనేక వెబ్‌సైట్లు ఈ ఫోన్ నెంబర్లను నిర్ణీత కాలానికి అద్దెకు ఇస్తుంటాయి. ఆయా సైట్లలో ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన, వివిధ సర్వీసు ప్రొవైడర్లు అందించే కొన్ని నంబర్లు డిస్‌ప్లే అవుతుంటాయి. వీటిలో తమకు కావాల్సిన దేశానికి చెందిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకుఆ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నంబర్లు ఇంటర్‌నెట్ కాలింగ్ ద్వారా పని చేస్తాయి. ఇలా వర్చువల్ నంబర్ పొందే వారు వాటిని బల్క్ ఎస్సెమ్మెస్ రూపంలో స్నేహం, ప్రేమ, డేటింగ్ అంటూ సదరు నంబర్‌ను ప్రచారం చేస్తారు. ఇవి ప్రీమియం నంబర్లు కావడంతో అసలు చార్జికి కొన్ని రెట్లు ఎక్కువ పడుతుంది. వివిధ టీవీ ఛానళ్లు నిర్వహించే ఎస్సెమ్మెస్ కాంటెస్ట్‌లు, ఫోన్ కాంటెస్టులకూ ఇలాంటి ప్రీమియం నంబర్లనే వాడతారు. ఎస్‌ఎంఎస్‌కు రూ.5, కాల్‌కు నిమిషానికి రూ.18 వరకు చార్జ్ పడుతుంది. ‘ప్రీమియంగాళ్లు’ వాడేవి ఇంటర్నేషనల్ రూటింగ్ కాల్స్ కావడంతో ఈ చార్జీలు మరింత ఎక్కువగా ఉంటాయి.
ఇంటర్నేషనల్ క్యారియర్లతో ఒప్పందాలు...
వినియోగదారుడు ఏ సర్వీసు ప్రొవైడర్‌కు చెందిన సిమ్ వాడితే బిల్లు వారికే చెల్లిస్తారు. అయితే సదరు సర్వీసు ప్రొవైడర్ ప్రతి కాల్‌కు కొంత మొత్తాన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కాల్ వెళ్లడానికి అవసరమైన శాటిలైట్ స్పేస్‌ను సర్వీసు ప్రొవైడర్ బీఎస్‌ఎన్‌ఎల్ నుంచే అద్దెకు తీసుకోవాలి. ఇలా బీఎస్‌ఎన్‌ఎల్ పరిధి జాతీయ స్థాయిలో మాత్రమే ఉంటుంది. ఇంటర్నేషనల్ కాల్స్‌కు సంబంధించి ఆ సంస్థ కూడా ఇంటర్నేషనల్ క్యారియర్స్‌తో ఒప్పందాలు చేసుకుంటుంది. వీరు దేశం దాటే కాల్స్‌ను ఆయా దేశాలకు ఎన్‌రూట్ చేస్తారు. దీని నిమిత్తం బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ కూడా వారికి నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
‘ప్రీమియం’ ఒప్పందాలు...
బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపే ‘ప్రీమియంగాళ్లు’ ఆ నెంబర్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వెబ్‌సైట్లకు ఇలాంటి ఇంటర్నేషనల్ క్యారియర్లతో ఒప్పందాలు ఉంటాయి. సంక్షిప్త సందేశానికి ఆకర్షితుడై ఎవరైనా ఫోన్ చేస్తే... మాట్లాడటానికి కొందరు యువతులను ఏర్పాటు చేసుకుంటారు. ఈ కాల్స్ అన్నీ ఇంటర్నేషనల్ రూటింగ్ ద్వారా వస్తాయి. వీరు సంభాషణను వీలైనంత పొడిగించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. దీంతో భారీగా పడే ప్రీమియం చార్జీలు ఫోన్ చేసిన వ్యక్తి (బాధితుడి) సర్వీసు ప్రొవైడర్‌కు... అక్కడ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా ఇంటర్నేషనల్ క్యారియర్‌కు చేరతాయి. తన రాబడి పెంచినందుకు ఇంటర్నేషనల్ క్యారియర్ నుంచి కొంత కమిషన్ వెబ్‌సైట్ నిర్వాహకుడిని చేరుతుంది. ఇందుకుగాను ‘ప్రీమియంగాళ్ళ’కు వెబ్‌సైట్ నిర్వాహకులు కమీషన్ చెల్లిస్తారు. ఈ చెల్లింపులు రోజు, వారం, పక్షం, నెలకు ఒకసారి చొప్పున ఉంటాయి. ఇవన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతాయి. ఇలా ఇంటర్నేషనల్ కాల్ ట్రాఫిక్ జనరేషన్ కోసం, ధనార్జన కోసం అమాయకులకు సంక్షిప్త సందేశాలు పంపుతుంటారు.
కట్టడి అంత తేలిక కాదు
ఈ తరహా ప్రీమియం నంబర్ల బాధితులు ఇటీవల పెరుగుతున్నారు. తమకు న్యాయం చేయమంటూ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే వర్చువల్‌గా ఉండే ఈ నెంబర్ల మూలాలు కనుక్కోవడం, కట్టడి చేయడం అత్యంత కష్టసాధ్యం. ఆయా వెబ్‌సైట్లకు సంబంధించిన సర్వర్లు విదేశాల్లో ఉండటమే దీనికి కారణం. వీటి బారినడపకుండా జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం. అపరిచిత నంబర్ల నుంచి స్నేహం, ప్రేమ, డేటింగ్ అంటూ వచ్చే సంక్షిప్త సందేశాలకు స్పందించకూడదు. వినియోగదారుల బలహీనతలే పెట్టుబడిగా ఈ ముఠాలు పని చేస్తుంటాయని మర్చిపోవద్దు.– సైబర్ క్రైమ్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment