సాక్షి, నాయుడుపేట టౌన్: డ్యాన్స్ మాస్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. అయితే మృతదేహాన్ని భద్రపరచడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోస్టుమార్టం గదిలో శవపేటిక మూతను మూయకపోవడంతో ఎలుకలు అతడి ముఖాన్ని కొరికేశాయి. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. పట్టణంలోని సంజయ్‌గాంధీ కాలనీలో నివాసముంటున్న జెడ శ్రీనివాసులు (31) డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తూ జీవన సాగిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున అతను పాత రెవెన్యూ కార్యాలయం సమీపంలో అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసులను స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతి చెందాడు. అందరితో సఖ్యతగా ఉండే తన కుమారుడు శ్రీనివాసులును దారుణంగా కొట్టి చంపేశారని మృతుడి తల్లి భాగ్యమ్మ చెబుతోంది. పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాసులుపై మూకుమ్మడి దాడి చేసినట్లు అక్కడి ఆనవాళ్లను బట్టి గుర్తించారు. మృతుడి బూట్లు తలో దిక్కు పడి ఉండటం, సమీపంలోని జిమ్ వెనుక గోడలకు రక్తపు మరకలు ఉండటాన్ని సైతం గుర్తించారు. శ్రీనివాసులుపై దాడి చేసి పాత తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పడివేయడంతో, రాత్రి సమయంలో ఎవరూ గుర్తించలేకపోయినట్లు బాధితురాలు వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముఖాన్ని కొరికేసిన ఎలుకలు
శ్రీనివాసులు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్య శాల పోస్టుమార్టం గదిలో భద్రపరచగా, అక్కడ సిబ్బంది శీతల శవపేటిక మూత మూయకండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడి ముఖాన్ని ఎలుకలు కొరికేశాయి. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి ఆందోళన చేపట్టారు. సిబ్బందికి చెప్పినా వారు చాలా సేపటి తర్వాత స్పందించి శవపేటికపై మూత వేసినట్లు మృతుడి సోదరుడు అంకయ్య దేవరాజ్ వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment