ఆడ పిల్లలను కన్నదని.. అతి కిరాతకంగా 11 చోట్ల కత్తితో నరికి | Wife Brutally Murdered By His Husband | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కిరాతకుడు 

Published Sat, Nov 2 2019 7:00 AM | Last Updated on Sat, Nov 2 2019 7:07 AM

Wife Brutally Murdered By His Husband - Sakshi

తులసి ,విజయ్‌

అగ్నిసాక్షిగా తాళి కట్టినోడే కిరాతకుడయ్యాడు. పుట్టింటికి వెళ్లి వచ్చిన రాత్రే భార్యను అతి కిరాతకంగా 11 చోట్ల కత్తితో నరికి చంపి, ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తల్లితో సహా లొంగిపోయాడు. ఆడ పిల్లలను కన్నదనే కోపంతో అప్పటి నుంచి అదనపు కట్నం కోసం తల్లితో కలిసి వేధించాడని హతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓ కుమార్తె ప్రమాదవశాత్తు మరణం వెనుక కిరాతుకుడిపై అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు.  రెండో పెళ్లి చేసుకుని భార్యను అడ్డు తొలగించుకునేందుకే ఈ దారుణానికి ఒడిగట్టారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

సాక్షి, కోవూరు: మండలంలోని చుండుగుంటలో శుక్రవారం భర్త చేతిలో భార్య హత్యకు గురైంది. చుండుగుంటకు చెందిన గిద్దలూరు విజయ్‌ కు నెల్లూరు ఉస్మాన్‌సాహెబ్‌పేట రామ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన తులసి (30)తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. భార్య ఆడపిల్లలను కనిందనే కోపంతో తల్లితో కలిసి విజయ్‌ వేధింపులు ప్రారంభించాడని, అదనపు కట్నం తీసుకురావాలని వేధించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ కుమార్తె ప్రమాదవశాత్తు మృతి చెందింది. చిన్నారి మృతి వెనుక విజయ్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తల వివాదంపై అనేక దఫాలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులు కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. అయినా అతనిలో మార్పులో కానరాకపోవడంతో రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. అయితే ఎప్పటికైనా భర్త వద్దకే చేరాలనే ఆలోచనతో గురువారం తన తల్లితో కలిసి చుండుగుంటలోని తన ఇంటికి వచ్చింది. తులసి తల్లి నెల్లూరుకు వెళ్లిన కొద్ది సేపటికి విజయ్‌ తల్లి విజయమ్మ సూటిపోటి మాటలు మాట్లాడింది. తులసి సర్దుకొని లోపలికి వెళ్లి పనిచేసుకుంది. 

బాధిత కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్న సీఐ
పథకం ప్రకారమే హత్య 
పథకం ప్రకారమే తులసిని హత్య చేసినట్లు తెలుస్తోంది. తులసిని ఏదో రకంగా అడ్డు తొలగించుకుని విజయ్‌కు సమీప బంధువుల అమ్మాయితో మరో వివాహం చేయాలని అతని కుటుంబ సభ్యులు కొద్ది కాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే విజయ్‌కు ఇప్పటికే పెళ్లి జరిగి వేరే కాపురం పెట్టినట్లు తెలిసి, తులసి బంధువు విజయ్‌ను మందలించినట్టు చెబుతున్నారు. తిరిగి రాదనుకున్న భార్య మళ్లీ రావడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాత్రి సైతం భార్యాభర్తల మధ్య వాదోపవాదాలు జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాత్రి భోజనాల అనంతరం అందరూ నిద్రపోయారు. తెల్లవారుజామున విజయ్‌ కత్తితో అతి కిరాతకంగా నరికి చంపాడు. తులసి మెడపైన బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మంచంపైనే కుప్పకూలి మృతి చెందింది. అనంతరం విజయ్‌ కూతురు తేజరాజేశ్వరి, విజయ్‌ తల్లి విజయమ్మతో కలిసి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

ఇంట్లో క్షద్రపూజలు  
తులసిని చుండుగుంటకు రాకుండా ఏదో రకంగా అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో విజయ్‌ వాళ్ల ఇంట్లో మూడు గుంతలు తవ్వి అక్కడ క్షుద్రపూజలు చేశారన్న అనుమానాలను కూడా తులసి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆ ఇంట్లోకి తులసి బంధువులు ఎవరు వెళ్లినా అనారోగ్యంతో వెళ్తున్నారని అందులో భాగంగానే తులసికి నిత్యం ఏదో రకంగా పీడకలలు వస్తున్నాయని, ఇంట్లో కొన్ని అరిష్టాలు ఉన్నాయని వాటిని తొలగించడం కోసమే పూజలు చేసినట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. 

సీఐ, తహసీల్దార్ల సమక్షంలో పంచనామా  
తులసి హత్యకు సంబంధించి విషయం తెలుసుకున్న సీఐ జీఎల్‌ శ్రీనివాసరావు, ఎస్సై చింతం కృష్ణారెడ్డి తన సిబ్బందితో కలిసి చుండుగుంటకు చేరుకొన్నారు. అప్పటికే అక్కడ తులసి బంధువులు మృతదేహంపై రోదిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని అటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తులసి బంధువులు కోరారు. ఈ విషయమై సీఐ మాట్లాడుతూ నేరస్తులకు తప్పకుండా శిక్ష ఉంటుందన్నారు. తులసి మృతదేహానికి కోవూరు తహసీల్దార్‌ సీహెచ్‌ సుబ్బయ్య సమక్షంలో పంచనామా చేసి ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement