
సాక్షి, మదనపల్లె టౌన్: పోనుపోను మనుషుల మధ్య సంబంధాలు తీసికట్టుగా మారుతున్నాయి. బంధాలు, ఆప్యాయతలు కనుమరుగవుతున్నా యి. పాశ్చాత్య నాగరికత మోజులో యువత పెడదారి పడుతోంది. తాజాగా శనివారం మదనపల్లె ప్రాంతంలో వెలుగుచూసిన ఘటనను దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పోలీసుల కథనం మేరకు.. పీఅండ్‌టీ కాలనీలో ఉంటున్న ఓ ముస్లిం బాలిక(14) ప్రేమపేరుతో మోసపోయి, గర్భం దాల్చింది. దీపావళి రోజున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. చుట్టుపక్కల వారికి విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని ఆ బిడ్డను మండలంలోని కొండామారిపల్లె పంచాయతీ టీఎన్‌ఆర్ కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి సమీపంలో ముళ్లపొదల్లో పడేసింది. స్థానిక యువకుడు ఆ పసికందును తీసుకొచ్చి తన కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. విషయం షీ–టీమ్ పోలీసులకు తెలియడంతో అక్కడికి చేరుకుని బిడ్డను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆ బిడ్డను ఐసీడీఎస్ సీడీపీవో ఎల్లమకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రిని ఆస్పత్రిలో వదిలేశారు
మదనపల్లె క్రైం : ‘తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దగ్గరుండి సపర్యలు చేయాల్సిన బిడ్డలు బరువు తమకెందుకు అనుకున్నారో ఏమో అర్ధరాత్రి సమయంలో ఆయన్ను తీసుకొచ్చి ఆస్పత్రి వద్ద పడేసి వెళ్లిపోయారు. సిబ్బంది గమనించి అతన్ని క్రానిక్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పట్టణంలోని చంద్రాకాలనీలో ఉం టున్న బత్తల ఆదెప్ప(70) 20 ఏళ్ల క్రితం కురబలకోట మండలం పిచ్చిలవాండ్లపల్లె నుంచి బతుకుదెరువు కోసం వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ భార్య నరసమ్మ, పిల్లలు మోహన్, సరోజ, శ్యామల, శోభను పోషించుకునేవాడు. బిడ్డలందరికీ పెళ్లిళ్లు చేశాడు. వయస్సు మీద పడడంతో కొన్ని రోజులుగా ఆదెప్ప అనారోగ్యం బారినపడ్డాడు. ఈ క్రమంలో ఆస్తి పంపకాల విషయమై బిడ్డలు తండ్రి మీద ఒత్తిడి తెచ్చారు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో ఒకరికొకరు గొడవపడ్డారు. తండ్రిని తీసుకొచ్చి క్రానిక్‌వార్డులో దిక్కులేనివాడిలా పడేసి వెళ్లారు. తిండి పెట్టేవారు లేక రోజురోజుకూ మృత్యువుకు దగ్గరవుతున్నాడు. ఆస్పత్రి సిబ్బంది అతని దీన స్థితి చూడలేక విలేకరులకు సమాచారం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment