ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో తుపాకీతో బెదిరించి 70 లక్షలు దోచుకున్న ఉదంతం మరవకముందే అలాంటి ఘటనే ఇంకొకటి వెలుగుచూసింది. తుపాకీతో బెదిరించి 25 లక్షల విలువైన తల వెంట్రుకల్ని దొంగలు ఎత్తుకెళ్లారు. వివరాలు.. హుస్సేన్ అతని తమ్ముడు తాజుద్దీన్‌తో కలిసి నంగ్‌లోయిలో విగ్గులు తయారు చేసే ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. జూలై 25న ఇదే వ్యాపారంలో ఉన్న అజయ్ కుమార్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంళ్‌సేన్‌ను హుస్సేన్‌కు పరిచయం చేశాడు. అతను పెద్ద ఎత్తున విగ్గులు కొనుగోలు చేస్తాడని చెప్పాడు. వ్యాపారానికి సంబంధించి పలు విషయాలు చర్చించారు.
అనంతరం రెండు రోజులకు హుస్సేన్ ఫ్యాక్టరీలోకి ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి చొరబడ్డారు. హుస్సేన్, తాజుద్దీన్‌లపై దాడి చేసి కాల్చి చంపుతామని బెదిరించారు. 200 కిలోల జుట్టు, 30 వేల నగదు, నాలుగు సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు. హుస్సేన్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో మంగళ్‌సేన్‌ను పట్టుకున్నారు. కుట్రకు సూత్రధారి అయిన అజయ్‌కుమార్‌ను, మరో వ్యక్తిని ఆదివారం అరెస్టు చేశామని డీసీపీ సెజూ పీ కురువిల్లా తెలిపారు. అజయ్ నుంచి 118 కిలోల తలవెంట్రుకల్ని, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తిరుపతి, తమిళనాడులోని కొన్ని పుణ్యక్షేత్రాల నుంచి జుట్టును కొనుగోలు చేస్తామనీ హుస్సేన్ తెలిపారు. ఒక కిలో వెంట్రుకలకు 20 నుంచి 23 వేలు చెల్లిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment