సాక్షి, మహబూబ్‌నగర్ : పశువైద్యురాలు ‘దిశ’ అత్యాచార, హత్య కేసులో ఎన్‌కౌంటర్ అయిన నిందితుల మృతదేహాల విషయమై మూడురోజుల నుంచి పోలీస్‌శాఖలో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 6న తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత నాలుగు మృతదేహాలను అదేరోజు సాయంత్రం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. నిందితుల మృతదేహాలు ఆస్పత్రి గేట్ లోపలికి వచ్చినప్పటి నుంచి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పోస్టుమార్టం నిర్వహణ, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పర్యటన దేనికీ కూడా ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రధానంగా మీడియాను ఆస్పత్రి లోపలికి వెళ్లకుండా, కేసు వివరాలు మీడియాతో ఎవరూ మాట్లాడకుండా జాగ్రత్తపడ్డారు. అయితే శనివారం అర్ధరాత్రి నాలుగు మృతదేహాలను జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం విభాగం నుంచి ఎదిర సమీపంలోని పాలమూరు మెడికల్ కళాశాలకు తరలిస్తున్న సమయంలో వీడియోలు, ఫొటోలు బయటకు రావడం, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ రెండు రోజులపాటు చేసిన శ్రమ మొత్తం వృథా అయిందంటూ పోలీసులు వాపోయారు. శుక్రవారం రాత్రి సైతం పోస్టుమార్టం జరుగుతున్న సమయంలో ఓ ప్రైవేట్ వ్యక్తి లోపలికి ప్రవేశించి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీనిపై అదేరోజు సిబ్బందిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మళ్లీ మృతదేహాల తరలింపు సందర్భంగా వీడియోలు బయటకు రావడంతో ఈ విషయమై పట్టణానికి చెందిన ఇద్దరు సీఐలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
నేడు తరలించే అవకాశం
దిశ అత్యాచార, హత్య కేసులో సోమవారం హైకోర్టు నిర్ణయం వెల్లడించిన తర్వాత నాలుగు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. హైకోర్టు నిర్ణయం వచ్చేసరికి సాయంత్రం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి 8 గంటల తర్వాతనే మృతదేహాలను అక్కడి నుంచి తరలించే విషయమై కదలిక వచ్చేటట్లు కనిపిస్తోంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ పిల్లల మృతదేహాలను ఎప్పుడు అప్పగిస్తారో అంటూ ఎదురుచూస్తున్నారు. శుక్రవారం రాత్రే ఇస్తారనుకున్నా.. కోర్టు జోక్యం చేసుకోవడం, ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు ఉన్నాయని ఎన్‌హెచ్‌ఆర్సీ పర్యటనకు వస్తామని చెప్పడంతో సోమవారం వరకు వాయిదా పడింది.
మెడికల్ కళాశాల ముఖద్వారం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లు
అనాటమీ ల్యాబ్‌లో..
నలుగురు నిందితుల మృతదేహాలను జిల్లా జనరల్ ఆస్పత్రిలో పెట్టడం వల్ల శాంతిభద్రతలకు ఇబ్బందిగా మారుతుందని, ఆస్పత్రికి వచ్చిపోయే రోగులకు సమస్యగా ఉంటుందని భావించిన పోలీసులు శనివారం అర్ధరాత్రి సమయంలో పోస్టుమార్టం విభాగం నుంచి డీసీఎంలో నాలుగు మృతదేహాలను పాలమూరు మెడికల్ కళాశాలకు తరలించారు. కళాశాలలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న అనాటమీ ల్యాబ్‌లో సైంటిఫిక్ మెథడ్ విధానం కలిగిన ఫ్రీజర్‌లో మృతదేహాలను భద్రపరిచారు. వీటిలో పెట్టడం వల్ల మృతదేహాలకు ఎలాంటి సమస్య రాదని, కొన్నిరోజులపాటు భద్రపరిచే సౌకర్యం ఉందని ఓ వైద్యుడు వెల్లడించారు. ఈ ల్యాబ్ లోపలికి ఎవరూ వెళ్లకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు.
అనుమతి లేదు..
పాలమూరు మెడికల్ కళాశాలలో మృతదేహాలు పెట్టడం వల్ల కళాశాల ముఖద్వారం దగ్గరే పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి వచ్చిపోయే వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిబ్బంది లోపలికి వెళ్తున్న వ్యక్తులను తనిఖీలు చేసి పంపారు. క్యాంపస్ ప్రాంగణంలోకి కొత్త వ్యక్తులు లోపలికి వెళ్లడానికి పోలీసులు ఏమాత్రం అనుమతి ఇవ్వడం లేదు. విద్యార్థుల కుటుంబ సభ్యులు, ఇతర కార్మికులు వచ్చినా పంపలేదు. కేవలం కళాశాలలో చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బందిని మాత్రం గుర్తింపు కార్డులు చూసి లోపలికి పంపించారు.
పరిశీలించిన ఏఎస్పీ
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు నిందితుల మృతదేహాలను కళాశాలలో పెట్టడం వల్ల పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇద్దరు సీఐలతోపాటు ముగ్గురు ఎస్‌ఐలు ఇతర కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 30 మందికిపైగా సిబ్బందితో బందోబస్తు కల్పించారు. స్థానిక పరిస్థితిని ఏఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment