
వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న న్యాయమూర్తి
మహబూబ్‌నగర్ క్రైం : జైలులోని ఖైదీలను తక్కువగా చూడరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వెంకటకృష్ణయ్య అన్నారు. వా రికి జీవితానికి సంబంధించిన విలువైన పాఠాలు చెబితే వారు క్రమశిక్షణగా ఉండటంతో పాటు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పా రు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా జైలులో సోమవారం ఖైదీల సంక్షేమ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమానికి న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జైళ్లశాఖ డీజీ వినయ్‌కుమార్‌సింగ్ రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో ఖైదీల సంక్షేమ కోసం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం మంచి విషయమన్నారు.
ఖైదీల సం క్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఆలోచించాలని అధికారులకు సూచించారు. జిల్లా జైలులో ఖైదీల సంక్షేమం కోసం మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఖైదీలకు చదువుతోపాటు క్రమశిక్షణ, యోగా నేర్పించడం ఎంతో మంచిదని అన్నారు. అనంతరం ఖైదీలకు ఎస్‌వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ దశరథరాంరెడ్డి, డీఎస్పీ భాస్కర్, జైలర్స్ శ్రీనునాయక్, డిప్యూటీ జైలర్ సుధాకర్‌రెడ్డి, ఉపేందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.