పసికందు మృతదేహం వద్ద వివరాలు సేకరిస్తున్న పోలీసులు
శంషాబాద్: ఓ పసికందు మృతదేహాన్ని వీధికుక్కలు పీక్కుతిన్న సంఘటన శంషాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో గురువారం కలకలం రేపింది. బతికున్న పసి కందునే గుర్తు తెలియని వ్యక్తులు పడేసి ఉం డొచ్చని భావించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వీధి కుక్కలను పసికందు మృతదేహం వద్ద నుంచి తరిమేసిన స్థానికులు అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి వాకబు చేయగా అసలు విషయం బయటపడింది. ఈనెల 15న మధ్యాహ్నం రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి బస్తీ నుంచి గర్భిణి సునిధికుమార్ ఆమె భర్త రజనిసుమన్ శంషాబాద్ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. నొప్పులు వస్తున్న ఆమెను పరిశీలించిన ఆస్పత్రి వైద్యులు.. గర్భంలో ఉన్న శిశువు మృతిచెందినట్లుగా గుర్తించారు.
సాయంత్రం ఆరుగంటలకు ఆడ మృతశిశువును బయటికి తీసి వారికి అప్పగించారు. అయితే, భార్యాభర్తలు మాత్రం ఆ శిశువును ఆస్పత్రికి సంబంధించిన కొందరు సిబ్బందికి డబ్బులు ఇచ్చి ఖననం చేయాల్సిందిగా చెప్పి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది ఆస్పత్రి సమీపంలో మాములుగా గుంత తీసి అక్కడే పూడ్చిపెట్టారు. అయితే, సిబ్బంది సరిగా పూడ్చకపోవడంతో గురువారం ఉదయం కుక్కలు పసికందు మృతదేహాన్ని బయటకు లాగి నోటకరుక్కొని వీకర్ సెక్షన్ కాలనీకి పరుగులు పెట్టాయి. మృతదేహాన్ని తింటుండగా స్థానికులు వాటిని తరిమివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రి సిబ్బంది, వైద్యులను విచారించారు. మృతదేహానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పసికందు మృతదేహాన్ని వదిలేసి వెళ్లపోయిన వారు కూడా కేవలం పేర్లు మాత్రమే చెప్పారని, ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా ఇవ్వలేదని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment