సాక్షి,హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో హైదరాబాద్ జవహర్‌నగర్‌లో రెండేళ్ల బాలుడు విహాన్ మృతి చెందడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని బుధవారం(జులై 17) ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జీహెచ్‌ఎంసీ యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
పసి కందులపై కుక్కలు దాడులు చేస్తున్న ఘటనల మీద పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీధి కుక్కలకు టీకాలు వేయడంతో పాటు కుక్కల దాడులను నివారించడానికి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో కుక్కల దాడి చికిత్సకు అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖను సీఎం ఆదేశించారు.
జవహర్‌నగర్ మునిసిపల్ ఆఫీసు ముందు స్థానికుల ఆందోళన..
కుక్కలదాడిలో రెండేళ్ల బాలుడు విహాన్ మృతి చెందడంపై హైదరాబాద్ జవహర్‌నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆరోపించారు.
బుధవారం జవహర్‌నగర్ మునిసిపల్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విహాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment